జనాగ్రహం | West Godavari YSRCP Leaders Protests Against Attck On YS jagan | Sakshi
Sakshi News home page

జనాగ్రహం

Published Fri, Oct 26 2018 1:02 PM | Last Updated on Fri, Oct 26 2018 1:02 PM

West Godavari YSRCP Leaders Protests Against Attck On YS jagan - Sakshi

జగన్‌పై హత్యాయత్నానికి నిరసనగా కొవ్వూరులో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న సమన్వయకర్త తానేటి వనిత, నాయకులు

సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో ఒక దుండగుడు కత్తితో దాడికి తెగబడిన సంఘటనపై పశ్చిమలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ భరోసా కల్పిస్తున్న వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం చేశారనే వార్త తెలియగానే జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పార్టీ నేతలు, శ్రేణులు రోడ్లపైకి చేరుకున్నారు. టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనం, ర్యాలీలతో నిరసనలుమిన్నంటాయి. టీడీపీ ప్రభుత్వమే కావాలనే తమ అధినేతపై కుట్రలు చేస్తోందని ఆరోపిస్తూ పార్టీ నేతలు, శ్రేణులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు సైతం సర్కారుకు కొమ్ముకాస్తూ చేస్తున్న ప్రకటనలను ప్రజలు, నేతలు తప్పుబడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ నిరసన తెలిపారు. నర్సాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ సెంటర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం మార్టేరులో కన్వీనర్‌ చెరుకువాడ  శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. కొయ్యలగూడెంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో బుట్టాయగూడెంలో రాస్తారోకో చేసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. జీలుగుమిల్లిలో పార్టీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు.  కొవ్వూరులో సమన్వయకర్త తానేటి వనిత ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా చేశారు. గోపాలపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ద్వారకాతిరుమలలో నియోజకవర్గ సమన్వయర్త తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో రాస్తారోకో, నిరసన ప్రదర్శన నిర్వహించారు.

అధినేత వైఎస్‌ జగన్‌ ఆరోగ్యం కుదుటపడాలని చిన్నవేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్‌ఎలీజా ఆధ్వర్యంలో ఏలూరు, చింతలపూడి ప్రధాన రహదారిపై రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి, హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. పాలకొల్లు నియోజకవర్గం పోడూరు మండలం జిన్నూరులో జాతీయ రహదారిపై నియోజకవర్గ కన్వీనర్‌ గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఏలూరు ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, మండల అధ్యక్షులు మంచెం మైబాబు, మహిళా సమన్వయకర్త పిళ్ళంగోళ్ళ శ్రీలక్ష్మి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుడిదేశి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ధర్నా చేపట్టారు. రోడ్డపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పోలీసులు ఆందోళన చేస్తోన్న పార్టీ నేతలు, కార్యకర్తలను ఆందోళన చేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

చొదిమెళ్ళ, వెంకటాపురం, మాదేపల్లి తదితర గ్రామాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆందోళన చేశారు. మహిళలు కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. యువకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. చొదిమెళ్ళ రైతులు వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నిరసన తెలిపారు. దెందులూరులో చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన పార్టీ శ్రేణులు సాయంత్రం 6 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. భీమవరం మండలం కొత్తపూసలమర్రులో, వీరవాసరంలో జాతీయ రహదారిపై పార్టీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు. తాడేపల్లిగూడెంలో పోలీస్‌ ఐలాండ్‌ సెంటర్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నిరసన ప్రదర్శనలు చేశారు. పెంటపాడులో గేట్‌ సెంటర్‌లో నిరసనలు తెలిపారు. నిడదవోలు మండలం తాడిమళ్ళలో వైసీపీ కార్యకర్తలు ధర్నా చేశారు. పెరవలి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో కాళ్ల, ఆకివీడు, ఉండి మండలాల్లో ధర్నా, మానవహారం, రాస్తారోకో చేశారు. తణుకులో నరేంద్ర సెంటర్‌ పార్టీ నాయకులు రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement