
సర్కారు మెడలు వంచైనా బీసీ సబ్‌ప్లాన్ సాధిస్తాం
సాక్షి, హైదరాబాద్: సర్కారు మెడలు వంచైనా బీసీ సబ్‌ప్లాన్‌ను సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బీసీ సబ్‌ప్లాన్ సాధనకోసం హైదరాబాద్‌లో రెండ్రోజులపాటు చేపట్టిన మహాదీక్ష ముగింపు సందర్భంగా కిషన్‌రెడ్డి మంగళవారం ప్రసంగించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ తో బడుగులు ఉన్నత చదువులు అభ్యసిస్తుంటే కొందరికి కళ్లమంటగా ఉందంటూ అలాంటి వాళ్లేమైనా సొంత ఇంట్లోంచి డబ్బులు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఎన్నివేల కోట్లు ఖర్చయినా పర్వాలేదని, విద్యార్థులందరికీ విద్య అందాలన్నారు.
బీసీలు విడిగా ఉద్యమిస్తే సర్కారు కదలదని, అందువల్ల ఐక్యపోరాటం చేయాలని, అందుకు బీజేపీ అండగా ఉంటుందని హామీఇచ్చారు. కిషన్‌రెడ్డికి ఆర్.కృష్ణయ్య, దత్తాత్రేయ నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపజేశారు. బీజేపీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణకు దత్తాత్రేయ, పార్టీ నేత లక్ష్మణ్‌కు ఆర్.కృష్ణయ్య నిమ్మరసం ఇచ్చారు. దీక్షకు బీసీ సంక్షేమసంఘం ఆర్.కృష్ణయ్య సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలప్పుడే కాంగ్రెస్‌కు బీసీలు గుర్తుకొస్తారని విమర్శించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశం ఎప్పుడు జరిగినా వెంటనే బీసీ సబ్‌ప్లాన్ అమలుకు చట్టం తేవాలన్నారు.