నరసాపురం: పశ్చిమ డెల్టాపై రైల్వేశాఖ కినుక వహించింది. ప్రయాణికులను ఇబ్బందులు పాలుచేసే నిర్ణయాలతో టెన్షన్ పెడుతోంది. డెల్టా నుంచి రైల్వేశాఖకు వచ్చే ఆదాయం తక్కువేమీ కాదు. ఆక్వా ఉత్పత్తులు, కొబ్బరి, లేసు వ్యాపారాలు పెద్ద ఎత్తున సాగడంతో రైలు ప్రయాణాలపై ఇక్కడి ప్రజలు ఆధారపడ్డారు. ఈ నేపథ్యంలో నరసాపురం, భీమవరం ప్రాంతాల నుంచి పలు కొత్తరైళ్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్లు ఉన్నాయి. అయితే వీటిగురించి పట్టించుకోని రైల్వేశాఖ ఉన్న రైళ్లకే ఎసరుపెట్టింది. దీంతో ప్రయాణికుల్లో నిరసన వ్యక్తమవుతోంది. మన జిల్లా నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నా.. వారు పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
సింహాద్రి లింక్ రద్దు
నరసాపురం –విశాఖపట్నం మధ్య 30 ఏళ్లుగా సింహాద్రి లింక్ ఎక్స్‌ప్రెస్ నడిచేది. ఉదయం 9.45 గంటలకు నరసాపురం నుంచి ఆరు బోగీలతో ఈ రైలు బయలుదేరి ఉదయం 11 గంటలకు నిడదవోలుకు వెళ్లేది. నిడదవోలులో గుంటూరు నుంచి విశాఖపట్టణం వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కు ఈ ఆరుబోగీలను లింక్ చేసేవారు. అయితే మంగళవారం నుంచి లింక్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. దీనిస్థానంలో నిడదవోలుకు డెమో రైలు ప్రవేశపెట్టారు. ఇకపై విశాఖపట్నం వెళ్లాలంటే ఈ డెమోరైలులో నిడదవోలు వెళ్లి అక్కడ దిగి గుంటూరు నుంచి వచ్చే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. తిరిగి వచ్చేటప్పుడు కూడా సింహాద్రి ఎక్స్‌ప్రెస్ నుంచి నిడదవోలులో దిగి, నరసాపురం డెమో రైలు ఎక్కాలి. దీనివల్ల ప్రయాణికులు ఆదుర్దా పడి అవస్థలు పాలయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడే ఆస్కారమూ ఉంది. అయినా రైల్వేశాఖ ప్రయాణికుల సౌలభ్యాన్ని పట్టించుకోలేదు. నరసాపురం, పాలకొల్లు, భీమవరం, తణుకు, అత్తిలి ప్రాంతాల వారు ఈరైలులో నిత్యం విశాఖపట్నం వెళుతుంటారు. ముఖ్యంగా అన్నవరం పుణ్యక్షేత్రానికి, శ్రీకాకుళానికి తక్కువ చార్జీతో పగటిపూట నడిచే ప్రధాన రైలు ఇదే. అంతేకాకుండా నరసాపురం ప్రాంతానికి సరిహద్దుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు చుట్టుపక్కల ప్రాంతాల వారూ ఈ రైలులోనే ప్రయాణం చేస్తారు. అయితే రైల్వే శాఖ అధికారుల వాదన మరోలా ఉంది. లింక్ ఎక్స్‌ప్రెస్‌ను నడపడం కష్టంగా ఉందని వారు చెబుతున్నారు.
తిరుపతి ప్రయాణికులకూ షాక్
మరోవైపు తిరుపతి ప్రయాణికులకూ రైల్వేశాఖ షాక్ ఇచ్చింది. రోజూ సాయంత్రం 5.20 గంటలకు నరసాపురం–తిరుపతి మధ్య నడిచే తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 13 నుంచి ధర్మవరం వరకూ పొడిగించింది. ఇది ఉపయోగమే అయినా.. తిరుపతి రిజర్వేషన్ కోటాలో 60 సీట్లకు కోత పెట్టింది. ప్రస్తుతం ఈరైలులో నాలుగు స్లీపర్, రెండు ఏసీ, రెండు జనరల్ బోగీలు ఉన్నాయి. 30శాతం తత్కాల్ కోటా ఉండటంతో ఇప్పుడు ఈ రైలులో రిజర్వేషన్ దొరకాలంటే గగనం. ధర్మవరం వరకూ పొడిగించడంతో 60 బెర్తులను ధర్మవరం వరకూ కోటాగా నిర్ణయించారు. తిరుపతి వెళ్లేవారు రిజర్వేషన్ దొరక్కపోతే, ధర్మవరం వరకూ లేదా పాకాల వరకూ రిజర్వేషన్ చేయించుకోవాలి. తిరుగుప్రయాణంలోనూ అలాగే రిజర్వేషన్ చేయించుకోవాలి. దీనివల్ల ప్రయాణికులపై అదనపు భారం పడుతుంది. దీనిపై ప్రయాణికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రైల్వే సమస్యలను మన జిల్లా ఎంపీలు పట్టించుకోకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు.
లింక్ ఎక్స్‌ప్రెస్ రద్దు దారుణం
సింహాద్రి లింక్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేయడం దారుణం. నిడదవోలులో దిగి మళ్లీ వేరే రైలు ఎక్కాలంటే కష్టం. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలతో ఉండేవారికి మరీ ఇబ్బంది.
–తోట శ్రీధర్, నరసాపురం
Comments
Please login to add a commentAdd a comment