కట్టుకున్నవాడే కాలయముడు
విశాఖపట్నం గత నెల 22న హార్బర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువతిది హత్యేనని పోలీసులు నిర్థారించారు. భ ర్తే హత్య చేసినట్టు గుర్తించి బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ టి.కల్యాణి కథనం ప్రకారం లక్ష్మీదేవిపేటకు చెందిన మాధవ ధనలక్ష్మి, విజయనగరం జిల్లాకు చెందిన లొగలాపు మోహనరావు అలియాస్ మోహన్‌ను మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. అనంతరం వీరు విశాఖలోని హనుమంతవాక, వెంకోజిపాలెం, కొబ్బరితోట ప్రాంతాల్లో కొన్నాళ్లు కాపురమున్నారు. స్వతహాగా ధనలక్ష్మి డాన్సర్ కావడంతో మోహన్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో దంపతులు కొద్ది రోజులు విడిగా ఉన్నారు.
గత నెల 17వ తేదీ రాత్రి తిరిగి మోహన్ ఆమె వద్దకు రాగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కోపోద్రిక్తుడైన మోహన్ భార్య ధనలక్ష్మి మెడకు చున్నీ బిగించడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం లక్ష్మీదేవిపేట రైలుపట్టాల దిగువన మురికిగుంటలో మతదేహాన్ని పడేసి ఏమీ తెలియనట్టు వెళ్లిపోయాడు. ధనలక్ష్మి కనిపించకపోవడంతో ఆమె తల్లి, అన్నయ్య 21వ తేదీ రాత్రి టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో అదృశ్యం కేసు పెట్టారు. ఇంతలో 22వ తేదీ సాయంత్రం హార్బర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బయటపడిన యువతి మృతదేహాన్ని ధనలక్ష్మిగా గుర్తించారు. హార్బర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి టూటౌన్ పోలీసులకు బదిలీ చేశారు. వారు సమగ్ర విచారణ చేపట్టి ధనలక్ష్మి భర్తను అదుపులోకి తీసుకుని విచారించడంతో తానే హతమార్చినట్లు అంగీకరించాడు. పోలీసులు నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.