సాక్షి, కర్నూల్: ఆగట్టునుంటావా... ఎంకప్ప... ఈ గట్టునుంటావా!.. ఎంకప్ప యాగట్టునుంటావో.. రోంత సూసుకోని దుంకప్ప.... లెక్కలేసుకోని ఎగరప్ప.. ఎంకప్పో... ఎంకప్పా... అంటూ వల్లె నెత్తికింద పెట్టుకోని కాలు మింద కాలు ఏస్కోని కట్టమింద పాడుకుంట పండుకున్నడు తిమ్మప్ప.
ఏం బావా! పాట నీ యిస్టమొచ్చినట్ల మార్సుకోని మార్సుకోని పాడుతుండవ్. ఆగట్టునుంటావా! ఈగట్టునుంటావా నాగన్న అని పాడాల్ల గదా!... అడిగాడు నెట్టేకల్లు కట్ట మీద కూచుంటూ.
ఏమిలే నెట్టికంటి! తిమ్మప్ప అంటే ఏమన్న తిక్కప్ప అనుకుంటివా! నాను పాడే పాటకి అర్తం ఉండాది. నీది రంగస్థలం పాట.. నాది రాజకీయ రంగస్థలం పాట... లేచికూర్చుంటూ చెప్పాడు తిమ్మప్ప.
ఎట్టెట్టా! రాజకీయ రంగస్థలం పాటనా! వాయబ్బో! నీకు అన్ని రకాల పాటలు తెల్సా! ఎంకప్ప... ఎంకప్ప అని పేరు మార్సి పాడుతుండవ్.. ఎంకప్పంటే మన బాయి కాడి ఎంకప్పనా!...
అడిగాడు నెట్టెకల్లు.
బాయికాడి ఎంకప్ప కాదురా! సెరువు కాడి పెద్ద కప్ప. యిప్పుడు కప్పలు సిగ్గుపడిపోతున్నాయంట. ఆగట్టున ఉండే కప్ప ఈ గట్టున ఉండే కప్ప పాడుకుంటున్న పాట యిది. నాయకులు ఆ పార్టీ నుండి ఈ పార్టీలోకి దుంకినట్ల నీకు దుంకనీక శ్యాతనయితదా! అని అడుగుతున్నాయంట... చెప్పాడు తిమ్మప్ప.
ఓహోహ్హో! బలే చెప్పినావ్ బావ!... అంటూ గట్టిగా నవ్వాడు నెట్టేకల్లు. మన మురికి కాల్వల కాడ కప్పలు గద దుంకినట్ల యిప్పుడు నాయకులు కండ్లు మూసి తెర్సే లోపల పటపటమని ఏరే పార్టీలోకి దుంకుతున్నారన్నా... చెప్పాడు నెట్టేకల్లు.
కాల్వలుల్ల, బాయిలల్ల, సెర్వులల్ల కప్పలే సిగ్గుతో తలకాయలు దించుకుంటున్నాయంట. వాయబ్బ.. మనకు నాలుగు కాళ్లుంటే గూడ నాయకుల లెక్క గబగబ దుంకల్యాకపోతుండమే.. వాలు రొండు కాల్లతోని లటుక్కున దుంకుతున్నారే అని నాయకులకెల్లి వారకంట సూసి మూతి ముడ్సుకుంటున్నాయంట... చెప్పాడు తిమ్మప్ప.
అవు కద బావా! అస్సలు రోంత గూడ ఎనక ముందు ఆలోసన గూడ సెయ్యకుండ దుంకేది నేర్సుకున్నరీల్లు. అవు ఒక పార్టీ గుర్తు మింద గెల్సినాము.. గెల్సిన పార్టీ యింత బువ్వ పెట్టింది. ఇంత బట్ట యిచ్చింది. దానికి మర్యాద యిద్దామని లేదే. టిక్కెట్టు రాలేదంటూ లటుక్కున దుంకేదే. తిన్న తల్లెకే బొర్రలు పెట్టేదంటే యిదే సూడు బావా! చెప్పాడు నెట్టేకల్లు.
నెట్టేకల్లు.. రానురాను నాయకులు శానా రాటుదేలిపోతుండరు. దుడ్లు సేతిలో పెడితే సిగ్గుశరం గాదు యాది యిడ్సమంటె అది యిడ్సనీక రడీ అయిపోతరు. ఒరే వీల్లని సూసి కప్పలే గాదు.. ఊసరివెల్లి గూడా సిగ్గుపడ్తుందంట... చెప్పాడు తిమ్మప్ప.
ఊసరవెల్లి... అంటే ఏంది బావా! అదెట్లుంటది. దాంతోటి గూడా మన నాయకులు పోటీ పడ్తరా!.. అడిగాడు నెట్టేకల్లు.
ఒరె నెట్టిగా! పల్లెటూర్ల పుట్టి పెరిగి ఊసరవెల్లిని సూసిలేవారా! ఊసరవెల్లి అంటే రంగులు మారుస్తుంటది. యా రంగు సెట్టు మింద గూసుంటే ఆ రంగు మార్సుకొని ఎవ్వురికి కనపడకుండ దొంగ సూపులు సూస్తుంటది. అట్ల మన ఘనమైన నాయకులు నిమిసానికో రంగు మారుస్తరు. పాపం ఊసరవెల్లి కొన్ని కొన్ని రోజులకొక రంగు మారిస్తే ఈల్లు గంటగంటకు రంగులు మారుస్తరు. సూడు మల్ల బి–ఫారం వచ్చేవరకు ఎవరెవరు ఎన్ని రంగులు మారుస్తరో... యాందాట్లో దూరి నామినేసను ఏస్తరో వాల్లకే తెలదు... చెప్పాడు తిమ్మప్ప.
– కర్నూలు (కల్చరల్)
Comments
Please login to add a commentAdd a comment