సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై జాతీయ సదస్సు
వివిధ పరిశోధన అంశాలపై పోస్టర్ ప్రెజెంటేషన్
250 పరిశోధన పత్రాలతో సావనీర్ ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ (ఏఐ) అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. ఇంటర్నెట్‌లో మనం వినియోగించేది ప్రతీది ఏఐపై ఆధారపడి పనిచేస్తుంది. ఏఐ గురించి ప్రాముఖ్యతను, దానిపై జరుగుతున్న పరిశోధనలను తెలిపేందుకు సిద్దిపేట వేదికైంది. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సూక్ష్మ జీవశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో ఏఐపై జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది.
మొదటి రోజు రీసెర్చ్‌లు చేసిన వాటిపై పోస్టర్ ప్రజంటేషన్ చేశారు. ఈ సదస్సు సందర్బంగా దేశంలోని పలు యూనివర్సిటీల ఏఐ అనుబంధ అంశాలపై జరిగిన రీసెర్చ్‌లను ఆహ్వానించారు. ఆయా యూనివర్సిటీలు ఆన్‌లైన్ ద్వారా పరిశోధన పత్రాలను పంపించాయి. – సాక్షి, సిద్దిపేట
250 పరిశోధన పత్రాలతో సావనీర్
ఈ సదస్సు సందర్భంగా తెలంగాణతో పాటు తమిళనాడు, ఆంధ్రపదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి దాదాపు 250 పరిశోధన పత్రాలు వచ్చాయి. వాటిని ఒక్క చోట చేర్చి సావనీర్‌ను రూపొందించారు. దీనికి ఐఎస్‌బీఎన్ (ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నంబరు) లభించింది. దానిని శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సదస్సు శనివారం కూడా కొనసాగనుంది.
ఏఐ ద్వారా డ్రగ్స్ కాంబినేషన్‌లు గుర్తించవచ్చు
ప్రపంచంలో రెండవ అతి పెద్ద వ్యాధి బ్రెస్ట్ కేన్సర్. చెట్టు నుంచి వచ్చే కాంబినేషన్ బయో మెటాబోలైట్స్ ద్వారా బ్రెస్ట్ కేన్సర్‌ను నయం చేయవచ్చు. ఏఐ టూల్స్ ద్వారా కాంబినేషన్‌ను గుర్తించి ఆ డ్రగ్ సామర్థ్యాన్ని గుర్తించవచ్చు. ప్లాస్టిక్, స్మోకింగ్, ఫుడ్ ద్వారా కేన్సర్ బారిన పడుతున్నారు. ఉదాహరణకు తినుబండారాల కోసం గంటలకొద్దీ నూనెను మరగపెడుతారు. దీంతో అది విషంగా మారుతోంది. – డాక్టర్ పూర్ణచందర్,అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంట్రల్ యూనివర్సిటీ, తమిళనాడు
భవిష్యత్తులో ఏఐ కీలక పాత్ర
భవిష్యత్తులో విద్యార్థులకు అనుకూలమైన అభ్యసన, అనుభవాలను అందించడంలో ఏఐ కీలక పాత్ర పోషించనుంది. బలాలు, బలహీనతల ఆధారంగా పాఠ్యాంశం డిజైన్‌కు ఏఐ ఎంతో ఉపయోగపడుతుంది. ఆటోమేటెడ్ గ్రేడింగ్ పద్ధతి ఇతర దేశాలలో వినియోగిస్తుండగా త్వరలో మన దేశంలో సైతం వినియోగంలోకి రానుంది. పిల్‌బాల్‌ని మనిషి వేసుకుంటే దాని ద్వారా దాదాపు 65 వేల ఫోటోలను తీసి అందిస్తోంది.
ఇటీవల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పిల్‌బాల్‌ను టెస్ట్ చేశారు. పిల్‌బాల్‌తో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ఏఐని ఎంత అభివృద్ధి చేసినా మానవునిపైనే ఆధారపడి పని చేస్తుంది. సైబర్ నేరస్తులను పట్టుకోవడంలో ఏఐ ప్రభావవంతమైన ఫలితాలను ఇస్తోంది. – రాఘవేందర్‌రావు, అసోసియేట్ ప్రొఫెసర్, నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాల
డేటా పంపేప్పుడు జాగ్రత్తలు పాటించాలి....
తెలిసిన వారికి, తెలియని వారికి మొబైల్ ద్వారా డేటా పంపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మనం పంపే డేటా ఏ యాప్ నుంచి పంపిస్తున్నామో వారికి సైతం చేరే అవకాశం ఉంటుంది. హ్యుమనైడ్స్ పద్ధతి–2030 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. హ్యుమనైడ్స్ అంటే మనిషి ఇంట్లో చేసే పనులు అన్ని రోబో చేస్తుంది. మోకాలు సర్జరీ రోబో ద్వారా చేయడం వలన కుట్ల సంఖ్య తగ్గుతుంది. – డాక్టర్ ప్రవీణ్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెథడిస్ట్ ఇంజనీరింగ్ కళాశాల
షుగర్‌తో కంటి చూపుపై ఎఫెక్ట్
షుగర్ ద్వారా తయారయ్యే ఉత్పత్తులను తినడం వలన కంటి చూపుపై ఏ విధంగా ఎఫెక్ట్ చూపుతుందో నా రీసెర్చ్ ద్వారా వివరించాను. పుణె యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాను. ఇంటర్న్‌షిప్‌లో ఈ రీసెర్చ్ చేశాను. నా పరిశోధనను సావనీర్‌లో పబ్లిష్ చేయడం ఆనందంగా ఉంది. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. – శాలిని చౌహాన్, పుణె యూనివర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment