
సాక్షి, విశాఖపట్నం: దేశాన్ని కుదిపేసిన దిశ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు మరిన్ని నేరాలను పురిగొల్పేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెటర్నరీ డాక్టర్ దిశను దారుణంగా అత్యాచారం చేసి చంపిన నిందితులను వెనకేసుకొని రావటం ఆయన నిజస్వరూపానికి అద్దం పడుతోందని అనంతపురంలోని స్థానిక మహిళలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్‌కు మహిళలంటే చులకనభావం ఉందని, అందుకే నాలుగు వివాహాలు చేసుకున్నారని మండిపడ్డారు. కాగా పవన్ కళ్యాణ్ దిశ కేసు నిందితులకు ఉరిశిక్ష కాకుండా రెండు బెత్తం దెబ్బలు వేసి పంపాలంటూ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రజల్లో తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. (చదవండి: దిశ కేసు.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు)
జస్టిస్ ఫర్ దిశ...
విజయవాడ: నగరంలో జస్టిస్ ఫర్ దిశ నిరసనలు మిన్నంటాయి. దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఎయిర్ కండిషన్ అండ్ రిఫ్రిజిరేషన్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. లబ్బీపేట నుంచి సన్నబట్టిల సెంటర్ వరకు ర్యాలీ కొనసాగించారు. అనంతరం వారు మాట్లాడుతూ వెంటనే ఫాస్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి దిశ కేసులో నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైనా అభ్యంతరం తెలిపారు. బెత్తం దెబ్బలు కొడితే మారిపోవడానికి వారు చిన్నపిల్లలు కాదని మానవ మృగాలని పేర్కొన్నారు. అరబ్ దేశాల్లోని కఠిన చట్టాలను మనదేశంలోనూ అమలు చేయాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.