విమానాశ్రయంలో వైఫై సేవలు
గన్నవరం విమానాశ్రయంలో వచ్చే నెల నుంచి వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా 52 విమానాశ్రయాల్లో వైఫై సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో నూతన రాజధానికి దగ్గర్లో ఉన్న గన్నవరం విమానాశ్రయంలో అత్యున్నత నాణ్యమైన సేవలందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇటీవల కాలంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు దేశంలో పలు ప్రాంతాల నుంచి దాదాపు 20 నుంచి 24 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. సుమారు రెండువేల మంది ప్రయాణికులు నిత్యం హైదరాబాద్, బెంగళూర్, ఢిల్లీ తదితర నగరాలకు రాకపోకలు సాగిస్తుంటారు.
ఈ క్రమంలో విమాన ప్రయాణికులకు అత్యవసర సేవలు అందించేందుకు కొత్తగా నిర్మించిన టెర్మినల్ భవనంలో వైఫై సేవలు అందించాలని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఏర్పాట్లు చేస్తోంది. తక్కువ సమయంలో వేగవంతమైన ఇంటర్‌నెట్ సేవలందించే వైఫైని అందుబాటులోకి తీసుకొస్తోంది. రిలయన్స్ సంస్థ కూడా విమానాశ్రయం బయట వైఫై సేవలందించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే ఆ సంస్థ అధికారులు విమానాశ్రయానికి వచ్చి పరిశీలించి వెళ్లారు.