రక్తనిధి.. ఏదీ చిత్తశుద్ధి | where is responsiblity | Sakshi
Sakshi News home page

రక్తనిధి.. ఏదీ చిత్తశుద్ధి

Published Sun, Apr 19 2015 2:26 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM

where is responsiblity

నెల రోజుల క్రితం గైనిక్ విభాగంలో రూరల్ ప్రాంతానికి చెందిన శాంతి(34) అనే మహిళ  రక్తహీనతతో ఆస్పత్రిలో చేరారు. వైద్యులు పరీక్షించగా హెచ్‌బీ 5 గ్రాములని తేలింది. తక్షణమే రక్తం ఎక్కించాలని సూచించారు. బీ పాజిటివ్ రక్తం అవసరమైంది. దీంతో రక్తనిధి కేంద్రంలో గ్రూపింగ్, క్రాస్ మ్యాచింగ్‌కు అందించారు. ఆ రోజు ఓ వైద్యుడు సెలవులో ఉన్నారు. మరో వైద్యురాలు తన విధులు నిర్వర్తించి వెళ్లిపోయారు. దీంతో ఆమెకు రక్తం అందించడానికి ఒక రోజు నీరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ఘటనలు వారంలో రెండు, మూడు సార్లు చోటు చేసుకుంటున్నాయి.     
 
 అనంతపురం మెడికల్ : ఆస్పత్రిలోని రక్తనిధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోతోంది. సిబ్బంది కొరతతో రోగులకు రక్తం ఆలస్యంగా అందుతోంది. దీనిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఆస్పత్రిలో ప్రతి రోజూ 50 మందికిపైగా రక్తం అందించాల్సి ఉంటుంది. ఇటువంటి కీలకమైన వార్డుకు అవసరమైన సిబ్బంది లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
 
 యూనిట్‌కు ఇద్దరు వైద్యులే..
 బ్లడ్‌బ్యాంకుకు ఇద్దరు వైద్యులు మాత్రమే ఉన్నారు. ఇన్‌చార్జ్ డాక్టర్ శివకుమార్‌తో పాటు వైద్యురాలు డాక్టర్ మమత. వీరిలో ఎవరూ సెలవులో వెళ్లినా రోగులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. రక్తం సకాలంలో అందక ప్రాణాలు పోయిన దాఖలాలు లేకపోలేదు. అటువంటిది రక్తం అందించే యూనిట్‌లో కేవలం ఇద్దరు వైద్యులు మాత్రమే అందుబాటులో ఉండడం పెద్ద చర్చనీయాంశమైంది. రౌండ్ ద క్లాక్ పనిచేసే యూనిట్‌కు రాత్రి వేళల్లో వైద్యులుండరు. బ్లడ్ బ్యాంకు ఇన్‌చార్జ్ డాక్టర్ శివకుమార్ డిప్యూటీ ఆర్‌ఎంఓ, క్యాజువాలిటీ ఇన్‌చార్జ్‌గా, ప్రతి సోమవారం, నెలలో మూడవ బుధవారం గ్రీవెన్స్‌కు వెళ్తుంటారు. దీంతో రక్తనిధిపై దృష్టిసారించేందుకు వీల్లేకుండా పోతోంది. బాధ్యతలు అధికంగా ఉండడంతో రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరో ముగ్గురు వైద్యులుంటే ఎటువంటి సమస్య ఉండదని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.
 టెక్నీషియన్, స్టాఫ్‌నర్సుల కొరత ప్రధానంగా రక్తం గ్రూపింగ్ చేయడానికి టెక్నీషియన్‌లదే కీలకపాత్ర. అర్ధరాత్రి వేళల్లో టెక్నీషియన్‌లు అసలుండరు. స్టాఫ్‌నర్సులపైనే భారం పడుతోంది. స్టాఫ్‌నర్సుల్లో కొంత మందికి గ్రూపింగ్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. ప్రస్తుతానికి ఐదు మంది అందుబాటులో ఉన్నా...వీరిలో ఎవరో ఒకరు సెలవులో వెళితే రక్తనిధిపై అవగాహన లేని వారు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది.
 
 పొరపాటున ఏమైనా జరిగితే దేవుడే దిక్కు అన్నట్లు ఇక్కడ పరిస్థితి తయారైంది. దీంతో పాటుగా టెక్నీషియన్‌లది అదే సమస్య. ఆరు మంది అందుబాటులో ఉన్నా...ఇంకా నలుగురు కావాల్సి ఉంది. ఎప్పటికి సమస్య తీరుతుందో చూడాలి. ఇదిలా ఉండగా కొంత మంది టెక్నీషియన్‌లు ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇన్‌చార్జ్ వైద్యులు అందుబాటులో లేకపోతే వారు ఆడిందే ఆట పాడిందే పాట. కేంద్రంలో అందుబాటులో ఉండకుండా పత్తాలేకుండా పోతున్నారు. అనేక వార్డుల్లో టెక్నీషియన్‌లు అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. రక్తం అవసరమై పరుగు పరుగన వస్తే ఇక్కడ వారు కన్పించరు. దీంతో రోగుల బంధువులు తీవ్ర మనస్తాపానికి గురైన సందర్భాలూ ఉన్నాయి.
 
 నెగిటివ్ రక్తం నిల్
 నెగిటివ్ బ్లడ్ దొరక కపోవడం పెద్ద సమస్యగా తయారవుతోంది. ఆస్పత్రిలో నెగిటివ్ రక్తం లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 185 యూనిట్ల రక్తం అందుబాటులో ఉన్నా...అందులో ఒక్క నెగిటివ్ రక్తం లేకపోవడం గమనార్హం. స్వచ్ఛంద సంస్థలు, దాతలిచ్చే నెగిటివ్ రక్తం రోగులకు చాలడం లేదు. ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందించి ప్రాణాలు పోద్దామని చెబుతున్నా..ప్రజల్లో చైతన్యం రావడం లేదు. అనేక రక్తదాత సంస్థలు పేరుకు మాత్రమే ఉన్నాయని చెప్పాలి.
 
 రాజకీయ నాయకుల వద్ద అది చేశాం..ఇది చేశామని నాలుగు డబ్బులు వెనుకేసుకోవడం తప్ప ఆస్పత్రికి అందించిన దాఖలాలు తక్కువే. జిల్లాలో పదుల సంఖ్యలో రక్తదాత సంస్థలున్నా...అందులో రెండు మూడు మినహా పెద్దగా రక్తాన్ని డొనేట్ చేయడం లేదు. కేవలం స్వచ్ఛంద సంస్థలని చెబుతూ సామాన్య ప్రజానీకాన్ని బురిడీ కొట్టిస్తున్నాయి. యువత రక్తం అందించడానికి పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నా...క్యాంప్‌లు నిర్వహించి తీసుకునే వారే కరువయ్యారు. ప్రభుత్వం రక్తనిధిని పెంచుకోవడంలో పూర్తీగా విఫలమైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.    
 
 పని ఒత్తిడి అధికంగా ఉంది
 రక్తనిధి కేంద్రంలో వైద్యులు, సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. దీని ద్వారా పని ఒత్తిడి అధికమైంది. టెక్నీషియన్‌లు, శిక్షణ పొందిన స్టాఫ్‌నర్సులను తమ యూనిట్‌కే శాశ్వతంగా కేటాయించాలి. అరకొర సిబ్బందితో మెరుగైన సేవలందిస్తున్నాం.     
 - డాక్టర్ శివకుమార్, బ్లడ్ బ్యాంకు ఇన్‌చార్జ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement