గౌతం సవాంగ్
డీజీపీ పోస్టు దక్కక అసంతృప్తితో ఉన్న విజయవాడ సీపీ గౌతం సవాంగ్ తదుపరి పోస్టింగ్ ఏమిటి? ఆయన ఆశిస్తున్నట్లుగా ఏసీబీ డీజీ పోస్టు అయినా దక్కుతుందా లేదా?.. అందుకు కూడా మంత్రి లోకేష్ అడ్డుపడితే ఇక ఆయన కేంద్ర సర్వీసుకు వెళ్లిపోతారా ? ప్రస్తుతం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన వ్యవహారం ఇదే. సీపీ గౌతం సవాంగ్ సీఎం చంద్రబాబుతో బుధవారం భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. విజయవాడ కొత్త సీపీ ఎవరో అన్నది కూడా తేలాల్సి ఉంది. అదనపు డీజీ స్థాయి అధికారి అయితే ద్వారకా తిరుమలరావు, నళినీ ప్రభాత్ ... ఐజీ స్థాయి అధికారి అయితే మహేష్ చంద్ర లడ్హా, రవిశంకర్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
సాక్షి, అమరావతిబ్యూరో : దాదాపు ఖరారైందనుకున్న డీజీపీ పోస్టు చివరి నిమిషంలో చేజారిపోవడంతో సీపీ గౌతం సవాంగ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆయన్ను మరో పోస్టుకు బదిలీ చేయడం దాదాపు ఖాయమైంది. ఏసీబీ డీజీగా వెళ్లాలని సవాంగ్ భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండే డీజీ క్యాడర్ పోస్టులు రెండే ఉన్నాయి. ఒకటి డీజీపీ కాగా మరొకటి ఏసీబీ డీజీ. డీజీపీగా అవకాశం రానందున ఏసీబీ డీజీగా వెళ్లేందుకే సవాంగ్ మొగ్గుచూపిస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఏసీబీ వ్యవస్థను మంత్రి లోకేష్ ప్రభావితం చేస్తుండటం గమనార్హం. మంత్రి లోకేష్‌తో ఏర్పడిన సాన్నిహిత్యమే ఆర్.పి.ఠాకూర్‌కు సానుకూలంగా మారి డీజీపీగా ఎంపికకు దారితీసిందనే విమర్శలున్నాయి. మరి ఏసీబీ డీజీగా సవాంగ్ నియామకానికి మంత్రి లోకేష్ మొగ్గుచూపుతారా అన్నది ప్రశ్నార్థకమే. సవాంగ్‌ను రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిగా నియమించాలని లోకేష్ కోటరీ సూచిస్తోంది. ఏసీబీ డీజీ పోస్టు కూడా రాకపోతే గౌతం సవాంగ్ మరింత అసంతృప్తికి గురికావడం ఖాయం. అదే జరిగితే ఆయన కేంద్ర సర్వీసుకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి.
సీఎంను కలిసిన సవాంగ్...
సీపీ గౌతం సవాంగ్ బుధవారం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. డీజీపీ ఎంపిక తరువాత ఆయన సీఎంను కలవడం ఇదే తొలిసారి. ఆయన సోమవారం విజయవాడలో నిర్వహించిన హోంగార్డుల ఆత్మీయ సమావేశానికి కూడా హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబుతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సవాంగ్‌ను ఏ పోస్టుకు బదిలీ చేయాలని భావిస్తున్నామో అన్నదానిపై సీఎం సూచనప్రాయంగా చెప్పి ఉంటారని తెలుస్తోంది.
చర్చనీయాంశంగా కొత్త సీపీ నియామకం...
గౌతం సవాంగ్‌ను బదిలీ చేస్తే ఆయన స్థానంలో విజయవాడ కొత్త సీపీ ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. సీఐడీ అదనపు డీజీ ద్వారకా తిరుమల రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు ఉండే విజయవాడ సీపీగా వచ్చేందుకు ఆయన సుముఖంగా లేరని తెలుస్తోంది. ఆక్టోపస్ అదనపు డీజీగా ఉన్న నళినీ ప్రభాత్ పేరును పరిశీలించే అవకాశాలున్నాయి. మరోవైపు క్యాడర్ తగ్గంచి విజయవాడ సీపీగా ఐజీ స్థాయి అధికారిని నియమించాలన్న అంశం కూడా పరిశీలనలో ఉంది. ప్రభుత్వం రెండున్నరేళ్ల కిందట విజయవాడ సీపీ పోస్టును అదనపు డీజీ స్థాయికి పెంచింది. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి సీఆర్‌డీఏ ప్రాంతాన్ని చేర్చడంతోపాటు జగ్గయ్యపేట వరకు విస్తరించాలనే ఉద్దేశంతోనే అలా చేశారు. రాజధాని నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో సీఆర్‌డీఏ ప్రాంతంలో కార్యకలాపాలు పెరగలేదు. గుంటూరు జిల్లా టీడీపీ నేతలు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. దీంతో విజయవాడ కమిషనరేట్ పరిధిని విస్తరించలేదు. విజయవాడ సీపీ క్యాడర్‌ను అదనపు డీజీ స్థాయి నుంచి ఐజీ స్థాయికి తగ్గించాలనే ప్రతిపాదన ఉంది. అదే జరిగితే ఐజీ స్థాయి అధికారినే సీపీగా నియమిస్తారు. అందుకోసం ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్న మహేష్ చంద్ర లడ్హా, డ్రగ్స్ కంట్రోల్ విభాగం ఐజీ రవిశంకర్ పేర్లు పరిశీలనలోకి వస్తాయి. ప్రస్తుత సీపీ గౌతం సవాంగ్ బదిలీ, కొత్త సీపీ నియామకంపై వారం రోజుల్లో స్పష్టత వస్తుందని పోలీసువర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment