ఔరంగాబాద్ ఇసుక ర్యాంపు
జిల్లాలో ఇసుక కష్టాలకుతెరపడింది. గోదావరినదీ తీరంలో 33 అనువైనప్రదేశాల్లో ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు అనుమతించింది.దీంతో రోజుకు సుమారు30 వేల టన్నులకుపైగాఇసుక సేకరణ అవుతోంది. రోజువారీగా ర్యాంపుల నుంచి 18 వేల నుంచి 20 వేల టన్నులఇసుక రవాణా అవుతోంది.
కొవ్వూరు: అవసరాలకు సరిపడినంత ఇసుక అందుబాటులోకి రావడంతో సామాన్యులకూ సకాలంలో లభ్యమవుతోంది. మరోవైపు ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంది. అనుమతుల్లేకుండా, పరిమితికి మించి ఇసుక అక్రమంగా తరలిస్తే రూ.2 లక్షల వరకు జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిల్లావ్యాప్తంగా 14 చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్ బుకింగ్‌లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎక్కువ ర్యాంపులు అందుబాటులోకి రావడంతో ఇసుక దొరకడం సులభమైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక ర్యాంపుల్లో దోపిడీ సాగింది. ప్రస్తుతం ర్యాంపుల్లో ఏవిధమైన దోపిడీకి అవకాశం లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నూతన ఇసుక పాలసీని అందుబాటులోకి తెచ్చారు. ముందస్తుగా నియోజవర్గాలవారీగా రవాణా చార్జీలతో కలిపి ఇసుక ధరలను ప్రకటించారు. దీంతో ఇసుక అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట పడడంతో వినియోగదారులకు సకాలంలో ఇసుక లభ్యమవుతోంది.
రాష్ట్రంలో ఇసుకతవ్వకాల్లో జిల్లాదే ప్రథమ స్థానం
రాష్ట్రంలో ఇసుక తవ్వకాల్లోనూ, అమ్మకాల్లోనూ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈనెల 20న గరిష్టంగా జిల్లాలో 23,339 టన్నుల ఇసుక అమ్మకం ద్వారా జిల్లా మొదటి స్థానం దక్కించుకుంది. తూర్పుగోదావరి జిల్లా రెండోస్థానంలో నిలిచింది. సామాన్యులందరికీ ఇసుక అందుబాటులోకి తీసుకుని రావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించింది. వారోత్సవాల ప్రారంభం రోజు జిల్లా వ్యాప్తంగా 6,329 టన్నుల ఇసుక సేకరించారు. ప్రస్తుతం ఇసుక సేకరణ ఐదు రెట్లకుపైగా పెరిగింది. గత ప్రభుత్వంలో ఉన్న ఇరవై ఇసుక ర్యాంపుల సంఖ్యను వైఎస్సార్ సీపీప్రభుత్వం 33కి పెంచింది. ర్యాంపులు పెరగడం వల్ల ఇసుక తవ్వకాలు క్రమేణా పెరిగాయి.
ఇసుక అక్రమ రవాణాకు కళ్లెం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. జిల్లా వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఇసుక అక్రమ నిల్వలు చేసేవారిపైనా, అనుమతుల్లేకుండా రవాణా, తవ్వకాలు చేసిన వారిపైనా భారీగా కేసులు నమోదు చేస్తున్నారు. అక్రమ రవాణాకు వినియోగించిన వాహనాలను సీజ్ చేయడంతోపాటు, ఆయా వాహనాలు, బోట్ యాజమానులపైనా కేసు నమోదు చేయడం ద్వారా అక్రమాలకు కళ్లెం పడింది. గడిచిన ఆరు నెలల కాలంలో జిల్లా వ్యాప్తంగా 150 కేసులకుపైగా నమోదయ్యాయి. వీటిలో కొవ్వూరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలోనే 96 కేసులు నమోదు చేసి 561.5 యూనిట్ల ఇసుకను సీజ్ చేశారు. 212 మందిని అరెస్ట్ చేశారు. 134 వాహనాలను సీజ్ చేశారు. ఒక బోట్, ఒక జేసీబీ సైతం సీజ్ చేశారు. వీటిలో గరిష్టంగా సమిశ్రగూడెం పోలీసు స్టేషన్ పరిధిలో 40 కేసులు నమోదయ్యాయి. 45 వాహనాలను సీజ్ చేసి ఇక్కడ 84 మందిని అరెస్ట్ చేశారు. పెరవలి మండలంలో 95 యూనిట్లు ఇసుక, పది వాహనాలు స్వాధీనం చేసుకుని 20 మందిపై∙కేసులు నమోదు చేశారు. ఉండ్రాజవరంలో అక్రమంగా నిల్వ ఉంచిన 178 యూనిట్ల ఇసుకను సీజ్ చేశారు. 3 లారీలు సీజ్ చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. తాడేపల్లిగూడెం రూరల్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన 50 యూనిట్ల ఇసుక స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిడదవోలు పరిధిలో 36 యూనిట్లు స్వాధీనం చేసుకుని తొమ్మిది వాహనాలను సీజ్ చేసి, 17 మందిని అరెస్ట్ చేశారు. కొవ్వూరు రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో 42 యూనిట్లు సీజ్ చేసి 18 వాహనాలను స్వాధీనం చేసుకుని 21 మందిని అరెస్ట్ చేశారు. కొవ్వూరు పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో 32.5 యూనిట్లు సీజ్ చేసి 14 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసుల్లో 9 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. తాళ్లపూడిలో 2 కేసులు, దేవరపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఒక్క కేసు నమోదయ్యాయి.
ఆన్‌లైన్‌తో అవస్థలు
ఇసుక ఆన్‌లైన్ బుకింగ్‌లో కొంతమేర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాడపల్లి, ఔరంగాబాద్ వంటి పెద్ద ర్యాంపుల్లో స్టాకు పెట్టిన కొద్ది నిమిషాల్లోనే ఇసుక నో స్టాక్ అని చూపిస్తుంది. ప్రధానంగా బల్క్ బుకింగ్ కొన్ని ర్యాంపులకే ఎక్కువగా కేటాయించడం వల్ల సామాన్యులు బుకింగ్‌లో ఇబ్బందులు పడుతున్నారు. బుకింగ్ సమయంలో ఆధార్ నంబర్‌తోపాటు ఓటీపీ నంబర్ చెప్పాల్సి రావడం వల్ల కొన్ని∙ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నెట్‌వర్క్ సక్రమంగా లేకపోవడంతో సకాలంలో ఓటీపీలు రావడం లేదు. దీంతో కొద్దిమందికే ఇసుక బుక్ అవుతోంది. తద్వారా ఇసుక తాము అనుకున్న ర్యాంపుల నుంచి కాకుండా అందుబాటులో ఉండే ర్యాంపుల నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. తాళ్లపూడి మండలంలోని ర్యాంపుల్లో సాధారణంగా మెత్తని ఇసుక లభిస్తుంది. వాడపల్లి, ఔరంగాబాద్, కొవ్వూరులో మూడు ర్యాంపుల్లో ఎక్కువ శాతం గండర (గరుకు) ఇసుక లభిస్తుంది.
గండర ఇసుక కాంక్రీటు పనులు, నిర్మాణం(కట్టుబడి)కి ఎక్కువ వినియోగిస్తారు. మెత్తని ఇసుక కేవలం ప్లాస్టింగ్‌లకే వినియోగిస్తారు. అయితే వినియోగదారుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే ర్యాంపుల నుంచే ఇసుక తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని అధిగమించాలంటేబల్క్ బుకింగ్‌ను అన్ని ర్యాంపులకు కేటాయించడం ద్వారా కొంతమేరకు వినియోగదారులకు నచ్చిన ర్యాంపుల్లో ఇసుక బుకింగ్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఒక్కోసారి సర్వర్ డౌన్ కావడం, ఇసుకకు సొమ్ములు కట్ అయినా బుకింగ్ కాకపోవడం వంటి సాంకేతికపరమైన సమస్యలు వినియోగదారులను ఇబ్బందులు పెడుతున్నాయి.
అక్రమార్కులపై చర్యలు తప్పవు
ఏవిధమైన అనుమతుల్లేకుండా ఇసుక రవాణా చేస్తే ఉపేక్షించం. అక్రమార్కులకు రూ.2లక్షల వరకు జరిమానా, రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సబ్ డివిజన్ పరిధిలో ప్రధాన కూడళ్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రవాణా చేస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నాం. ఇసుక అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్ మార్కెట్‌లో విక్రయించినా కేసులు నమోదు చేస్తాం.– కె.రాజేశ్వరరెడ్డి, డీఎస్పీ,కొవ్వూరు
Comments
Please login to add a commentAdd a comment