‘రైతుల భూములు లాక్కుంటే ఊరుకోం..’
గద్వాలన్యూటౌన్: గట్టు మండలంలో సోలార్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుం టే ఆందోళన ఉద్ధృతం చేస్తామని సీఎంసీ రాష్ట్ర కోశాధికారి జ్యోతి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భూములు సేకరించకూదని డిమాండ్ చేస్తూ.. సోమవారం తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో రైతులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె రైతులకు సంఘీబావం తెలిపి మాట్లాడారు. దాదాపు 50 ఏళ్లక్రితం సాగుకు నోచుకోని, ఫారెస్ట్ ప్రాంత ప్రభుత్వ భూమిని అప్పటి ప్రభుత్వం కుటుంబానికి ఉచితంగా ఐదెకరాల చొప్పున ఇచ్చి పట్టాలు జారీచేసిందని చెప్పారు. 5,528 ఎకరాల భూమిని అప్పటినుంచి రైతులు సాగు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారన్నారు. రైతుల నుంచి భూములు తీసుకునేందకు తేదీ వేయకుండా నోటీసులు జారీచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సాగు భూములను బీడు భూములుగా చూపించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర ఉపాద్యక్షుడు గోపాల్‌రావు, డీటీఎఫ్ నాయకుడు ప్రభాకర్, టీపీఎఫ్, సీఎంసీ నాయకులు చిట్టెం కిష్టన్న, దరేష్‌బీ, లక్ష్మీ, రైతులు పాల్గొన్నారు.