ప్రజాసమస్యల పరిష్కారం కోసం తహశీల్దార్లు చొరవ చూపాలని కలెక్టర్ ఎం.రఘునందనరావు అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రజాసమస్యల పరిష్కారం కోసం తహశీల్దార్లు చొరవ చూపాలని కలెక్టర్ ఎం.రఘునందనరావు అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తహశీల్దార్లతో గురువారం రాత్రి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రజాసమస్యలపై వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలన్నారు.
ఇందుకోసం ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. ఓటర్ల జాబితా పనుల్లో అలసత్వం వహించవద్దని స్పష్టం చేశారు. కచ్చితమైన ఓటర్ల జాబితా తయారీకి ప్రయత్నించాలన్నారు. ఎవరిదైనా ఓటు తిరస్కరిస్తే కారణాలను కచ్చితంగా దగ్గర ఉంచుకోవాలన్నారు. జేసీ పి.ఉషాకుమారి మాట్లాడుతూ రోడ్డు పక్కన, ప్రభుత్వ స్థలాలు, పార్కులలో నిర్మించిన మత సంబంధ దేవాలయాలు ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుంటే వాటిని వేరొక ప్రాంతానికి మార్పించడానికి తహశీల్దార్లు కృషి చేయాలన్నారు.
డీఆర్డీఏ పీడీ కె,శివశంకర్‌రావు మాట్లాడుతూ భూమి కొనుగోలు పథకంలో లబ్ధిదారులను గుర్తించే పనిని తహశీల్దార్లు వేగవంతం చేయాలన్నారు. గతంలో లక్ష రూపాయలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చేదని, దీనిని రూ.5 లక్షలకు పెంచిందని తెలిపారు. ఈ నెల 25లోగా ఈ ప్రతిపాదనలను పంపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎల్ విజయచందర్, సబ్‌కలెక్టర్లు హరిచందన, చక్రధరరావు, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ కాళీచరణ్ తదితరులు పాల్గొన్నారు.
7వ విడత భూ పంపిణీపై దృష్టిసారించండి
భూమిలేని నిరుపేదలకు 7వ విడత భూ పంపిణీలో భూమిని పంపిణీ చేసేందుకు తహశీల్దార్లు అన్ని చర్యలు తీసుకోవాలని జేసీ పి ఉషాకుమారి కోరారు. కలెక్టరేట్‌లో తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. గుర్తించిన లబ్ధిదారులకు పట్టాల పంపిణీ, ఎస్సైన్‌మెంట్ కమిటీ సమావేశాలను త్వరితగతిన నిర్వహించాలన్నారు.