సమస్యల స్వాగతం
ప్రభుత్వ విద్యారంగాన్ని కార్పొరేట్ వ్యవస్థకు దీటుగా తీర్చిదిద్దుతామని పాలకులు తరచూ చెప్పే మాటలు నీటిమూటలుగానే మిగులుతున్నాయి. బంగారు భవితపై కోటి ఆశలతో బడిబాట పడుతున్న చిన్నారులకు ఏటా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. పాఠశాలల్లో మౌలిక వసతులు కరువవడంతో విద్యార్థులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. సమస్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రభుత్వ స్కూళ్లలో ఈ సంవత్సరం కూడా చిన్నారులకు తిప్పలు తప్పేలా లేవు. వేసవి సెలవులు ముగిసి మరో నాలుగు రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో సమస్యలపై ‘న్యూస్‌లైన్ ఫోకస్’.
సూళ్లూరుపేట: పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం ఏళ్ల తరబడి అసంపూర్తిగా మిగలడంతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. మరోవైపు వందలాది పాఠశాలలు వివిధ సమస్యలకు నెలవుగా మారాయి. సూళ్లూరుపేట నియోజకవర్గంలో 309 ప్రాథమిక, 61 ప్రాథమికోన్నత, 39 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 248 పాఠశాలలకు ప్రహరీలు లేవు. 200 పైచిలుకు పాఠశాలల్లో వంట గదులు నిల్. 212 పాఠశాలలకు మరుగుదొడ్లు కరువయ్యాయి. మొత్తంగా 50 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించినా నీటి వసతి కల్పించకపోవడంతో నిరుపయోగంగా మారాయి.
223 పాఠశాలలకు వంటగదులు నిర్మించినా ఉపయోగించక శిథిలావస్థకు చేరాయి. ఇక అదనపు గదుల నిర్మాణం ఏళ్ల తరబడి సాగుతుండడం ప్రధాన సమస్యగా మారింది. 2004లో సూళ్లూరుపేట మండలంలోని ఆరు పాఠశాలలకు అదనపు గదులు మంజూరయ్యాయి. కుదిరి, ఎడబాళెం, మతకామూడి, మన్నేముత్తేరి, జంగాలగుంట, ఆబాక ప్రాథమిక పాఠశాలల ఆవరణలో అదనపు భవనాల నిర్మాణం చేపట్టారు. అయితే నిధులు చాలకపోవడంతో కాంట్రాక్టర్లు అసంపూర్తిగానే వదిలేశారు. అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు తక్కువ మొత్తంతో అంచనాలు రూపొందించడమే దీనికి ప్రధాన కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు చెట్ల కింద, వరండాల్లో చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు అసంపూర్తి భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారుతున్నాయి.