
రాజధాని నిర్మాణానికి అన్ని రకాల సహకారం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అన్నిరకాలుగా సహకారాన్ని అందిస్తానని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఆయన బుధవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధానిపై అధ్యయనంకోసం ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా తనను కలిసినట్లు తెలిపారు. వారి అభిప్రాయాలను ప్రజెంటేషన్ రూపంలో వివరించారని చెప్పారు.
కొత్త రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున ట్రాన్సుపోర్టేషన్ నెట్‌వర్క్, రోడ్లు, బీఆర్‌టీఎస్, మెట్రోరైలు నెట్‌వర్క్, లింకు రోడ్లు అవసరమని, ఆ విషయంలో పట్టణాభివృద్ధి శాఖ తగిన సహకారం అందించాలని కోరినట్లు వివరించారు. రైల్వే, ఉపరితల రవాణా, పెట్రోలియం నేచురల్ గ్యాస్, ఇతరత్రా మంత్రిత్వశాఖలు తగిన విధంగా సహకరిస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌నిర్మాణం సాధ్యమవుతుందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారని చెప్పారు. కేంద్రం నుంచి అన్ని రకాల సహకారాన్ని తప్పనిసరిగా అందిస్తాననే విషయాన్ని చెప్పినట్లు ఆయన తెలిపారు.