అవినీతిని సహించను | Will not tolerate corruption | Sakshi
Sakshi News home page

అవినీతిని సహించను

Published Mon, Dec 1 2014 1:35 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

అవినీతిని సహించను - Sakshi

అవినీతిని సహించను

‘సాక్షి’తో దుర్గగుడి  ఈవో నర్సింగరావు
 

విజయవాడ : శ్రీకనకదుర్గమ్మ ఆశీస్సులతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటానని ఇటీవల ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సీహెచ్ నర్సింగరావు చెప్పారు. అవినీతిని సహించబోనని స్పష్టంచేశారు. ఆయన  ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. భక్తులు కూడా దేవస్థాన ఉద్యోగులకు సహకరించాలని కోరారు. ఇంద్రకీలాద్రిపై అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజాయతీగా వ్యవహరించడం ద్వారా భక్తులకు దగ్గరవుతామని సిబ్బంది గుర్తించాలని చెప్పారు.

సాక్షి : మూడు రోజుల క్రితం ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడి వాతావరణం ఎలా ఉంది?

ఈవో : దేవస్థానం సిబ్బంది పనితీరు బాగుంది. కొన్ని శాఖల అధికారులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహించి సమీక్ష చేశా. వారి తప్పొప్పులు తెలుసుకునేందుకు కొద్దిరోజులు పడుతుంది. అందరూ బాగా పనిచేస్తున్నారు.
 
సాక్షి : అన్నదాన పథకంలో అవినీతి జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి..?
 
ఈవో : నాణ్యమైన అన్నం భక్తులకు పెట్టాలి. నేను బాధ్యతలు స్వీకరించి మూడు రోజులైంది. ఈరోజే అన్నదాన కార్యక్రమాన్ని పరిశీలించాను. కొన్ని లోపాలున్నాయి. వాటిని త్వరలోనే సరిదిద్దుతా. నిత్యం నిఘా ఉంటుంది. ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తా. అటువంటి పరిస్థితి రాకుండా చర్యలు చేపడతా.
 
సాక్షి : ఆదాయం వచ్చే సీట్ల కోసం మీపై ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. నిజమేనా?
 
ఈవో : ఎవరు ఏ సీట్లో ఉన్నా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. అవినీతికి పాల్పడినట్లు నాకు ఫిర్యాదు వస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయి.
 
సాక్షి : ప్రొవిజన్ స్టోర్స్ ఇన్‌చార్జ్‌గా నాకే బాధ్యతలు ఇవ్వాలంటూ పలువురు మీపై ఒత్తిడి తెప్పిస్తున్నట్లు తెలిసింది. ఇది ఎంతవరకు నిజం?
 
ఈవో: ప్రొవిజన్ స్టోర్స్ ఇన్‌చార్జ్ ఎంతో జాగ్రత్తగా బాధ్యతలు నిర్వహించాలి. ఏ ఒక్క విషయంలో తప్పులు దొర్లినా తద్వారా దేవాలయానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. ఎంతోమంది భక్తులు లక్షల్లో విరాళాలు ఇస్తున్నారు. వారికి దేవాదాయ శాఖ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితి రానివ్వను. నాపై ఇంతవరకు ఎటువంటి వత్తిడి రాలేదు.
 
సాక్షి : అర్చకుల్లో రెండు గ్రూపులు ఉన్నాయని, ఈవోను సైతం శాసించే స్థాయికి కొందరు అర్చకులు ఎదిగినట్లు సమాచారం..?
 
ఈవో : ఈ విషయం నా దృష్టికి రాలేదు. కుటుంబం అన్న తరువాత చిన్నచిన్న పొరపొచ్చాలు రావడం సహజం. అర్చకులు కూడా దేవస్థానం అనే కుటుంబంలో సభ్యులే. స్పర్థలు వస్తుంటాయి. పోతుంటాయి. ఈ విషయాన్ని కూడా వారితో మాట్లాడి తెలుసుకుని అటువంటి పరిస్థితి ఉంటే సరిదిద్దేందుకు చర్యలు చేపడతా. సిబ్బందిని ఏకతాటిపై నడిపేందుకు చర్యలు తీసుకుంటాను.  
 
సాక్షి : దేవస్థానానికి దళారుల బెడద ఎక్కువగా ఉందని భక్తులు చెబుతున్నారు, షాపుల కేటాయింపు దగ్గర నుంచి టెండర్ల వరకు వారిదే హవా నడుస్తున్నట్లు విమర్శలున్నాయి?
 
ఈవో : దళారుల మాటలు ఎవ్వరూ నమ్మవద్దు. ఇప్పటి వరకు ఏమి జరిగిందో నాకు తెలియదు. ఇక నుంచి దళారుల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దు. ఎవరికైనా ఏ పని ఉన్నా నేరుగా నన్నే కలిసి వారి సమస్యను చెప్పవచ్చు. ఇక టెండర్లకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటి ప్రకారమే ముందుకు వెళతాం. అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ సాగనివ్వను.
 
సాక్షి : త్వరలో భవానీ దీక్షల విరమణ ప్రారంభం కానుంది. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి?
 
ఈవో : భవానీ దీక్షల విరమణ కార్యక్రమం వచ్చే నెల 12 నుంచి 16 వరకు ఉంటుంది. ఏర్పాట్లను ఇంజినీరింగ్ విభాగం వారు చూస్తున్నారు. త్వరలోనే టెండర్ల విషయాన్ని ఫైనల్ చేస్తాం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement