సాక్షి, నల్లగొండ : గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యం నీరు గారుతోంది. నీటి నాణ్యత, మలినాల పరిశీలన జరగడమే లేదు. పరీక్షకు ఉపయోగించే కిట్లు నామరూపాల్లేకుండా పోయాయి. రసాయనాలు మట్టిలో కలిసిపోయాయి. దీంతో గ్రామీణ ప్రజలకు కలుషిత నీరే దిక్కవుతోంది.
గామీణులకు పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇది మంచిదే అయినా ఆచరణకు నోచుకోకపోవడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. రెండేళ్లుగా గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేకాధికారులు నీటి సరఫరాను పట్టించుకోలేదు. ఫలితంగా గ్రామీణులకు అపరిశుభ్ర నీరే దిక్కవుతోంది.
లక్ష్యం నీరుగార్చారు
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రామ పంచాయతీల్లో నీటి పరీక్ష విధానాన్ని 2007లో ప్రవేశపెట్టారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తోంది. వర్షాకాలంలో నీరు ఎక్కువగా కలుషితమయ్యే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి ప్రతి గ్రామపంచాయతీకి గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో నీటి పరీక్ష కిట్లు, పరీక్ష కోసం అవసరమయ్యే ర సాయనాలు అందజేశారు. వీటి ద్వారా నీటి పరీక్షలు జరిపి స్వచ్ఛతను నిర్ధారించాల్సి ఉంటుంది. శుభ్రమైనవి అని తేలితేనే సదరు నీటిని ప్రజలకు సరఫరా చేయాల్సి ఉంది. దీనికి అవసరమయ్యే కిట్టు కోసం అప్పట్లో ప్రభుత్వం రూ.2,200 ఖర్చు చేసింది.
ఆనవాళ్లే లేవు
నీటి పరీక్షా విభాగం నిర్వహణ కోసం ప్రతి గ్రామం నుంచి ఓ అంగన్‌వాడీ కార్యకర్త, ఒక యువకుడు, పొదుపు సంఘం సభ్యురాలితో పాటు మరో ఇద్దరు గ్రామస్తులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. నీటి పరీక్షలు నిర్వహించే విధానంపై వీరికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. కమిటీ సభ్యులకు ప్రతి నెలా రూ.1,200 గౌరవ వేతనం అంద జేయాలని నిర్ణయించారు. కొంత కాలం పాటు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. పత్రి 10, 15 రోజులకు ఒకసారి నీటి పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత పరీక్షలు చేయడం మర్చిపోయారు. కిట్లు అటకెక్కాయి. ప్రస్తుతం సదరు కిట్ల, రసాయనాల ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు.
అధికారుల నిర్లక్షమే..
నీటి స్వచ్ఛత పరీక్షించే బాధ్యత ఆయా గ్రామ పంచాయతీలకే అప్పగించారు. కొన్నాళ్లు పరీక్షలు నామమాత్రంగా చేపట్టారు. రానురాను వీటికి స్వస్తి పలికారు. ప్రభుత్వం కిట్లు అందించే సమయంలో 100 సార్లు పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన రసాయనాలు కూడా ఇచ్చారు. ఆతర్వాత అవసరమయ్యే రసాయనాలను గ్రామ పంచాయతీ నిధులతో కొనుగోలు చేయాల్సి ఉంది.
కానీ ఏ ఒక్క గ్రామ పంచాయతీలోనూ ప్రస్తుతం నీటి స్వచ్ఛత పరీక్షలు జరగడం లేదు. రెండేళ్లుగా గ్రామ పంచాయతీలకు కార్యవర్గాలు లేకపోవడం, ప్రత్యేకాధికారులు పట్టించుకోకపోవడంతో పరీక్షలు కాలగర్భంలో కలిసిపోయాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వర్షాలకు నీరు కలుషితమయ్యే అవకాశం ఉంది. కలుషిత నీరే తాగితే ప్రజలకు వాంతులు, విరేచనాలు, కలరా వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఇటీవలే పల్లెలో కొత్త పాలకవర్గాలు కొలువుదీరా యి. అధికారులు మేల్కొని నీటి పరీ క్ష విధానాన్ని పునఃప్రారంభిం చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. తమను రోగాల బారి నుం చి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
స్వచ్ఛత ఎక్కడ?
Published Sun, Aug 11 2013 2:14 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM
Advertisement