సాక్షి, ఒంగోలు : ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షలు అడ్డగోలుగా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని కళాశాలలకు స్క్వాడ్‌లు, ఎగ్జామినర్‌ల నియామకంలోనూ అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నెల 8వ తేదీ నుంచి వర్శిటీ పరిధిలో బీఈడీ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రకాశంలో 16, గుంటూరు జిల్లాలో మరో 16 కళాశాలల్లో పరీక్షలు జరుగుతుండగా సుమారు 3,500 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవుతున్నారు.
వీరిలో పశ్చిమబెంగాల్, ఒడిశా, బీహార్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే అత్యధిక మంది ఉండటం గమనార్హం. ఆయా రాష్ట్రాల్లో ఉపాధ్యాయ పోస్టులకు ప్రాక్టికల్ పరీక్షల మార్కులకు వెయిటేజీ ఉండటంతో.. విద్యార్థుల నుంచి సొమ్ములకు ఆశపడుతున్న కొందరు ఎగ్జామినర్‌లు అక్రమాలకు ప్రోత్సహిస్తున్నట్లు వర్శిటీకి ఫిర్యాదులు అందుతున్నాయి.
ఇదీ.. అక్రమాల తీరు
బీఈడీ ప్రయోగ పరీక్షలకు 2011-12 వరకు ప్రతీ పరీక్ష కేంద్రానికి ఒక పరిశీలకుడు, ఇదేం ‘ప్రయోగం’
ప్రత్యేక స్క్వాడ్ బృందాన్ని నియమించేవారు. అనంతరం 2012-13లో పరీక్షల పరిశీలకుల (అబ్జర్వర్‌లు) వ్యవస్థను తీసేసి... స్టాఫ్ అప్రూవలైన కొందరు బీఈడీ సిబ్బందిని తనిఖీ బృందాలుగా వేశారు. ఆ మేరకు ప్రస్తుత పరీక్షలకు ప్రకాశంలో ముగ్గురు స్క్వాడ్ సభ్యులు, గుంటూరులో ఇద్దరిని నియమించారు. నియామకమైన సభ్యుల్లో స్టాఫ్‌అప్రూవల్ లేని వారు ఉన్నారని.. బీఈడీ యాజమాన్యాలతో ముందస్తు ఒప్పందాలు కుదిరించుకుని ప్రయోగ పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు అనుమతిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
అర్హత లేకుండా స్క్వాడ్ సభ్యులుగా చెలామణి అయిన వారి తప్పిదాలు, కిందటి పరీక్షలప్పుడు వారి అక్రమాలపై ఆధారాలను సేకరించిన కొందరు ఉపాధ్యాయులు వర్శిటీ ఉన్నతాధికారులకు గురువారం రాతపూర్వక ఫిర్యాదు అందించారు. ప్రకాశం జిల్లాలోని దర్శి కళాశాల అధ్యాపకుడితో చేతులు కలిపిన గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన కళాశాల కరస్పాండెంట్ ఈ స్క్వాడ్ బృందాల నియామకంలో చక్రం తిప్పినట్లు సమాచారం. టీడీపీ కీలక నేత ఆశీస్సులతో సదరు కళాశాల కరస్పాండెంట్ ఏఎన్‌యూ అధికారులను బెదిరింపులకు దిగిన సంద ర్భాలపై వర్శిటీ సిబ్బంది భగ్గుమంటున్నారు.
పరీక్షల ఎగ్జామినర్‌ల నియామకమూ ఇష్టానుసారంగా ఉందని.. గతంలో డీఈడీ పరీక్షల చీఫ్‌లుగా అక్రమాలకు పాల్పడి చర్యలను గురైన వారిని బీఈడీ ప్రయోగ పరీక్షలకు ఎగ్జామినర్‌లు నియమించారు. దర్శిలోని ఓ బీఈడీ కళాశాల బయాలజీ అంతర్గత పరిశీలకునిగా గుంటూరు నడిబొడ్డునున్న బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ నియామకమయ్యారు. మిర్యాలగూడలోని కళాశాల ప్రిన్సిపాల్ సైతం స్టాఫ్ అప్రూవల్ జాబితాలో లేకుండానే గుంటూరు పల్నాడు కళాశాలలో ఎగ్జామినర్‌గా వ్యవహరిస్తున్నారు.
విద్యార్థులు ప్రయోగపరీక్షలకు హాజరుకాకున్నా.. రికార్డులు ఒకరివి ఒకరు పెట్టుకుని రాసినా.. పాత రికార్డులు సమర్పించినా చూసీ చూడనట్టు వ్యవహరించాలనే ఒప్పందంతో ఒక్కో ఎగ్జామినర్‌కు రోజుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు కళాశాలల యాజమన్యాలు అందిస్తున్నట్లు సమాచారం. గైర్హాజరువుతున్న ఇతర రాష్ట్రాల విద్యార్థుల ప్రాక్టికల్స్‌ను స్థానికులతో చేయించేందుకు ఒక్కోక్కరి వద్ద రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఏటా బీఈడీ థియరీ, ప్రయోగపరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నా వర్శిటీ ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.
అప్రూవల్ లేకుండా స్క్వాడ్
Published Fri, Sep 12 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM
Advertisement
Advertisement