స్థానిక పేస్ ఇంజినీరింగ్ కళాశాలలో విండోస్ మొబైల్ అప్లికేషన్స్ అనే అంశంపై కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగాల్లో...
ఒంగోలు వన్‌టౌన్: స్థానిక పేస్ ఇంజినీరింగ్ కళాశాలలో విండోస్ మొబైల్ అప్లికేషన్స్ అనే అంశంపై కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగాల్లో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మూడు రోజుల శిక్షణ తరగతులను శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్ తెలిపారు.కళాశాలలో శుక్రవారం జరిగిన సమావేశంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సి.వి.సుబ్బారావు మాట్లాడుతూ మొబైల్ అప్లికేషన్స్ వంటి ఆధునాతన అంశాలపై పట్టు సాధించేందుకు ఈ శిక్షణ తరగతులు దోహదపడతాయన్నారు.
విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని తెలిపారు. కంప్యూటర్‌సైన్స్ ఐటీ విభాగాధిపతి పి.మల్లికార్జునరావు మాట్లాడుతూ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా ఆండ్రాయిడ్ అప్లికేషన్లపై శిక్షణ తరగతులు నిర్వహించామని చెప్పారు. ప్రస్తుతం విండోస్ అప్లికేషన్స్‌పై తరగతులు జరుగుతాయన్నారు. మైక్రోసాఫ్ట్‌లో విశేష అనుభవం గడించిన నల్లూరి శ్రీనివాసరావు, పవన్‌శుక్లాలు మాట్లాడుతూ విద్యార్థులు అహ్యూర్ అకౌంట్ ద్వారా అభివృద్ధి చేసిన అప్లికేషన్‌ను ఇంటర్‌నెట్ నిక్షితం చేసి వినియోగదారులకు అందుబాటులో ఉంచవచ్చునన్నారు.
మొబైల్ అప్లికేషన్‌లో అనుభవం గడించిన విద్యార్థులు సమీప భవిష్యత్తులో మంచి ఉద్యోగాల్లో స్థిరపడవచ్చునన్నారు. కార్యక్రమానికి సంధానకర్తలుగా ప్రాంగణ ఎంపిక విభాగం సంధానకర్త పి.రాజేష్, కంప్యూటర్‌సైన్స్ అధ్యాపకుడు ఎస్.ఫణికుమార్ వ్యవహరించారు.