హనుమంతునిపై కల్యాణ వెంకన్న | Welfare came to Lord Hanuman | Sakshi
Sakshi News home page

హనుమంతునిపై కల్యాణ వెంకన్న

Published Thu, Oct 2 2014 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

Welfare came to Lord Hanuman

తిరుపతి రూరల్: తుమ్మలగుంట కల్యాణ వెంకటేశ్వరస్వామి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనంపై విహరిస్తూ స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య పూజా కైంకర్యాలు నిర్వహించారు. వాహన మండపంలో స్వామిని అభిషేకించి పట్టువస్త్రాలు, వివిధ స్వర్ణాభరణాలతో విశేషంగా అలంకరించారు.

అలంకార భూషితుడైన స్వామిని హనుమంత వాహనంపై కొలువుంచారు. అనంతరం స్వామి ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఆలయ అర్చక బృందం వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు. రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతంగా కళ్యాణ వెంకన్న గజ వాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. అంతకు ముందు శ్రీదేవి, భూదేవి సమేత స్వామికి ఊంజల్ సేవ శోభాయమానంగా నిర్వహించారు.
 
వేడుకగా వసంతోత్సవం


బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీదేవి భూదేవి సమేతుడైన కల్యాణ వెంకన్నకు వసంతోత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. ఉత్సవ మండపంలో స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి పాలు, పెరుగు, నారికేళ జలం, తేనె, నెయ్యి, చందనం వంటి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా స్వామికి వసంతోత్సవ సేవ జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఉపసర్పంచ్ గోవిందరెడ్డి, పంచాయతీ కార్యదర్శి వెంకటప్ప, ఆలయ ఈవో సుబ్బరామిరెడ్డి, వాహనాల ఇన్‌స్పెక్టర్ బాబురెడ్డి, ప్రకాష్, ఆలయాధికారి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement