
దుర్భర జీవితాలు గడుపుతున్న గిరిజనం
ప్రభుత్వాలు ఇస్తున్న సంక్షేమ ఫలాలు దరిచేరక రాష్ట్రంలో గిరిజనులు దుర్భర జీవితాలు గడుపుతున్నారని గిరిజన సమాఖ్య ...
► సంక్షేమ పథకాలు దరిచేరడంలేదు
► విద్య, వైద్యం, రాజకీయ, ఉద్యోగ రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి
► అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోనేటి దివాకర్‌రావు
పీలేరు: ప్రభుత్వాలు ఇస్తున్న సంక్షేమ ఫలాలు దరిచేరక రాష్ట్రంలో గిరిజనులు దుర్భర జీవితాలు గడుపుతున్నారని గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోనేటి దివాకర్‌రావు అన్నారు. సోమవారం సాయంత్రం పీలేరులో డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోనేటి దివాకర్‌రావు మాట్లాడుతూ గిరిజనులకు కేటాయించిన పథకాలు వారికే అందేలా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గిరిజనులకు రాజకీయ, విద్య, వైద్య, ఉద్యోగ రంగాల్లో సముచిత స్థానం కల్పిం చాలని కోరారు. నేటికీ గిరిజన గ్రామాల్లో కనీస వసతులకు నోచుకోక తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని తెలిపారు. దేశంలో సుమారు 10 కోట్లమంది, రాష్ట్రంలో 25 లక్షలకు పైబడి గిరిజన జనాభా ఉందన్నారు.
ప్రభుత్వ ఫలాలు వారికి అందకపోవడంతో మానవ అభివృద్ధి సూచికలో అత్యధిక పేదరికంలో గిరిజనులున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీవీ రమణ మాట్లాడుతూ గత నెల 14వ తేదీ నుంచి అంబేడ్కర్ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించామని చెప్పారు. ఐక్యరాజ సమితిలోనూ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమిస్తామని, ఆయన చూపిన మార్గంలో పయనిస్తామని చెప్పారు.
అంభేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాలులర్పించారు. అంతకు ముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీ. శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు జయచంద్ర, సతీస్, ఎస్.రాజశేఖర్, నారాయణ పాల్గొన్నారు.