ఇండెంట్ పెడితే కాదంటారా? | will they beat if indent kept means? | Sakshi
Sakshi News home page

ఇండెంట్ పెడితే కాదంటారా?

Published Wed, Feb 5 2014 2:45 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

will they beat if indent kept means?

అనంతపురం వైద్య కళాశాలలో మౌలిక సదుపాయాల లేమిపై అడిషనల్ డీఎంఈ డాక్టర్ వెంకటేశం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్న చిన్న సదుపాయాలు కూడా లేకపోతే ఎలాగంటూ ప్రిన్సిపాల్‌పై అసహనం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం అనంతపురం వైద్య కళాశాల, సర్వజనాస్పత్రిని అడిషనల్ డీఎంఈ తనిఖీ చేశారు. ముందుగా వైద్య కళాశాల వద్ద ఆయనకు ప్రిన్సిపాల్ నీరజ, ఆస్పత్రి సూపరింటెండెంట్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. అనంతరం కామన్ గదులపై ఏడీఎంఈ ఆరా తీయగా మొదటి నుంచి ఆ వసతులు లేవని ప్రిన్సిపాల్ చెప్పడంతో ‘ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు కనీసం టాయ్‌లెట్స్ కూడా లేకుంటే ఎలాగని మండిపడ్డారు.

అనాటమీ, ఫోరెన్సిక్, ఎగ్జామ్ వాల్యుయేషన్ రూంలు, జిమ్, లైబ్రరీ, సెంట్రల్ హాల్‌ను తనిఖీ చేశారు. లైబ్రరీలో కూడా టాయ్‌లెట్స్ లేవని తెలియడంతో ‘ఏందండీ ప్రతి చిన్న విషయానికి కారణాలు చెబుతున్నారు..డీఎంఈకి ఇండెంట్ పెడితే కాదంటారా?’ అని ప్రశ్నించారు. అనంతరం వైద్య కళాశాల పైభాగానికి వెళ్లి ఖాళీ స్థలాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీనియర్ రెసిడెంట్ హాస్టల్‌ను చూసి ఎందుకు నిరుపయోగంగా ఉందని ఏపీఎంఎస్‌ఐడీసీ డీఈ ప్రభాకర్ చౌదరిని ప్రశ్నించగా.. చిన్న చిన్న రిపేరీలు ఉన్నాయన్నారు. దీంతో మార్చిలోపు హాస్టల్‌ను పునరుద్ధరించాలని, అందుకు రూ.20 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు.
 - న్యూస్‌లైన్, అనంతపురం అర్బన్
 
 ‘అనంత’పై ప్రత్యేక శ్రద్ధ చూపండి
   ఏడీఎంఈని కోరిన వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి
 కరువు కాటకాలతో విలవిల్లాడుతున్న ‘అనంత’పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని వైఎస్‌ఆర్‌సీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఏడీఎంఈ డాక్టర్ వెంకటేశంను కోరారు. ఆస్పత్రి, వైద్య కళాశాల తనిఖీకి వచ్చిన ఆయన్ను ఎమ్మెల్యే కలిసి వినతిపత్రం అందజేశారు. ఆస్పత్రిలోని సమస్యలను వివరించారు. ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీతో పాటు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. వెయ్యి పడకల ఆస్పత్రిగా చేసి అందుకు అనుగుణంగా ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు, అటెండర్లకు విశ్రాంతి గదులు నిర్మించాలన్నారు. నిమ్స్ తరహాలో అన్ని రకాల జబ్బులకు సంబంధించి వైద్యులను నియమించాలన్నారు. 24 గంటలూ పని చేసేలా రెండు అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలన్నారు. మౌలిక సదుపాయాల కోసం అధిక నిధులు కేటాయించాలన్నారు. అత్యవసర చికిత్సలను కర్నూలు, బెంగళూరుకు రెఫర్ చేస్తూ ఇక్కడి వైద్యులు చేతులు దులుపుకుంటున్నారని, ఫలితంగా మార్గంమధ్యలోనే వారు మృత్యువాత పడుతున్నారని చెప్పగా.. డీఎంఈ దృష్టికి తీసుకెళ్తానని వెంకటేశం హామీ ఇచ్చారు.
 
 వేతనాలు, ఈఎస్‌ఐ, పీఎఫ్ సమస్యలను ప్రభుత్వ సర్వజనాస్పత్రి, వైద్య కళాశాల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు గంగిరెడ్డి, స్వప్ప తదితరులు ఏడీఎంఈ దృష్టికి తీసుకెళ్లారు. వీరికి వైఎస్‌ఆర్‌సీపీ అనుబంధ ఏపీ హెల్త్ మెడికల్, ఫ్యామిటీ వెల్ఫేర్ ఈయూ అధ్యక్ష కార్యదర్శులు షఫీ, శ్రీధర్ బాబు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుస్సేన్ పీరా మద్దతు తెలిపారు. కాంట్రాక్ట్ వ్యవస్థకు స్వస్తి పలకాలని కోరారు. ఆస్పత్రి సమస్యలను సీపీఐ నగర కార్యదర్శి నారాయణస్వామి ఏడీఎంఈ దృష్టికి తీసుకెళ్లారు.  
 
 150 సీట్ల పెంపు లేనట్లే
 మౌలిక సదుపాయాలు, సిబ్బంది లేరన్న కారణంతో వైద్య కళాశాలలో 150 సీట్ల పెంపును మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) తిరస్కరించినట్లు ఏడీఎంఈ తెలిపారు. గత ఏడాది ఎంసీఐ తనిఖీ చేసినప్పుడు సదుపాయాల లేమి, సిబ్బంది కొరత వల్ల సీట్ల పెంపునకు వర్తించదని తేల్చి చెప్పినట్లు తెలిపారు. దాని పునరుద్ధరణ కోసమే వచ్చామన్నారు. పీజీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతానికి నాలుగు డిపార్ట్‌మెంట్లు చేసుకుంటే సరిపోతుందని, మిగతా వాటి గురించి భవిష్యత్‌లో ఆలోచిద్దామన్నారు.  
 
 ప్రమోషన్లు కావాలంటే పరిశోధనలు చేయాల్సిందే
 ఏళ్ల తరబడి పని చేస్తున్నా ప్రమోషన్లలో జాప్యం జరుగుతోందని, తమకు ప్రమోషన్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు కన్నేగంటి భాస్కర్, నాయకులు నవీన్, వీరభద్రయ్య, సుబ్రమణ్యం తదితరులు ఏడీఎంఈని కోరారు. ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. దీంతో స్పందించిన ఏడీఎంఈ ‘మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్న కళాశాలలో కూడా పరిశోధనలు చేస్తున్నారు. మీరు మాత్రం ఆ అవకాశం లేదని చెబుతున్నారు. పరిశోధనలకు సంబంధించి మౌలిక సదుపాయాలు ప్రభుత్వం ద్వారా వచ్చేలా చూస్తాం. ప్రమోషన్లు కావాలంటే పరిశోధనలు చేయాల్సిందే’ అని చెప్పారు.   
 
 మీరెందుకలా చేయడం లేదు
 సర్వజనాస్పత్రిలోని ఐసీసీయూ, ఎఫ్‌ఎం, ఎంఎం వార్డులను ఏడీఎంఈ పరిశీలించారు. ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లి సమస్యలపై ఆరా తీశారు. శస్త్ర చికిత్స రికార్డులను పరిశీలించి ఆశ్చర్యానికి లోనయ్యారు. ‘‘ ఆరోగ్య శ్రీ కేసులు నెలకు కేవలం 30 మాత్రమే చేస్తున్నారు.. రెవెన్యూ ఏ విధంగా వస్తుందో చెప్పండి. గాంధీ ఆస్పత్రికి రూ.16 కోట్లు, కాకినాడ ఆస్పత్రి రూ.14 కోట్లు, పక్కనే ఉన్న కర్నూలుకు ఏడాదికి రూ.కోటి ఆరోగ్య శ్రీ నిధులు వచ్చాయి.
 
 మీకెందుకు రావడం లేదో అర్థం కావడం లేదు’’ అని అన్నారు. అందుకు సూపరింటెండెంట్, పలు విభాగాధిపతులు డాక్టర్ రామస్వామినాయక్, డాక్టర్ నవీన్, డాక్టర్ మురళీకృష్ణ స్పందిస్తూ డేటా ఎంట్రీ ఆపరేటర్ లేరని, అప్రూవల్ వచ్చేందుకు ఆలస్యమవుతోందని సమాధానమిచ్చారు. దీంతో హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌కు ఏడీఎంఈ ఫోన్ చేసి ‘మీ పరిధిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఎంత మంది ఉన్నారు’ అని అడిగారు. దీంతో వారు ప్రైవేట్ కాంట్రాక్ట్ సిబ్బంది ద్వారా కేసుల జాబితా, అప్రూవల్ చేయిస్తున్నామని చెప్పడంతో ‘మీరెందుకలా చేయడం లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement