అత్తింట్లో యువతి పోరాటం
అత్తింట్లో యువతి పోరాటం
Published Fri, Feb 7 2014 9:30 AM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM
రేపల్లె రూరల్, న్యూస్‌లైన్ :తన భర్త హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుంటే.. తాను అత్తవారింట్లో ఉండడమేంటని ప్రశ్నిస్తూ.. తనను భర్తతో కాపురానికి పంపించాలంటూ ఓ యువతి అత్తవారింట్లో నిరాహార దీక్ష చేపట్టింది. సేకరించిన వివరాల ప్రకారం.. పట్టణంలోని 8వ వార్డులో ఉంటున్న వీసం రామారావు రెండో కుమారుడు శ్రీధర్‌కు చెరుకుపల్లికి చెందిన అన్నం పుల్లారావు కుమార్తె శకుంతల నాగార్జునతో 2011లో వివాహం చేశారు. హైదరాబాద్‌లో హెచ్‌ఎస్‌బీసీలో సాఫ్ట్‌వేర్ విభాగంలో పనిచేస్తున్న శ్రీధర్ పెళ్లయ్యాక 15 రోజులకోసారి ఇక్కడకు వచ్చి ఒకరోజు ఉండి వెళుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో కాపురం పెట్టాలని శకుంతల బంధువులు శ్రీధర్ తల్లిదండ్రులను కోరగా అంగీకరించారు.
దీంతో ఏడాది క్రితం రెండు లక్షలు విలువైన ఇంటి సామానును హైదరాబాద్‌కు పంపించారు .ఇంతలో అత్తమామలతో పాటు అత్త తమ్ముడు దిల్‌బాబు కలిసి శ్రీధర్‌కు మేనకోడల్ని ఇచ్చి పెళ్లిచేయాలని కుట్రపన్నారు. కాపురం పెట్టడానికి శకుంతలను హైదరాబాద్ తీసుకువెళ్లి కొద్దిరోజులకే మళ్లీ రేపల్లెకు తీసుకువచ్చారు. అత్తింటివారు పథకం ప్రకారం ఆమెను మానసికంగా హింసించి పుట్టింటికి పంపించారు. దీంతో శకుంతల బంధువులు ఆమె అత్తమామలను ప్రశ్నించగా కాపురం అప్పుడు పెడతాం .. ఇప్పుడు పెడతామంటూ దాటవేస్తూ వచ్చారు.
పెద్దమనుషుల జోక్యంతో కాపురానికి తీసుకువెళతామన్న అత్తమామలు దాటవేసే ధోరణిని అవలంబించసాగారు. దీంతో మానసిక వ్యధకు గురైన శకుంతల, ఆమె బంధువులు పెద్ద మనుషులను తీసుకుని అత్తవారింటికి వ చ్చి నిరాహార దీక్ష ప్రారంభించింది. తనను భర్తతో కాపురానికి పంపించి, తనకు న్యాయం చేయాలని శకుంతల విలపించింది. వివాహ సమయంలో భారీగా కట్నకానుకలు కూడా ఇచ్చినట్లు ఆమె బంధువులు చెబుతున్నారు.
కృష్ణబలిజ సంఘం మద్దతు.. ఏడాదిన్నర కాలంగా కాపురానికి పంపిస్తామని వీసం రామారావు దంపతులు మభ్యపెడుతూ శకుంతలకు అన్యాయం చేయడం సరైన విధానం కాదని కృష్ణబలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నం రాఘవయ్య అన్నారు. న్యాయం జరిగే వరకు సామాజిక పోరాటం చేస్తున్న శకుంతలకు అండ గా ఉంటామన్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగమని లక్షలు కట్నం తీసుకుని ఆడపిల్లను చిత్రహింసలు పెట్టడాన్ని సమాజం హర్షించదని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు బొమ్మిడి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయపోరాటం చేస్తున్న శకుంతలకు మద్దతు ప్రకటించారు.
Advertisement