మాయ లే‘డీలు’ | Women thieves hulchul in prakasam district | Sakshi
Sakshi News home page

మాయ లే‘డీలు’

Published Tue, Jan 12 2016 4:49 PM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM

Women thieves hulchul in prakasam district

ఆభరణం కొన్న అరగంటకే తస్కరణ
ఆటోలో ప్రయాణిస్తూనే బ్యాగులో పర్సు కాజేసిన వైనం
రూ.96వేల విలువైన 4.5 సవర్ల బంగారు ఆభరణం మాయం
బంగారు ఆభరణాలు అమ్మే షాపులే లక్ష్యంగా
 
ఒంగోలు : ఒంగోలు నగరంలో ముగ్గురు మహిళలు ‘మాయ లేడీ’లుగా మారారు. సహచర ప్రయాణికుల మాదిరిగా ఉంటూ మహిళల బ్యాగుల్లో పర్సులు మాయం చేయటమే పనిగా పెట్టుకున్నారు. సోమవారం ఒంగోలు నగరంలో అదే జరిగింది . ఓ మహిళ బంగారు నగలు అమ్మే కార్పొరేట్ మాల్‌లో ఖరీదైన బంగారు హారం కొనుగోలు చేసి ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడే కాజేశారు.
 
కొన్న అరగంటకే తస్కరించారంటే ఆరితేరినవారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మార్కాపురంలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న డి.సునీత పుట్టిల్ల అయిన సూరారెడ్డిపాలెం వచ్చింది. పండుగ శెలవులు కావటంతోపాటు పండుగను ఆనందంగా జరుపుకునేందుకు బంగారు నగలు కొనుగోలు చేయాలని సునీత కుటుంబం భావించింది. అందులో భాగంగా తన తండ్రి బాల కోటయ్యతో కలిసి సూరారెడ్డిపాలెం నుంచి ఒంగోలుకు వచ్చింది. బస్టాండ్ సమీపంలోని ఖజానా జ్యూయలరీలో మధ్యాహ్నం రూ.96 వేల విలువైన 4.5 సవర్ల బంగారు ఆభరణాన్ని కొనుగోలు చేసింది.
 
ఆ బంగారు ఆభరణం ఉన్న బాక్సును ఒక పర్సులో ఉంచి దాన్ని తన హ్యాండ్ బ్యాగులో వేసుకుంది. జ్యూయలరీ షాపు నుంచి తన తండ్రితో కలిసి నడుచుకుంటూ ఆర్టీసి బస్టాండ్ సెంటర్ వరకు వచ్చారు. అక్కడ సూరారెడ్డిపాలెం వెళ్ళేందుకు ఆటో ఎక్కారు. షాపు దగ్గర నుంచి తండ్రి, కూతుర్ల వెంటే ముగ్గురు మహిళలు అనుసరించి బైపాస్ వరకు వస్తామంటూ వీరితోపాటు అదే ఆటో ఎక్కారు.
 
వెనుక సీట్లో సునీతతోపాటు తండ్రి బాలకోటయ్యలు కూర్చున్నారు. ముగ్గురు మహిళల్లో ఒకరు నడుముకు ఆపరేషన్ చేయించుకుందని, బాలకోటయ్యను ఆటో డ్రైవర్ సీటులోకి వెళ్ళాలని విజ్ఞప్తి చేసింది. సరేనంటూ బాలకోటయ్య డ్రైవర్ పక్క సీటులోకి వెళ్ళాడు. ఒకరికొకరు సరదాగా మాట్లాడుతూ ఒకరిపై ఒకరు తోసుకుంటూ నవ్వులాటలకు దిగారు.  ముందుగానే ఆటో కిరాయి ఇచ్చేశారు.
 
ఆటో నెల్లూరు బస్టాండ్ సెంటర్ దాటి యాక్సిస్ బ్యాంక్ ఎదురుకు వచ్చే సరికి అర్జంటుగా పని ఉందంటూ ముగ్గురు మహిళలు దిగేశారు. ఆటో కొంచెం ముందుకు వెళ్ళేసరికి సునీత తన బ్యాగును చూసుకుంది. ఆ బ్యాగు జిప్ తీసి ఉండడంతో బ్యాగులోని పర్సు చూసుకోగా అందులోని పర్సు మాయమైందని గుర్తించి ఆటోను వెనక్కు తిప్ప పరిసర ప్రాంతాల్లో వెతికినా వారి ఆచూకీ కనిపించలేదు.
 
వెంటనే ఆ సమాచారం ఒంగోలు టూటౌన్ బ్లూకోట్స్ సిబ్బందికి అందించారు. బ్లూ కోట్స్ సిబ్బంది రామకృష్ణ(ఆర్‌కె), వెంకటేశ్వర్లు అక్కడకు చేరుకొని వివరాలు సేకరించి సమాచారాన్ని పోలీస్ ఉన్నతాధికారులకు చేరవేశారు. ఆ మాయలేడీల కోసం నగరంలో వెతుకులాట ప్రారంభించినా ఫలితం కనిపించలేదు. ఒంగోలు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement