సాక్షి ప్రతినిధి, కర్నూలు: రెండు పర్యాయాలు ఎమ్మెల్యే.. ఆపై మంత్రి.. ఇంకేముంది జిల్లా అధికార వ్యవహారాల్లో ఆయన హవా కొనసాగింది. బదిలీలు.. పనులు.. ఒకటేమిటి అన్నింట్లో ఆయన మార్కు కనిపించింది. ఐదేళ్ల పదవీ కాలంలో ఉండే నాయకులకు అధికారులు గులాం కాక తప్పని పరిస్థితి. కాదూ కూడదంటే బదిలీయే బహుమానం. ఇలా మంత్రి టీజీ జారీ చేసిన ఆదేశాలన్నింటికీ అధికార యంత్రాంగం తలూపింది. మరో వారం రోజుల్లో సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో పరిస్థితి తారుమారైంది. కాంగ్రెస్ పార్టీ మంత్రిగా రాష్ట్ర విభజనను అడ్డుకోలేకపోయిన ఆయన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు.
కనీసం ప్రజలను ఆకట్టుకోవడం ద్వారానైనా నాలుగు ఓట్లు రాబట్టుకోవాలనుకుంటే అక్కడా చుక్కెదురవుతోంది. కర్నూలువాసులకు కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని రుద్రవరం గ్రామ వ్యవసాయ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు తనదైన శైలిలో పావులు కదిపారు. ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు మురళీకృష్ణ కర్నూలు పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వే శాఖ కేంద్ర సహాయ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రాజకీయంగా కోట్ల, టీజీ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇళ్ల పట్టాల వ్యవహారాన్ని ఎమ్మెల్యే మురళి అడ్డుకున్నారు.
అయితే రాష్ట్ర మంత్రి కావడంతో కొంతవరకు ఫైల్‌ను కదిలించగలిగినా.. చిట్టచివరన అధికారులు బ్రేక్ వేశారు. రచ్చబండ-1లో ఇళ్ల పట్టాల కోసం వచ్చిన వినతులకు సంబంధించి 7,700 మందికి కర్నూలు మండలం రుద్రవరం గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 507/ఏ, 605, 652, 671, 681లో 243 ఎకరాలను పంపిణీ చేయాలని భావించారు. అయితే ఆ భూముల్లో 170 ఎకరాలను రైతులు కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. వారికి తెలియకుండా ఆ భూములను లాక్కొని ఇళ్ల పట్టాలు ఇవ్వడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మంత్రి రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా భూములను డీలిస్ట్ చేయించినట్లు సమాచారం.
ఇప్పటికే ఆ భూమిలో 2,500 మందికి పట్టాలు కూడా పంపిణీ చేసేశారు. మిగిలిన 5,200 పట్టాలను పంపిణీ చేసేందుకు గత కొద్దిరోజుల క్రితం టీజీవి అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుసుకున్న రైతులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. విషయాన్ని వైఎస్సార్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకురావడంతో ఆయన గుట్టురట్టు చేశారు. విషయం అప్పటికి సద్దుమణిగినా రెండు రోజులుగా రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు తీవ్రతరమయ్యాయి. ఎన్నికల సమయంలో ఆయన మాటకు తలూపితే ఇబ్బందులు తప్పవని భావించినా అధికారులు సంతకాలు పెట్టేందుకు నిరాకరించారు.
అపద్ధర్మ సీఎం నుంచి ఫోన్?
తన మాట వినకపోవడంతో టీజీ వెంకటేష్ పట్టాలపై సంతకాలు చేయాలంటూ అపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిచే జిల్లా అధికారికి ఫోన్ చేయిచినట్లు విశ్వసనీయ సమాచారం. అంతకు ముందు ఇటీవల బదిలీ అయిన కర్నూలు మండల తహశీల్దార్ బాలగణేషయ్యపైనా ఆ విషయమై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పట్టాల వ్యవహారాన్ని మంత్రి కోట్ల వర్గం వ్యతిరేకిస్తోంది. ఈ పరిస్థితుల్లో అధికారులు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
చుక్కెదురు!
Published Wed, Feb 26 2014 4:07 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement