'తుపాను' సీఎం ఎక్కడకెళ్లారు?
హైదరాబాద్: విభజన తుపానును ఆపుతానంటూ ప్రగల్భాలు పలికిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ దాక్కున్నారని వైఎస్సార్ సీపీ నేత శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన కీలక సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్, ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎక్కడకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర విభజన తుపాను ఆపుతానని గతంలో ప్రకటించిన సీఎం.. ఇప్పుడు తప్పించుకుని తిరిగేందుకు యత్నించడం వెనుక కారణమేమిటని శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు. 'బిల్లు వస్తే దాని సంగతి తేలుస్తామన్నారు. సీఎం ఎక్కడకు వెళ్లి దాక్కున్నారో.. పోలీసులు ఎంక్వైరీ చేయాలి. తెలుగువారి ఆక్రోశాన్ని సీఎం, చంద్రబాబు తాకట్టు పెట్టారు'.అని ఆయన మండిపడ్డారు.
ఇలాంటి పరిణామాలు వస్తాయనే అసెంబ్లీ పెట్టి సమైక్య తీర్మానం చేయమన్నామని, కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లే సీఎం ఆడారన్నారు. తెలంగాణ బిల్లుపై చర్చ సాంకేతికంగా ప్రారంభం కాలేదని తమ అభిప్రాయమని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో భయపడినట్లుగానే సీఎం, చంద్రబాబులు వ్యవహరించారన్నారు.