‘వాటా’న్ ఐడియా! | What An idea! | Sakshi
Sakshi News home page

‘వాటా’న్ ఐడియా!

Published Wed, Nov 20 2013 3:32 AM | Last Updated on Thu, Apr 4 2019 5:41 PM

What An idea!

మామూళ్ల విషయంలో తేడాలొస్తే పై అధికారులు వేధింపులకు పాల్పడటం.. అప్పటికీ లొంగకపోతే సదరు సిబ్బందిపై చర్యలకు సిఫారసు చేయడం పరిపాటి. ఈ విషయంలో రవాణా శాఖ  ఉప కమిషనర్ కార్యాలయం సిబ్బంది అదృష్టవంతులనే చెప్పాలి. అక్రమార్జన విషయంలో ఓ అధికారి చెప్పిన పెద్దరాయుడి తీర్పు అందరికీ ఆమోదయోగ్యంగా మారింది. సమకూరిన సొమ్ములో 60-40 ఒప్పందంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందిలేకుండా కుదిర్చిన బేరం విషయం తెలిసి ‘వాటా’న్ ఐడియా సర్‌జీ అని కీర్తించని సిబ్బంది లేకపోవడం గమనార్హం.
 
 కర్నూలు, న్యూస్‌లైన్: రవాణా శాఖ ఉప కమిషనర్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారింది. కార్యాలయంలో పనిచేసే గుమాస్తాలు ఏజెంట్లతో చేతులు కలిపి నిబంధనలకు విరుద్ధంగా వాహన యజమానుల నుంచి మామూళ్లు దండుకోవడం రివాజుగా మారింది. అయితే ఇటీవల తన వాటా మాటేమిటంటూ ఓ అధికారి కింది స్థాయి సిబ్బందిని నిర్మొహమాటంగా నిలదాశారు.
 
 తర్జనభర్జనల మధ్య చివరకు అక్రమంగా సమకూరిన సొమ్ములో వాటాలు వేసుకుని పంచుకునేలా ఒప్పందానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కుదిరిన బేరం ప్రకారం 60 శాతం కింది స్థాయి సిబ్బందికి.. 40 శాతం తనకు ఇచ్చేలా ఆ అధికారి తీర్పు చెప్పినట్లు తెలిసింది. ప్రతిరోజూ వంద నుంచి రెండు వందల దాకా వివిధ రకాల ఫైళ్లు కార్యాలయానికి వస్తుంటాయి. ముఖ్యంగా వాహన బదలాయింపులు, పర్మిట్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌లు, వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఫైళ్లే ఇందులో అధికంగా ఉంటున్నాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానాతో పాటు అదనంగా వెయ్యి నుంచి రూ.3వేల దాకా ఫైళ్ల ‘సామర్థ్యాన్ని’ బట్టి మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు రూ. 50వేల నుంచి రూ.75 వేల దాకా కార్యాలయంలో అక్రమార్జన సాగుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ మొత్తాన్ని నూతన ఫార్ములా ప్రకారం ఎంచక్కా పంచుకుంటున్నట్లు సమాచారం. దళారులను(ఏజెంట్లను) కార్యాలయంలోకి రాకుండా అడ్డుకోవాల్సిన అధికారులే వారిని ప్రోత్సహిస్తున్నారు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన నేపథ్యంలో వాళ్లు.. వీళ్లు అనే తేడా లేకుండా అన్ని స్థాయిల సిబ్బంది ఈ వ్యవస్థను పెంచి పోషిస్తున్నారు.
 
 దీంతో ఏ పని కోసం వెళ్లిన వారైనా విధిలేని పరిస్థితుల్లో ఏజెంట్లనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఫలితంగా జేబులు గుల్ల చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. ఒప్పందం ప్రకారం సక్రమంగా తన శాతం వాటా ఇవ్వలేదనే కారణంతో రెండు వారాల క్రితం కార్యాలయంలో ఆ అధికారి హల్‌చల్ సృష్టించారు. వివిధ పనులు నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ఏజెంట్లపై చిందులు తొక్కి వారి జేబుల్లోని డబ్బులన్నీ లాక్కుని బయటకు నెట్టేయడం విమర్శలకు తావిచ్చింది. కార్యాలయంలో కొనసాగుతున్న దందాపై ఇటీవల ఏసీబీ అధికారులు దాడులు చేసినప్పటికీ అధికారుల్లో మార్పు రాకపోవడం గమనార్హం.
 
 బ్యాక్‌లాగ్ ఎంట్రీ పేరుతో అదనపు వసూళ్లు
 రవాణా శాఖలో తెచ్చిన మార్పులతో వినియోగదారులకు మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. పరిపాలన సౌలభ్యంతో పాటు వాహనదారులకు విస్తృత సేవలందించేందుకు డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి కేంద్రీకృత సేవల(త్రీ టైర్స్) విధానం అమల్లోకి వచ్చింది. 2002 నుంచి డీటీసీ కార్యాలయంలో టూటైర్ సిస్టమ్ ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నారు. ప్రస్తుతం త్రీటైర్ సిస్టమ్ అమల్లోకి వచ్చినందున టూటైర్‌లోని డేటా మొత్తం త్రీటైర్‌లోకి మార్పు చేయాలి. అందుకోసం బ్యాక్‌లాగ్ ఎంట్రీ పేరుతో వినియోగదారుల నుంచి అదనంగా రూ.100 వసూలు చేస్తున్నారు.
 
 అయితే కార్యాలయం ద్వారా అందించే సేవలకు చలానా చార్జీలు గతం కంటే రూ.50 నుంచి 200 వరకు అదనపు భారం పడుతుండటంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. కార్యాలయంలో ఏ పని కావాలన్నా వినియోగదారుని పేరు, పూర్తి చిరునామా, మండలం పేరు, పిన్‌కోడ్, మొబైల్ నంబర్ నమోదు తదితర నిబంధనలు తప్పనిసరి చేయడంతో టూటైర్ సిస్టమ్‌లోని డేటా త్రీటైర్ సిస్టమ్‌లోకి అనుసంధానం చేయించుకునేందుకు వినియోగదారులు తీవ్ర ఇక్కట్లకు లోనవుతున్నారు. నేరుగా వెళ్లిన వారికి కొర్రీలతో వాయిదాలు వేస్తూ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. ఏజెంట్ల ద్వారా వెళ్లిన వారికి అందే ముడుపులను బట్టి వెంటనే ఫైళ్లు చకచకా క్లియర్ చేసి పంపుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో వినియోగదారులు వారినే ఆశ్రయించాల్సి వస్తోంది. ఏదేమైనా కార్యాలయంలో కొత్తగా కుదిరిన ఒప్పందం అధికారికి, సిబ్బందికి ఆమోదయోగ్యంగానే ఉన్నా.. వినియోగదారులకు మాత్రం నిత్య నరకం చూపుతోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement