
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రశ్నపత్రాలు ఇప్పుటికే జిల్లాకు చేరాయి. జవాబు పత్రాలు, ఇతర 24 రకాల పరీక్షల సామగ్రిని 106 సెంటర్లకు చేరవేసే కార్యక్రమం పూర్తయింది.
మొత్తం 87,247 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 39,135మంది. వీరికి ఈ నెల 12నుంచి 25వ తేదీ వరకు, 48,112 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 13 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. ఉదయం 8.45 గంటలకే హాలులో ఉండాలి .విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 8.45 గంటల వరకు కేటాయించిన గదిలో కూర్చోవాలి. ప్రత్యేక కారణాలుంటే తప్ప ఆ తర్వాత అనుమతించరు. 8.45గంటల తర్వాత వస్తే ఏ కారణం చేత ఆలస్యమయింది, విద్యార్థిపేరు, హాల్‌టికెట్ నంబర్, ఏ కాలేజీ తదితర వివరాలను ఇంటర్ బోర్డుకు నివేదిస్తారు.
అదే విద్యార్థి తర్వాత జరిగే పరీక్షలకు కూడా ఆలస్యంగా వస్తే అనుమతించరు. ఆలస్యం కారణాలపై నిఘా పెడతారు. విచారించి తగు చర్య తీసుకుంటారు. విద్యార్థులు గుంపులుగా సెంటర్‌కు రాకూడదు. విద్యార్థులు వారి స్థానాల్లో కూర్చున్నాక 8.45గంటల తర్వాతే ప్రశ్నపత్రాలు తెరిచి 8.58 గంటలకు ఆయా గదులకు పంపించాలి.
గ్లోబల్ పొజీషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) పరిజ్ఞానం అమలు
పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్టుమెంట్ అధికారులు కూడా సెల్‌ఫోన్ వాడరాదు. ఆర్‌జేడీ, డీవీఈఓ, ఆర్‌ఐఓ, డీఈసీ, హెచ్‌పీసీ, సభ్యులు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌ల ఫోన్ నంబర్లు ఇప్పటికే బోర్డులో నమోదు చేశారు. గ్లోబల్ పొజీషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను అమలు చేస్తున్నారు. దీంతో పరీక్షా కేంద్రంలో వాడే సెల్, ల్యాండ్ ఫోన్‌నంబర్లు, సంభాషణలు, ఎస్‌ఎంఎస్‌లు ఎప్పటికప్పుడు రికార్డు అవుతాయి.
సిబ్బంది నియామకం పూర్తి
జిల్లాలో గత సంవత్సరం 119 సెంటర్లుండగా ఈ యేడాది 13 సెంటర్లను తగ్గించి 106 సెంటర్లనే ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సెంటర్‌కు ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్టుమెంట్ అధికారిని నియమించారు. తహసీల్దార్, ఎస్‌ఐ, ఇంటర్ అధికారులతో కూడిన 4 ఫ్లైయింగ్ స్క్వాడ్, 10 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేస్తాయి. ఇన్విజిలేటర్ల నియామకం కూడా పూర్తయ్యింది. పరీక్ష అనంతరం జవాబు పత్రాలను సీల్‌చేసి అదే రోజు స్థానిక పోస్టాఫీసు ద్వారా స్పీడ్ పోస్టులో జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ రిసెప్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ (డీఆర్‌డీసీ)కి చేరవేస్తారు. ఇతర జిల్లాలకు చెందిన ఇద్దరు ప్రిన్సిపాళ్లు, ఇద్దరు సీనియర్ లెక్చరర్లు సభ్యులుగా ఉండే డీఆర్‌డీసీ నుంచి జవాబు పత్రాలను కేటాయించిన జిల్లాలకు పంపుతారు. వివరాలను గోప్యంగా ఉంచుతారు. తెలంగాణ జిల్లాల పేపర్లను ఈ ప్రాంతంలోనే దిద్దాలనే డిమాండ్‌పై బోర్డు స్పందన ఇప్పటికీ గోప్యంగానే ఉంది.
అడిషనల్ ఆన్సర్‌షీట్లు ఇవ్వరు
ప్రతిపేజీకి 24 గీతలుండే 24 పేజీల ఆన్సర్‌షీట్ ఇస్తారు. అడిషనల్ షీట్లు ఇవ్వరు. అన్ని జవాబులను అందులోనే సర్దుబాటు చేయాలి. ప్రథమ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులకు ద్వితీయ బాష పరీక్షకు కొత్త సిలబస్‌తో, బ్యాక్‌లాగ్‌వారికి పాత సిలబస్‌తో ప్రశ్నపత్రాలు ఇస్తారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం సైన్స్ రెగ్యులర్ విద్యార్థులకు కొత్త సిలబస్‌లో, బ్యాక్‌లాగ్‌వారికి పాతసిలబస్‌తో ప్రశ్నపత్రాలు అందజేస్తారు. నామినల్ రోల్స్, హాల్‌టికెట్లు, ఓఎంఆర్ బార్‌కోడ్ షీట్లు, జవాబు పత్రాలు, ‘డీ’ ఫారాలు సెంటర్ల వారీగా పంపించారు.
మీడియం మార్పునకు అవకాశం
మీడియం మార్పు, ద్వితీయ భాషను మార్చుకునేందుకు విద్యార్థులకు పరీక్ష రాసే ముందు రోజు వరకు అవకాశం ఇచ్చారు. విద్యార్థి ఫొటో, సంతకం, మార్పు అంశాలను ఆయా కళాశాలల నుంచి ఆన్‌లైన్ ద్వారా పంపించాలి. వివరాలను ఆర్‌ఐఓ కార్యాలయంలో నిర్ధారణ చేసిన అనంతరం అనుమతిస్తారు.