కావాలనే అడ్డు తొలగించుకున్నాం.. | Wife arrested for planning husband's murder | Sakshi
Sakshi News home page

కావాలనే అడ్డు తొలగించుకున్నాం..

Published Wed, Jul 12 2017 3:17 AM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM

కావాలనే అడ్డు తొలగించుకున్నాం..

కావాలనే అడ్డు తొలగించుకున్నాం..

రామభద్రపురం(బొబ్బిలి): వివాహేతర బందానికి అడ్డుగా ఉన్నాడన్న ఉద్దేశంతోనే ఓ పథకం ప్రకారం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేశానని ఇటీవల హత్యకు గురైన కొయ్యాన ధనుంజయ్‌ (29) భార్య రామలక్ష్మి పోలీసుల విచారణలో తెలిపింది. ఈ మేరకు మంగళవారం సీఐ సంజీవరావు కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. రామలక్ష్మికి ధనుంజయ్‌తో పెళ్లి అయిన కొద్ది రోజులకే వాడాడ గ్రామానికి చెందిన బోగాది గణపతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ధనుంజయ్‌ గొర్రెల కాపరి కావడంతో రోజూ రాత్రిళ్లు ఇంట్లో లేకపోవడంతో అంతా వారి ఇష్ట ప్రకారం సాగింది. కానీ కొద్ది రోజుల తర్వాత భర్తకు విషయం తెలసిపోవడంతో వారిద్దరి మధ్య తగాదాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కాలంలో ఆ గొడవ గ్రామ పెద్దల వద్దకు పంచాయతీకి వెళ్లింది. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకుని వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని రామలక్ష్మి నిర్ణయించుకుని  ప్రియుడితో కలిసి పథకం వేసింది.

ప్లాన్‌ ప్రకారమే హత్య..
ముందు వేసుకున్న ప్రణాళిక ప్రకారం ధనుంజయ్‌ జూన్‌ 21న శంబరలో ఉన్న మేనత్త ఇంటికి వెళుతున్న విషయాన్ని ప్రియుడు గణపతికి రామలక్ష్మి ముందుగానే చేరవేసింది. గణపతి ముందు వేసుకున్న పధకం ప్రకారం ధనుంజయ్‌ను వెంబడించాడు. తొలుత ధనుంజయ్‌ కంటే ముందుగానే సాలూరు వెళ్లాడు. అక్కడకు రాకపోవడంతో తిరిగి రామభద్రపురం వచ్చేసి కాపు కాశాడు. ధనుంజయ్‌ రావడంతోనే గణపతి వెళ్లి మాటలు కలిపి  రామభద్రపురం – రాజాం రోడ్డు పక్కనే ఉన్న టేకు చెట్ల తోటలోకి తీసుకెళ్లి రాత్రి 11 గంటల సమయంలో చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని కర్రివానిబందలో ఉన్న తుప్పల్లో పడేశాడు.

వెంటనే రామలక్ష్మికి ఫోన్‌ చేసి పని అయిపోయింది. ఇక్కడే దగ్గరలోని తుప్పల్లో పడేశానని చెప్పాడు. అది జరిగిన రెండు రోజులకు  ధనుంజయ్‌  కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో భయపడి గణపతి ఉరివేసుకుని చనిపోయాడు. అనుమానం వచ్చిన పోలీసులు రామలక్ష్మిని ఆ కోణంలో విచారించడంతో అసలు నిజాలు బయటకు వచ్చినట్లు సీఐ పేర్కొన్నారు. ఏ1 నిందితుడు గణపతి ఆత్మహత్య చేసుకోవడంతో ఏ2 నిందుతురాలైన రామలక్ష్మిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement