
కొట్టాంలో దీక్షకు దిగిన బెంగళూరుకి చెందిన కుమారి అనాంబ
శృంగవరపుకోట రూరల్: ప్రేమించి... పెళ్లి చేసుకుని ఆనక ముఖం చాటేసి... మరో వివాహానికి సిద్ధపడుతున్నాడంటూ విజయనగరం జిల్లా కొట్టాం గ్రామానికి చెందిన బొడబళ్ల సతీష్ ఇంటి ఎదుట బెంగళూరుకు చెందిన కుమారి అనాంబ బుధవారం ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ బెంగళూరుకు చెందిన తాను హైదరాబాద్‌లో ఓ ఎన్జీవో సంస్థలో ఉద్యోగం చేస్తూ మెహదీపట్నంలో ఉండేదాన్నని తెలిపారు. మూడున్నరేళ్ల క్రితం ఏపీఎస్పీ హెడ్‌కానిస్టేబుల్ బొడబళ్ల సతీష్ తనను పరిచయం చేసుకుని ప్రేమించి హైదరాబాద్‌లోని శివాజీ ఆలయంలో 2015 సంవత్సరం అక్టోబర్ 14వ తేదీన పెళ్లాడినట్టు తెలిపింది.
తరువాత తనను వదిలేసి తప్పించుకు తిరుగుతున్నాడని, మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుండటంతో నిలదీసేందుకే ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. సతీష్ కారణంగా తాను రెండుసార్లు గర్భం దాల్చగా అబార్షన్లు చేయించాడని వాపోయింది. తాను సతీష్ భార్యగానే ఓటరు ఐడెంటిటీ కార్డు కూడా ఉందనీ, హైదరాబాద్ నుంచి సతీష్ నాలుగు నెలల కిందట కాకినాడ బెటాలియన్‌కు బదిలీ చేసుకుని వచ్చి, ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధపడుతున్నాడని ఆరోపించింది. తనను చంపేసినా సరే కదిలేది లేదని ఆ ఇంటిముందు దీక్షకు దిగింది.
కాగా తన కుమారుడినుంచి డబ్బు గుంజేందుకు ఈమె నాటకం ఆడుతోందని సతష్ తల్లి బొడబళ్ల రామాయమ్మ ఆరోపిస్తున్నారు. కాగా సతీష్‌ను ఫోన్‌లో సంప్రదించగా కుమారి అనాంబతో తనకు హైదరాబాద్‌లో పరిచయం ఉందనీ, అనాథ అని తెలిసి పెళ్లి చేసుకుందామనుకున్నాననీ, కానీ ఆమెకు ఇదివరకే వివాహం అయినట్టు తెలియడంతో ఆ ఆలోచన విరమించుకున్నానని తెలిపారు.