లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి | woman died in road accident | Sakshi
Sakshi News home page

లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Published Sat, Dec 28 2013 2:23 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

woman died in road accident

తణుకు క్రైం, న్యూస్‌లైన్ : లారీ డ్రైవర్ నిర్లక్ష్యం మహిళా కార్మికురాలి ప్రాణాన్ని బలిగొంది. స్థానికులు, పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. మండపాక గ్రామానికి చెందిన పెనుమాల అరుణ కుమారి (37) తేతలి వై జంక్షన్ సమీపంలోని వెంట్రుకల ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. ఫ్యాక్టరీకి వె ళ్లేందు కు శుక్రవారం ఉదయం ఇంటి నుంచి క్యారేజి తీసుకుని బయల్దేరిన ఆమె 8.30 గంటల సమయంలో తేతలి వై జంక్షన్ దాటుతుండగా మండపాక నుంచి తాడేపల్లిగూడెం వైపు వెళ్తున్న పేపరు లోడులారీ వెనుక నుంచి ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పిన లారీ డివైడర్ మీదుగా జాతీయ రహదారిపై వ్యతిరేక దిశలోకి వెళ్లిపోయింది. ప్రమాదంలో అరుణ  అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలికి భర్త రాజేం ద్రప్రసాద్‌తో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భర్త వడ్లూరులోని స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే విధి నిర్వహణలో ఉన్న మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పి.సీతాపతిరావు పోలీసులకు సమాచారం అందించారు. తణుకు సీఐ గుమ్మళ్ల మధుబాబు సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. రూరల్ పోలీ సులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రాణం తీసింది
 లారీడ్రైవర్ పళ్లు తోముకుంటూ స్టీరింగ్ పట్టుకుని డ్రైవింగ్ చేయడం వలనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పైడిపర్రు రోడ్డు నుంచి తాడేపల్లిగూడెం వైపు వెళ్లేందుకు జాతీయ రహదారిపైకి వచ్చిన డ్రైవర్ ఒకచేత్తో స్టీరింగ్ తిప్పుతూ డ్రైవింగ్ చేస్తున్నాడని అదే సమయంలో సైకిల్‌పై అరుణ రోడ్డు దాటుతుండగా లారీని అదుపుచేయలేక ఢీకొట్టాడని పేర్కొన్నారు. లారీకి అలంకరణ కోసం అమర్చిన గొలుసులు  సైకిల్ ఊసలకు చిక్కుకుని లాక్కుపోయినట్లు తెలుస్తోంది. సైకిల్ చక్రాలకు గొలుసులు చిక్కుకుని ఉండడమే దీనికి నిదర్శనం. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ నోట్లో బ్రష్‌తో కిందకు దూకి పారిపోయాడని స్థానికులు చెబుతున్నారు.
 
 బాధిత కుటుంబాన్ని 
 పరామర్శించిన విడివాడ 
 మండపాక  గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు విడివాడ రామచంద్రరావు ప్రమాదవార్త తెలుసుకున్న వెంటనే ఘటనా ప్రాంతానికి వచ్చి మృతురాలి భర్త రాజేంద్రప్రసాద్, కుటుంబసభ్యులను పరామర్శించారు. పేదలైన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.
 
 విలవిల్లాడిన తోటి కార్మికులు
 అక్కా.. అరుణక్కా... అంటూ తోటి కార్మికుల రోదనలతో ఘటనా ప్రాంతం హోరెత్తింది. రక్త సంబంధం కాకపోరుున మృతదేహాన్ని చుట్టేసుకుని బోరున విలపించారు. అరుణ మరణించిందన్న వార్త తెలుసుకున్న తోటి మహిళా కార్మికులు పరుగు పరుగున ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహంపై పడి రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ, కలుపుగోలుగా ఉంటుందని కార్మికులు లక్ష్మి, నాగమణి, ధనలక్ష్మి కన్నీళ్లపర్యంతమయ్యారు. పోలీసులు, స్థానికులు కలిసి వారందరినీ బలవంతంగా ఫ్యాక్టరీకి పంపించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement