వారిదో అందమైన కుటుంబం. జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తున్నారు. పెళ్లై రెండేళ్లు అయింది. ఏడాది క్రితం కుమారుడు కూడా పుట్టాడు. ఆ సంతోషంలో విహరిస్తున్న ఆ కుటుంబాన్ని చూసి దేవుడికి ఆçసూయ వేసిందేమో. ఇంటి ఇల్లాలికి క్యాన్సర్ భూతం కబలిస్తోందన్న వార్త తెలిసింది. అంతే అప్పటి నుంచి తిరగని ఆస్పత్రి లేదు. పెట్టని ఖర్చు లేదు. ఇంత చేస్తున్నా ఏమాత్రం నయం కావడం లేదు. సరికదా రోజురోజుకు ఆరోగ్యం క్షిణిస్తోంది. ఇన్నాళ్లు ఎలాగో గుట్టుగా వైద్యం చేసిన ఇంటి పెద్ద ఆర్థిక స్థోమత సరిపోక దాతలు, విరాళాల కోసం ఎదురుచూస్తున్నారు.
సాలూరు: సాలూరు పట్టణంలోని బోనుమహంతి వీధికి చెందిన బూసురోతు భారతి అనే మహిళకు రెండేళ్ల క్రితం భరత్‌రాజు అనే ఆటో డ్రైవర్‌తో వివాహం అయింది. ఉన్నదాంతో వారు సంతోషంగా జీవిస్తున్నారు. ఇంతలో బాబు కూడా పుట్టాడు. అయితే ఉన్నట్టుండి భారతి ఆరు నెలల క్రితం తీవ్ర అస్వస్థతకు లోనైంది. అప్పటి నుంచి వారు ఎన్ని ఆస్పత్రులకు తిరిగారో తెలియదు. నాలుగు నెలల కిందట మహాత్మాగాంధీ ఆస్పత్రి వైద్యులు పరీక్షించి బ్లడ్ క్యాన్సర్‌గా నిర్ధారించారు. అయినా ఆస్పత్రులకు తిరుగుతున్నారు. హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రిలో చూపితే ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పారు. బెంగళూరులో నాటు వైద్యంతో నయమవుతుందని చెప్పడంతో అక్కడికి వెళ్లారు. ఇంతలో హైదరాబాద్ మహాత్మాగాంధీ ఆస్పత్రి వారు ఉచితంగా వైద్యం చేస్తారని తెలిసి అక్కడి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. కొన్నాళ్లు ఆమె బాగానే ఉన్నారు. ఇక తగ్గిందనుకున్నారు అందరూ.
ఇంతలోనే మళ్లీ..
ఇక బాధలు తగ్గాయి అనుకుంటున్న తరుణంలో రెండు వారాల క్రితం పిప్పిపన్ను రూపంలో మళ్లీ రోగం తిరగేసింది. ఇన్‌ఫెక్షన్ సోకి పరిస్థితి విషమించింది. ప్రస్తుతం తణుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు భారతి. అక్కడి వైద్యులు బోన్ మేరో ఆపరేషన్ చేసేందుకు రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. దాంతో అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో తెలియక కుటుంబీకులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. భర్త భార్యను తిప్పుతు ఉండడంతో ఆటో వేసేందుకు కూడా సమయం లేకుండా పోయింది.
మనసున్న మారాజులు ఆదుకోరూ..!
విరాళాలు ఇచ్చి తన భార్యను ఆదుకోవాలని భరత్ రాజు, కూతురును కాపాడాలని భారతి తల్లి ఈశ్వరమ్మ దాతలను కోరుతున్నారు. మనసున్న మారాజులు ఆదుకోవాలని, ఎవరైనా డబ్బులు వేయాలనుకుంటే భారతి బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు వేయాలని సూచించారు. విరాళాలు ఇవ్వాలనుకున్న వారు ‘ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్, సాలూరు, అకౌంట్ నంబర్: 7308917918–5, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్– ఎస్‌బీఐఎన్ జీరో ఆర్‌ఆర్‌ఏపీజీబీ’ డబ్బులు వేయాలని అర్ధిస్తున్నారు.
ప్రాణాలు కాపాడాలని వేడుకోలు
మా శక్తి అయిపోయింది. నా బిడ్డ ప్రాణాలను దాతలే రక్షించాలి. నా మనవడిని తల్లి లేని వాడుకాకుండా ప్రజలే చూడాలి. దాతలు ఎవరికి తోచిన సాయం వారు అందించి బిడ్డ ప్రాణాలు కాపాడరూ..!-భారతి తల్లి ఈశ్వరమ్మ
Comments
Please login to add a commentAdd a comment