ఎందుకిలా?
ఎందుకిలా?
Published Thu, Sep 18 2014 1:15 AM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM
బంగారం పండే ఎర్రనేల ‘సోలార్'కు ధారాదత్తం
భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఓ వైపు చర్యలు తీసుకుంటూనే.. వెలిగల్లు, పెడబల్లి జలాశయాల మధ్య ఉన్న భూములను సోలార్ ప్రాజెక్టు కోసం కేటాయించడం పట్ల పర్యావరణ, వ్యవసాయ, సామాజిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కాస్త చొరవ చూపితే త్వరితగతిన సస్యశ్యామలమయ్యే ఈ ప్రాంతాన్ని సోలార్ పవర్ ఉత్పత్తి కంపెనీలకు కట్టబెట్టనుండటం చారిత్రక తప్పిదమంటున్నారు.
(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసానికి నంబులపూలకుంట (ఎన్‌పీ కుంట) సమీపంలో ఏర్పాటు కానున్న సోలార్ ప్రాజెక్టు నిలువెత్తు నిదర్శనంగా నిలవనుంది. అసలే కరువు జిల్లా. వర్షాలు కురవడం లేదు. వెయ్యి అడుగుల లోతుకు బోరు వేసినా నీటి జాడ కానరావడం లేదు. పదేళ్లకొకసారి కానీ వేరుశనగ పంట పూర్తిగా దక్కదు. ఇదీ స్థూలంగా జిల్లా ముఖచిత్రం. ఇంతటి కరువు పరిస్థితుల్లోనూ వ్యవసాయానికి సరిపడా భూగర్భ జలాలున్న ప్రాంతాలు అక్కడక్కడా ఉన్నాయి. సరిగ్గా అలాంటి ప్రాంతాన్నే జిల్లా యంత్రాంగం ‘సోలార్ ప్రాజెక్టు’కు కట్టబెట్టేందుకు చకచకా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఐదువేల ఎకరాలకు పైగా భూసేకరణకు సంబంధించిన ఫైళ్లు రాజధానికి చేరుకున్నాయి. రేపోమాపో ఈ భూమిని ‘సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి కార్పొరేషన్’ (నెడ్‌క్యాప్)కు కట్టబెట్టనున్నారు. అందుకు అవసరమైన పంచాయతీ తీర్మానాన్ని కూడా జిల్లా అధికారులు గుట్టుచప్పుడు కాకుండా చేయించేశారు.
కదిరి నియోజకవర్గంలోని నంబులపూలకుంట, పెడబల్లి కొత్తపల్లి పంచాయతీల పరిధిలో ఉన్న 7,655 ఎకరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. పెడబల్లి కొత్తపల్లిలో 539, 541 నుంచి 727 వరకు
సర్వే నంబర్ల కింద ఉన్న 5,674.15 ఎకరాలను, నంబులపూలకుంట సర్వే నంబర్ 679-3, 728లో గల మొత్తం 1,981 ఎకరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ మొత్తం భూమిలో 2011 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం కింద ఏడు విడతల్లో 1,200 మంది పేద రైతులకు పట్టాలు ఇచ్చింది. చాలా కొద్ది మొత్తంలోనే పట్టా భూ ములు ఉన్నాయి. మరో వెయ్యి ఎకరాల్లో రైతులు ఎలాంటి పట్టా కాగితాలు లేకుండా సాగు చేసుకుంటున్నారు.
సాగు సౌకర్యాలపై నిర్లక్ష్యం
పెడబల్లి రిజర్వాయర్ సామర్థ్యం పెంపు ప్రతిపాదనలు ఉన్న కారణంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూమికి సంబంధించి చాలా కాలం వరకు పేదలకు పట్టాలు ఇవ్వలేదు. దివంగత నేత వైఎస్ అధికారంలోకి వచ్చాక పలు విడతల్లో జరిగిన భూ పంపిణీలో భాగంగా పలువురికి పట్టాలిచ్చారు. ఇక్కడి రైతుల ప్రధాన సమస్య విద్యుత్. చాలా మేరకు విద్యుత్ సదుపాయం లేదు. ఉన్న చోట కూడా లోఓల్టేజీ సమస్య. ఇరువైపులా రిజర్వాయర్ల కారణంగా భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నా.. కేవలం కరెంటు సమస్యతో వ్యవసాయాభివృద్ధి చెందలేదు. ఈ కారణంగానే సోలార్ ప్లాంట్ ప్రతిపాదనలపై రైతుల్లో పెద్దగా వ్యతిరేకత రాలేదు. ఇదే అదనుగా జిల్లా యంత్రాంగం ఈ భూములను ‘నెడ్‌క్యాప్’కు అప్పగించే పనులను చకచకా కొనసాగిస్తోంది. వామపక్ష పార్టీలు కూడా రైతులకిచ్చే నష్టపరిహారం పెంపుదల గురించే మాట్లాడుతున్నాయి కానీ.. సాగుకు పనికివచ్చే భూములను సోలార్ ప్రాజెక్టుకు కేటాయించడంపై వ్యతిరేకత వ్యక్తపరచడం లేదు.
సోలార్ స్థాపనకు ఎన్నో ప్రత్యామ్నాయాలు
కరువు జిల్లాలో తప్పనిసరిగా పారిశ్రామికాభివృద్ధి జరగాల్సిందే. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో జిల్లా రికార్డులు సాధించాల్సిందే. అయితే.. ఇందుకు ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. జిల్లాలో వందల కిలోమీటర్ల మేర విస్తరించిన హెచ్‌ఎల్‌సీ, హంద్రీ-నీవా కాలువలపై ఒక్క ఎకరా భూసేకరణ చేయాల్సిన అవసరం లేకుండా సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయవచ్చు. గుజరాత్‌లో ఈ ప్రయోగం సఫలమయ్యింది. ఇక భూగర్భ జలాల జాడే లేని, సాగుకు పనికి రాని భూములకు జిల్లాలో కొదువ లేదు. ఇప్పటికే ప్రభుత్వం ఓడీసీ, అమడగూరు ప్రాంతాల్లో ‘సైన్స్ సిటీ’ కోసం సేకరించిన వేల ఎకరాలు ఖాళీగానే ఉన్నాయి. భూ సేకరణకు ఒక్క రూపాయి వెచ్చించాల్సిన అవసరం లేకుండా అక్కడ సోలార్ ప్రాజెక్టు స్థాపించవచ్చు. వీటిని విస్మరించి చుట్టూ నీటి వనరులుండి, భూగర్భ జలాల లభ్యత పుష్కలంగా ఉన్న చోట నీటి అవసరం ఏమాత్రమూ లేని సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తుండడంలో హేతుబద్ధతను మేథావులు ప్రశ్నిస్తున్నారు.
ఉపాధికి గొడ్డలి పెట్టు
విలువైన భూమిని సోలార్‌కు కేటాయించడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయా అంటే అదీ లేదు. సోలార్ యూనిట్ నిర్మాణ సమయంలో కొంత మందికి ఉపాధి దొరకవచ్చు కానీ.. అది పూర్తయ్యి విద్యుత్ ఉత్పత్తి మొదలైతే ఓ పది మంది సాంకేతిక నిపుణులు, సెక్యూరిటీ గార్డులకు తప్ప ఉపాధి అవకాశాలేవీ ఉండవు. అదే ఈ భూముల్లో వ్యవసాయ అవసరాల కోసం ఓ చిన్న సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసి.. నాణ్యమైన విద్యుత్ అందజేస్తే ఇక్కడి రైతులు అద్భుతాలు సృష్టించగలరు. అర్థ గణాంక శాఖ లెక్కల ప్రకారం నమ్మకమైన నీటి వనరులుండి ఏడాది పొడవునా కూరగాయ పంటలు పండిస్తే ఒక్కో ఎకరం భూమి 200 ప నిదినాలను సృష్టించగలదు. ఐదువేల ఎ కరాల్లో ఏడాదికి పది లక్షల పనిదినాలను సృష్టించే అవకాశమున్న చోట పట్టుమని పది మందికి కూడా పని కల్పించలేని సోలార్ ప్రాజెక్టు నెలకొల్పడం ఏ రకంగా చూసినా సరికాదన్న అభిప్రాయాన్ని మేథావులు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకుంటుందా అన్నది ప్రశ్నార్థకమే.
Advertisement