
2016 అక్టోబర్ 24న ఏపీ ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన మావోల మృతదేహాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/అమరావతి: మావోయిస్టులను కోలుకోలేని విధంగా దెబ్బతీసిన రామగూడ ఎన్‌కౌంటర్ జరిగి సరిగ్గా నేటికి ఏడాదవుతోంది. గతేడాది అక్టోబర్ 24న ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఏవోబీ) పరిధిలో మల్కన్‌గిరి జిల్లా రామగూడ గ్రామానికి సమీపంలోని దట్టమైన అటవీప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 32 మంది మావోయిస్టులు పిట్టల్లా రాలిపోయారు. పార్టీ ప్లీనరీకి వచ్చిన అగ్రనేతలు బాకూరి వెంకటరమణ అలియాస్ గణేష్, చాముళ్ల కృష్ణ అలియాస్ దయా, ఐనాపర్తి దాసు అలియాస్ మధు, పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ(ఆర్కే) కుమారుడు మున్నా తదితరులు మరణించారు. మావోల షెల్టర్ జోన్‌గా భావించే ఏవోబీ కటాఫ్ ఏరియాలో జరిగిన ఈ మారణకాండ దేశంలోనే అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా రికార్డులకెక్కింది. 2008లో బలిమెల రిజర్వాయర్‌లో 38 మంది గ్రేహౌండ్స్ పోలీసులను పొట్టనపెట్టుకున్న మావోయుస్టులపై ప్రతీకారంగానే రామగూడ ఎన్‌కౌంటర్‌లో 32 మందిని పోలీసులు హతమార్చారు.
ఏవోబీలో మావోయిస్టుల ఉనికికే సవాల్ విసిరిన ఆ ఎన్‌కౌంటర్ అనంతరం మావోయిస్టు పార్టీ అగ్రనేత రామకృష్ణ(ఆర్కే) ఆచూకీపై కొన్నాళ్లు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ‘ఆపరేషన్ ఆర్కే’ పేరుతోనే రామగూడ ఎన్‌కౌంటర్ జరిగినట్లు అప్పట్లో పోలీసు అధికారులు సైతం అంగీకరించినప్పటికీ ఆయన ఏమయ్యాడన్నది ఎవరూ చెప్పలేకపోయారు. మరోవైపు అప్పట్లోనే మావోయిస్టు పార్టీ మల్కన్‌గిరి డివిజన్ కార్యదర్శి వేణు పేరిట వెలువడిన ప్రకటన కలకలం రేపింది. ఎన్‌కౌంటర్‌లో ఆర్కేను కూడా దారుణంగా చంపేశారని వేణు పేరిట ప్రకటనలు వెలువడ్డాయి.
అయితే, ఇవన్నీ పోలీసుల నాటకంలో భాగమేనని.. పోలీసుల అదుపులోనే ఆర్కే ఉన్నాడని, వెంటనే ఆయనను కోర్టులో హాజరుపర్చాలని ఆర్కే సతీమణి పద్మ, విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. డీజీపీ సాంబశివరావు మాత్రం ఆర్కే తమ అదుపులో లేడంటూ చెప్పుకొచ్చారు. దాదాపు పదిరోజుల పాటు నరాలు తెగే ఉత్కంఠకు తెరతీస్తూ గతేడాది నవంబర్ 3వ తేదీన వరవరరావు... ఆర్కే సేఫ్ అంటూ ఓ ప్రకటన చేశారు. సురక్షిత ప్రదేశంలో ఆర్కే క్షేమంగానే ఉన్నాడంటూ తమకు, కుటుంబ సభ్యులకు పక్కాగా సమాచారం వచ్చిందన్నారు. దాంతో ఆర్కే ఆచూకీపై గందరగోళానికి తెరపడింది.
ప్రతి సవాల్ విసురుతున్న మావోలు
వాస్తవానికి ఏవోబీలో భారీ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులను చావుదెబ్బ తీశామని పోలీసులు అంచనాకొచ్చారు. అయితే, ఊహించని రీతిలో మావోయిస్టులు వేగంగా కోలుకున్నారనే చెప్పాలి. ఆ నాటి ఎన్‌కౌంటర్‌తో బలహీన పడినట్టుగా కనిపించిన మావోయిస్టులు తదనంతరం బలంగానే ఉన్నామని హింసాత్మక సంఘటనల ద్వారా నిరూపిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో మావోయిస్టులే లేరని హోంమంత్రి చినరాజప్ప ఇటీవల ప్రకటించడం గమనార్హం.
రగులుతున్న మావోయిస్టులు
రామగూడ ఎన్‌కౌంటర్‌కు ఏడాది కావొస్తుండటంతో ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందంటూ పోలీసులకు నిఘావర్గాలు సమాచారం అందించాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ నెల 24న అమరవీరుల వర్థంతి సభలు నిర్వహించేలా మావోయిస్టులు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 24 నుంచి 30వ తేదీలోగా మావోయిస్టులు ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందని నిఘావర్గాలు అప్రమత్తం చేయడంతో డీజీపీ నండూరి సాంబశివరావు హైఅలర్ట్ ప్రకటించారు. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, తీవ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేసినట్టు తెలిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు.
ఏడాదిగా ఎక్కడ?
ఏవోబీ నుంచి సురక్షిత ప్రదేశానికి ఆర్కేను తరలించారని భావించినా... ఏడాదైనా ఆయన గురించి ఒక్క ప్రకటనైనా రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆర్కే ఆచూకీపై స్పష్టత లేకపోవడంతో ఆయన ఏమయ్యారన్న ప్రశ్న ఇప్పుడు తెరపైకి వస్తోంది. ఏవోబీలో ప్రధాన భాగమైన ఈస్ట్ డివిజన్‌లో వరుసగా పాతికేళ్ల నుంచి క్యాడర్‌కు అందుబాటులో ఉంటూ వస్తున్న ఆర్కే ఈ ఏడాదిలో మాత్రం ఎవరికీ కనిపించలేదు. కనీసం ఆయన ఎక్కడ, ఎలా ఉన్నాడనే సమాచారం కూడా క్యాడర్‌కు తెలియలేదు. ఇక ఆర్కేతోపాటు ఆనాటి ఎన్‌కౌంటర్ ఘటన నుంచి కనిపించకుండా పోయిన చలపతి, ఆయన భార్య అరుణల ఆచూకీపై కూడా నేటికీ స్పష్టత లేదు.
Comments
Please login to add a commentAdd a comment