prakasam district police
-
చరిత్ర సృష్టించిన ప్రకాశం పోలీస్
సాక్షి, ఒంగోలు: ప్రకాశం పోలీసులు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఏజెన్సీలతో సహా అన్ని పోలీసుస్టేషన్లు వీడియో కాన్ఫరెన్స్‌కు అనుసంధానం చేశారు. అది కూడా కేవలం రూ.2,100 ఖర్చుతో. ఒక్కో స్టేషన్‌ను వీడియో కాన్ఫరెన్స్‌కు అందుబాటులోకి తెచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌ను సిస్టంకు మాత్రమే కాకుండా ఆండ్రాయిడ్ మొబైల్, ల్యాప్‌టాప్‌కు సైతం అందుబాటులోకి తెచ్చారు. శనివారం ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ ట్రయల్ రన్ విజయం సాధించడంతో పలు జిల్లాల ఎస్పీలు సైతం అందుబాటులోకి వచ్చి ఈ ప్రక్రియను తమ జిల్లాలో సైతం అమలు చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ సహకారాన్ని కోరారు. ఇవీ.. ఉపయోగాలు ► పోలీసు శాఖ ఇప్పటి వరకు సెట్ కాన్ఫరెన్స్ పైనే ఎక్కువుగా ఆధారపడుతుండేది. డైలీ స్టేషన్ రిపోర్టుకు సంబంధించిన అంశాలతో నేరుగా ప్రతి రోజు ఉదయం మాట్లాడడం రివాజు. ఈ క్రమంలో అధికారులు సెట్లో చెప్పేదానికి, అదే విధంగా ఫోన్లో మాట్లాడుతున్నా నేరుగా వారితో మాట్లాడేటప్పుడు ఉండే ఫీలింగ్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. అధికారి నేరుగా కనిపించినప్పుడు వారికి అవసరమైతే స్పష్టమైన సూచనలు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ అందుబాటులోకి రావడం ద్వారా అధికారులంతా ఒకేసారి అందుబాటులోకి రావడం ద్వారా ఉన్నతాధికారులు జారీ చేసే ఆదేశాలను సైతం క్షణాల్లో అవతలి అధికారులకు వేగవంతంగా పంపే అవకాశం లభించినట్లయింది ► ఒక వేళ అధికారి అందుబాటులో లేకపోతే ఆ అధికారి తన వద్ద ఉన్న ల్యాప్ ట్యాప్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇంకా ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నా దీంతో కూడా ఎస్పీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే సౌలభ్యం ఉంది. ► ఎక్కడైనా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నా లేక ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులు వస్తే వారి కార్యక్రమాన్ని ఎస్పీ తన కార్యాలయంలోనే ఉండి నేరుగా అక్కడ ఏం జరుగుతుందనేది ఎస్పీ వీక్షించేందుకు అవకాశం ఏర్పడింది. అంతే కాకుండా అప్పటికప్పుడు అవసరమైన సూచనలు, సలహాలను కూడా ఎస్పీ జారీ చేసేందుకు సౌలభ్యం ఉంది. ► వాస్తవానికి ఇప్పటి వరకు దోర్నాల, పెద్దారవీడు, కంభం, పుల్లలచెరువు, సీఎస్‌పురం పోలీసుస్టేషన్ల పరిధిలోని ఎస్ఐలతో ఎస్పీ నేరుగా మాట్లాడటమంటే వారు నేరుగా ఎస్పీ కార్యాలయానికి వచ్చినప్పుడో లేక ఎస్పీ సంబంధిత స్టేషన్లకు వెళ్లినప్పుడో జరిగేది. దీని ద్వారా ఇరువరి మధ్య ముఖాముఖి కనీసం 6 నెలలుకుపైగా పడుతుందని పోలీసుశాఖలోనే అంచనా. అటువంటిది అవసరమనుకుంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్షంగా నేరుగా సంబంధిత అధికారితో ఎస్పీ మాట్లాడే అవకాశం ఏర్పడింది. ► ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్పందన కార్యక్రమాన్ని ప్రతి సోమవారం ప్రజలకు, ప్రతి శుక్రవారం సిబ్బందికి ఎస్పీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లేదా డీజీపీ లేదా ఐజీలు నేరుగా ఏ అధికారితో అయినా కనెక్ట్ అయ్యే అవకాశం ఏర్పడింది. నేరుగా సంబంధిత అధికారితో మాట్లాడటం ద్వారా సమస్యను అత్యంత వేగవంతంగా పరిష్కరించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతే కాకుండా ఈ ప్రక్రియ ద్వారా సిబ్బందిలో బాధ్యత కూడా పెరుగుతుందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ► ఉదాహరణకు కలెక్టరేట్ వద్దే వందలాది మంది ప్రజానీకం వచ్చి ధర్నాలు చేస్తుంటే అవసరమైన పక్షంలో అదనపు బలగాలను పంపించే అవకాశం ఏర్పడుతుంది. ఏఆర్ సిబ్బందిని కూడా ముందుగానే పెద్ద ఎత్తున పంపేకంటే అక్కడ ఉన్న పరిస్థితిని అంచనా వేసుకుంటూ ఎంతమందిని పంపాలనే దానిపై నిర్ణయం తీసుకునే వీలుంటుంది. వీడియో కాన్ఫరెన్స్‌కు వివిధ ప్రాంతాల్లో హాజరైన అధికారులు ఐజీ ప్రశంసలు శనివారం ఎస్పీ కార్యాలయంలోని గెలాక్సీ సమావేశ మందిరం నుంచి ఎస్పీ సిద్ధార్థ కౌశల్ చేపట్టిన ప్రయోగాత్మక ప్రాజెక్టుకు ట్రయల్ రన్ వేశారు. ఈ ట్రయల్ రన్లో ల్యాప్‌టాప్‌తో గుంటూరు రేంజీ ఐజీ వినీత్‌బ్రిజ్‌లాల్ లైన్లోకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన దోర్నాల స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఎస్పీతో నేరుగా మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో ప్రకాశం పోలీస్ ఐటీ విభాగం ఎప్పుడు ముందుంటుందని, అదే మాదిరిగా ఎస్పీ కూడా సాంకేతికతను జోడించారంటూ అభినందించారు. ఈ సందర్భంగా ప్రాథమికంగా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలను సైతం ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. సంబంధిత పోలీసుస్టేషన్లలో శాంతిభద్రతల పరిస్థితి, స్పందనకు వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం, ఇతర ముఖ్యమైన అంశాల గురించి ఆయన నేరుగా మాట్లాడారు. అదే విధంగా గుట్కా, బెల్ట్‌షాపులకు సంబంధించిన వాటిని ఉపేక్షించవద్దని ఆదేశించారు. దేశంలోనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని పోలీసుస్టేషన్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తొలి గ్రామీణ జిల్లాగా ప్రకాశం గుర్తింపు పొందిందని ఐజీ ప్రశంసించారు. ఎలా జరిగిందంటే.. డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలనుకుంటే పోలీసులు తమ పరిధిలోని కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ కార్యాలయంలో అనుమతి తీసుకొని హాజరు కావాల్సి ఉండేది. చివరకు ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినా ఎస్పీ కలెక్టరేట్‌కు రావాల్సి వచ్చేది. ఎస్పీనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలనుకుంటే ఏం చేయాలి? కలెక్టరేట్లో కాన్ఫరెన్స్ హాలు ఉన్నట్లుగానే జిల్లాలోని అన్ని మండలాల్లో పోలీసులు వీడియో కాన్ఫరెన్స్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందా.. అంటే లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని తన ఆధ్వర్యంలో ఐటీ కోర్ టీంతో షేర్ చేసుకున్నారు. అన్ని పోలీసుస్టేషన్లకు వీడియో కాన్ఫరెన్స్ అంటే భారీ ఖర్చు అవుతుందని తొలుత భావించారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా పరిశీలించారు. ఒక్కో మండల స్థాయిలో తహసీల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ఖర్చు దాదాపు రూ.2 లక్షలైందని నిర్థారించుకున్నారు. అంతే కాకుండా విశాఖపట్నం సిటీలో 28 పోలీసుస్టేషన్లు ఉంటే వాటి అన్నింటికీ కలిపి వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యార్థం రూ.58 లక్షలు వినియోగించినట్లు తెలుసుకున్నారు. మరి.. జిల్లాలో అందునా ఏజెన్సీ ప్రాంతాల్లో వీడియో కాన్ఫరెన్స్ అంటే పెద్ద మొత్తం తప్పదు.. మరి ఈ వ్యయం ఎలా అధిగమించాలన్నదే పెద్ద సమస్యగా మారింది. నిన్నటి వరకు నిరుపయోగం పోలీసుస్టేషన్లలో ఎఫ్ఐఆర్లు నమోదు చేసేందుకు కంప్యూటర్లు ఉన్నాయి. అవన్నీ బాగా పాతవి కావడంతో సక్రమంగా పనిచేయని స్థితిలో ఉన్నాయి. వీటిని ఒక రకంగా స్టోర్ రూమ్‌కు పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ వ్యర్థం అనుకున్న దాని నుంచే ఫలితం రాబట్టాలని భావించారు. పోలీసుస్టేషన్లతో పాటు జిల్లా పోలీసు కార్యాలయంలోనూ నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్లు అన్నింటినీ ఒక చోటకు తెప్పించారు. వాటిన్నింటికీ ఉన్న చిన్న చిన్న మరమ్మతులును ఐటీ సిబ్బందితో పూర్తి చేయించారు. అవి రోజు వారీ కార్యక్రమాలకు ఉపయోగించలేమని భావించినా వాటన్నింటిని వీడియో కాన్ఫరెన్స్‌కు అనుసంధానం చేసుకునే సౌలభ్యం ఉందని తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌కు అవసరమైన డ్రైవర్స్‌ను సిస్టంలో ఏర్పాటు చేయించారు. ఇలా కేవలం జిల్లాలోని 64 పోలీసుస్టేషన్లతో పాటు 15 సర్కిల్ స్టేషన్లు, 5 సబ్‌డివిజినల్ పోలీసు అధికారుల కార్యాలయాలు, ఒక లుమన్ పోలీసుస్టేషన్, సీసీఎస్ పోలీసుస్టేషన్లలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోలీసు శాఖ వినియోగిస్తున్న ఇంటర్నెట్ సౌకర్యంతోనే వాటికి కనెక్షన్ ఇచ్చి నేరుగా సంబంధిత పోలీసు అధికారితో మాట్లాడేందుకు చర్యలు చేపట్టగలిగారు. సాధారణంగా ఒక్కో చోట వీడియో కాన్ఫరెన్స్‌కు రూ.2 లక్షలు కనీస వ్యయం అవుతుంటే పోలీసు శాఖ మాత్రం దాదాపు 84 పోలీసుస్టేషన్లు/అధికారుల కార్యాలయాల్లో ఒక్కో దానికి కేవలం రూ.2100 అంటే మొత్తానికి కలిపి రూ.1,76,400లతో సరిపెట్టడం కొసమెరుపు. -
పోలీసు శాఖలో ప్రక్షాళన దిశగా అడుగులు
సాక్షి, ఒంగోలు ప్రతినిధి: జిల్లాలో పోలీస్ ప్రక్షాళన మొదలైంది.. జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ దూకుడు పెంచారు.. అవినీతి పోలీస్ అధికారులు, సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. ముందుగా తన కార్యాలయం నుంచే మార్పునకు శ్రీకారం చుట్టారు. ఎస్పీ కార్యాలయంలో అంతర్గత బదిలీలు నిర్వహించిన అనంతరం సీసీఎస్, ఎస్బీ విభాగాల్లో ప్రక్షాళన షురూ చేశారు. సీసీఎస్‌లో అదనంగా ఉన్న సిబ్బందిని తొలగించడంతోపాటు ఉన్న సిబ్బందిని మూడు బృందాలుగా విభజించాలని నిర్ణయించారు. నేషనల్ హైవే స్క్వాడ్‌ను పూర్తిగా తొలగించి అక్కడ సిబ్బందిని సైతం ఆయా పోలీస్స్టేషన్లకు కేటాయించారు. ఇకమీదట హైవేలపై మూడు షిఫ్టులుగా విధులు నిర్వహించేలా ఆయా పోలీస్ స్టేషన్లలో పనిచేసే సిబ్బందికి డ్యూటీలు ఫిక్స్ చేసే పనిలో పడ్డారు. ఐడీ పార్టీ పోలీసులు పోలీస్స్టేషన్లలో అధికారులకు డబ్బులు వసూలు చేసి పెడుతున్నట్లు గుర్తించిన ఎస్పీ వారిని పూర్తిగా తొలగించిన విషయం తెలిసిందే. ఒంగోలు నగరాన్ని నిఘా నీడలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ వేర్వేరుగా ఉన్న కంట్రోల్ రూమ్‌లను ఒక్కచోట చేర్చి ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. ఈ విధానం సత్ఫలితాలు ఇస్తుండటంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌లో సీసీ ఫుటేజ్‌లు పరిశీలిస్తున్న ఎస్బీ సీఐ శ్రీకాంత్‌బాబు ఒంగోలు నగరం నేషనల్ హైవేకు పక్కనే ఉండటంతో హైవే పెట్రోలింగ్ బృందాలు గస్తీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ విధులు నిర్వహించేందుకు పోలీస్ సిబ్బంది పోటీపడుతూ పోస్టింగ్‌ల కోసం పైరవీలు చేస్తుండటాన్ని గుర్తించిన జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ నేషనల్ హైవే స్క్వాడ్‌ను పూర్తిగా తొలగించి సిబ్బందిని సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చారు. సబ్‌డివిజన్ స్థాయిలో సిబ్బందికి విధులు కేటాయించి, ఒక్కొక్కరు ఎనిమిది గంటల చొప్పున పనిచేసేలా మూడు షిఫ్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని వల్ల అవినీతిని అరికట్టడంతోపాటు సిబ్బంది కొరత తీరుతుందనేది ఎస్పీ ఆలోచనగా ఉంది. ఇప్పటి వరకూ పోలీస్ స్టేషన్లలో హవా కొనసాగించిన ఐడీ పార్టీల అవినీతి వ్యవహారాలపై కన్నెర్ర చేసిన ఎస్పీ ఆ వ్యవస్థనే రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. స్పెషల్ బ్రాంచ్‌లో సైతం సమూల మార్పులు తీసుకువచ్చి సమర్థులైన అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఎస్పీ యోచిస్తున్నారు. ఎస్పీ దూకుడుతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తప్పు చేసిన వారిని వదిలి పెట్టనంటూ ఆయన చేస్తున్న హెచ్చరికలతో పోలీస్ వర్గాల్లో వణుకు మొదలైంది. నిఘా నీడలోకి ఒంగోలు నగరం: నగరంలో గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు అక్కడక్కడా పనిచేయకపోవడం, కెమెరాల సంఖ్య తక్కువగా ఉండటంతో నగరంలో సంచరించే నేరస్తులపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచలేక పోతున్నారు. దీన్ని గమనించిన ఎస్పీ సిద్దార్థ కౌశల్ నగరం మొత్తం నిఘా నిడాలో ఉండేలా చేసేందుకు ప్రణాళిక రూపొందించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా నగరంలో ఎన్ని ప్రాంతాలు సీసీ కెమెరా పరిధిలో లేవో గుర్తించేందుకు సమగ్ర సర్వే చేయిస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే నగరం మొత్తం నిఘా నీడలోకి వచ్చేస్తుందని భావిస్తున్నారు. దీనిపై డీజీపీ, జిల్లా కలెక్టర్లతో మాట్లాడి నగరం మొత్తం పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఎస్పీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో సత్ఫలితాలు: పోలీస్ శాఖ పరిధిలో ఉన్న అన్ని కంట్రోల్ రూమ్‌లను ఒక్కచోటకు చేర్చి జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ తన కార్యాలయంలో ఎస్బీ సీఐ పర్యవేక్షణలో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. డయల్ 100కు వచ్చే ఫిర్యాదులు, టీవీ చానళ్లలో వచ్చే స్క్రోలింగ్‌లు పర్యవేక్షించే విభాగం, పోలీస్ వాట్సప్, ఫేస్‌బుక్‌ల ద్వారా వచ్చే ఫిర్యాదులు పర్యవేక్షించే విభాగం, పోలీస్ రేడియో కంట్రోల్, మీడియా, ఇతర వాట్స్ యాప్ గ్రూప్‌ల్లో వచ్చే సమాచారం ఆధారంగా స్పందించే బృందాలు, రక్షక్, బ్లూకోట్స్ ఇలా అన్ని విభాగాలనూ అనుసంధానం చేస్తూ ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటలూ పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు నిర్ణయం సత్ఫలితాలు ఇస్తుండటంతో రెట్టించిన ఉత్సాహంతో ముం దుకు వెళ్తున్నారు. నగరంలో బుధవారం ఆటోలో ప్రయాణించిన ఓ ఉపాధ్యాయురాలు సెల్‌ఫోన్ పోగొట్టుకున్నట్లు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందడంతో వేగంగా స్పందించిన బృందాలు సీసీ కెమెరా ఫుటేజ్‌ల ఆధారంగా సెల్‌ఫోన్‌ను కనిపెట్టి ఆమెకు అందించారు. సీసీఎస్‌లో సిబ్బంది కట్: సీసీఎస్‌లో ప్రస్తుతం ఉన్న 60 మంది సిబ్బందిని సగానికి తగ్గించి మిగతా వారిని ఆయా పోలీస్స్టేషన్లకు కేటాయించాలని ఎస్పీ సిద్దార్థ కౌశల్ నిర్ణయిం చారు. ఈ మేరకు గురువారం సాయంత్రం సీసీఎస్ సిబ్బందికి కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. సుమారు 35 మంది సిబ్బందిని మాత్రమే సీసీఎస్‌లో ఉంచాలని ఎస్పీ భావిస్తున్నారు. వీరిని మూడు క్రైమ్ బృందాలుగా ఏర్పాటు చేసి విధులు కేటాయించడం ద్వారా జవాబుదారీతనం పెరుగుతుందనేది ఎస్పీ ఆలోచనగా ఉంది. దీనికితోడు స్పెషల్ బ్రాంచ్పైనా ఎస్పీ ఓ కన్నేశారు. అవినీతికి తావు లేకుండా ఎస్బీని ప్రక్షాళన చేయాలని యోచిస్తున్నారు. -
మాయ లే‘డీలు’
ఆభరణం కొన్న అరగంటకే తస్కరణ ఆటోలో ప్రయాణిస్తూనే బ్యాగులో పర్సు కాజేసిన వైనం రూ.96వేల విలువైన 4.5 సవర్ల బంగారు ఆభరణం మాయం బంగారు ఆభరణాలు అమ్మే షాపులే లక్ష్యంగా ఒంగోలు : ఒంగోలు నగరంలో ముగ్గురు మహిళలు ‘మాయ లేడీ’లుగా మారారు. సహచర ప్రయాణికుల మాదిరిగా ఉంటూ మహిళల బ్యాగుల్లో పర్సులు మాయం చేయటమే పనిగా పెట్టుకున్నారు. సోమవారం ఒంగోలు నగరంలో అదే జరిగింది . ఓ మహిళ బంగారు నగలు అమ్మే కార్పొరేట్ మాల్లో ఖరీదైన బంగారు హారం కొనుగోలు చేసి ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడే కాజేశారు. కొన్న అరగంటకే తస్కరించారంటే ఆరితేరినవారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మార్కాపురంలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న డి.సునీత పుట్టిల్ల అయిన సూరారెడ్డిపాలెం వచ్చింది. పండుగ శెలవులు కావటంతోపాటు పండుగను ఆనందంగా జరుపుకునేందుకు బంగారు నగలు కొనుగోలు చేయాలని సునీత కుటుంబం భావించింది. అందులో భాగంగా తన తండ్రి బాల కోటయ్యతో కలిసి సూరారెడ్డిపాలెం నుంచి ఒంగోలుకు వచ్చింది. బస్టాండ్ సమీపంలోని ఖజానా జ్యూయలరీలో మధ్యాహ్నం రూ.96 వేల విలువైన 4.5 సవర్ల బంగారు ఆభరణాన్ని కొనుగోలు చేసింది. ఆ బంగారు ఆభరణం ఉన్న బాక్సును ఒక పర్సులో ఉంచి దాన్ని తన హ్యాండ్ బ్యాగులో వేసుకుంది. జ్యూయలరీ షాపు నుంచి తన తండ్రితో కలిసి నడుచుకుంటూ ఆర్టీసి బస్టాండ్ సెంటర్ వరకు వచ్చారు. అక్కడ సూరారెడ్డిపాలెం వెళ్ళేందుకు ఆటో ఎక్కారు. షాపు దగ్గర నుంచి తండ్రి, కూతుర్ల వెంటే ముగ్గురు మహిళలు అనుసరించి బైపాస్ వరకు వస్తామంటూ వీరితోపాటు అదే ఆటో ఎక్కారు. వెనుక సీట్లో సునీతతోపాటు తండ్రి బాలకోటయ్యలు కూర్చున్నారు. ముగ్గురు మహిళల్లో ఒకరు నడుముకు ఆపరేషన్ చేయించుకుందని, బాలకోటయ్యను ఆటో డ్రైవర్ సీటులోకి వెళ్ళాలని విజ్ఞప్తి చేసింది. సరేనంటూ బాలకోటయ్య డ్రైవర్ పక్క సీటులోకి వెళ్ళాడు. ఒకరికొకరు సరదాగా మాట్లాడుతూ ఒకరిపై ఒకరు తోసుకుంటూ నవ్వులాటలకు దిగారు. ముందుగానే ఆటో కిరాయి ఇచ్చేశారు. ఆటో నెల్లూరు బస్టాండ్ సెంటర్ దాటి యాక్సిస్ బ్యాంక్ ఎదురుకు వచ్చే సరికి అర్జంటుగా పని ఉందంటూ ముగ్గురు మహిళలు దిగేశారు. ఆటో కొంచెం ముందుకు వెళ్ళేసరికి సునీత తన బ్యాగును చూసుకుంది. ఆ బ్యాగు జిప్ తీసి ఉండడంతో బ్యాగులోని పర్సు చూసుకోగా అందులోని పర్సు మాయమైందని గుర్తించి ఆటోను వెనక్కు తిప్ప పరిసర ప్రాంతాల్లో వెతికినా వారి ఆచూకీ కనిపించలేదు. వెంటనే ఆ సమాచారం ఒంగోలు టూటౌన్ బ్లూకోట్స్ సిబ్బందికి అందించారు. బ్లూ కోట్స్ సిబ్బంది రామకృష్ణ(ఆర్కె), వెంకటేశ్వర్లు అక్కడకు చేరుకొని వివరాలు సేకరించి సమాచారాన్ని పోలీస్ ఉన్నతాధికారులకు చేరవేశారు. ఆ మాయలేడీల కోసం నగరంలో వెతుకులాట ప్రారంభించినా ఫలితం కనిపించలేదు. ఒంగోలు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
బొప్పాయి పండ్ల కింద ఎర్రచందనం దుంగలు
ఒంగోలు: బొప్పాయి పండ్ల కింద అక్రమంగా భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న లారీని ప్రకాశం జిల్లా పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లారీని సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా కొమరవోలు మండలం తాటాచర్లమోటు రహదారిపై ఈ రోజు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా బొప్పాయి లోడ్‌తో వెళ్తున్న లారీని పోలీసులు ఆపారు. లారీలో లోడ్‌పై డ్రైవర్‌ను ప్రశ్నించగా... పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో పోలీసులు అనుమానించి... లారీలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా బొప్పాయి పండ్లు కింద ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
ప్రియురాలి మృతదేహంతో పోలీసులకు చిక్కిన ప్రియుడు
ఒంగోలు: ప్రియురాలని హతమార్చి ఆమె మృతదేహాన్ని రహస్యంగా తరలిస్తూ పోలీసులకు చిక్కాడో ప్రియుడు. దాంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం అతడిని పోలీసులు తమదైనశైలిలో విచారిస్తున్నారు. ఆ ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సింగరాయకొండలో పోలీసులు గత అర్థరాత్రి వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా మృతదేహంతో వెళ్తున్న ఓ వాహనాన్ని పోలీసులు అపి డ్రైవర్ స్థానంలో ఉన్న ప్రియుడ్ని ప్రశ్నించారు. దాంతో అతడు పోంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు అతడితోపాటు ఆ వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసు అతడ్ని విచారిస్తున్నారు. -
జవ్వాది అరెస్ట్ దుర్మార్గం : వైవీ సుబ్బారెడ్డి
-
జవ్వాది అరెస్ట్ దుర్మార్గం : వైవీ సుబ్బారెడ్డి
ప్రకాశం జిల్లా మార్కాపురం జడ్పీటీసీ సభ్యుడు జవ్వాది రంగారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. రంగారెడ్డిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఒంగోలులో మాట్లాడుతూ... జడ్పీ ఎన్నికల్లో జిల్లా పోలీసుల ఓవరాక్షన్‌పై వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ ఛైర్మన్ ఎన్నికల్లో రంగారెడ్డిని ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ప్రకాశం జడ్పీ ఎన్నికను వాయిదా వేయాలని ప్రభుత్వానికి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. -
పోలీసుల ఓవరాక్షన్: వైఎస్ఆర్ జడ్పీటీసీ అరెస్ట్
ప్రకాశం జిల్లాలో పోలీసులు ఆదివారం ఓవరాక్షన్ చేశారు. మార్కాపురం వైఎస్ఆర్ పార్టీకి చెందిన జడ్పీటీసీ జవ్వాది రంగారెడ్డిని డీఎస్పీ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఒంగోలుకు బస్సులో వెళ్తున్న ప్రకాశం జిల్లా జడ్పీటీసీ సభ్యులు ప్రయాణిస్తున్న బస్సును సంతమాగులూరు వద్ద అడ్డుకుని జవ్వాదిని అరెస్ట్ చేశారు. జవ్వాది అరెస్ట్‌ను తోటి జడ్పీటీసీలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే డీఎస్పీ అధ్వర్యంలో పోలీసులు జడ్పీటీసీలను బెదిరించారు. దాంతో వారు మిన్నకుండిపోయారు. జవ్వాదిపై గతంలో ఎస్టీ మహిళను దూషించారని... ఈ నేపథ్యంలో ఆయనపై అట్రాసిటీ కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. అందువల్లే జవ్వాదిని అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. -
పోలీసుల ఓవరాక్షన్: వైసీపీ జడ్పీటీసీ అరెస్ట్
-
పోలీసుల అదుపులో నకిలీ నోట్ల నిందితుడు
ఒంగోలులో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఓ వ్యక్తిని మంగళవారం పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ. 75 వేల విలువ గల నకిలీ నోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు టూటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కథనం ప్రకారం... ఓ వ్యక్తి నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నాడంటూ ఈ రోజు ఉదయం స్థానిక టూటౌన్ సీఐకు స్థానిక దుకాణదారుడు ఫిర్యాదు చేశాడు. దాంతో సీఐ హుటాహుటిన ఫిర్యాదుదారుడి వద్దకు వెళ్లి నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసు స్టేషన్‌కు తరలించిన పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. -
రైల్వే స్టేషన్లో రూ. 43 లక్షలు స్వాధీనం
ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వే స్టేషన్లో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా నరేష్ అనే వ్యక్తి నుంచి రూ. 43 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ నగదును స్వాధీనం చేసుకుని... వ్యక్తిని పట్టణంలోని టూటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. పట్టుబడి నగదుపై పోలీసులు ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు. అయితే అతడు ఆ నగదుపై సమాధానం చెప్పేందుకు నిరాకరించడంతో పోలీసులు తమ దైన శైలిలో పోలీసులు నరేష్‌ను ప్రశ్నిస్తున్నారు. -
చైన్ స్నాచర్లు అరెస్ట్: 28 తులాల బంగారం స్వాధీనం
ప్రకాశం జిల్లా సంతమాగలూరులో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అనుమానస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దాంతో వారి వద్ద నుంచి 28 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించి.... పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. దాంతో గతంలో వారు చోరి చేసిన వివరాలు పూసగుచ్చినట్లు వెల్లడించారు. పట్టబడిన చైన్ స్నాచర్లపై గుంటూరు, ప్రకాశం జిల్లాలలో 11 కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. -
టీడీపీ అభ్యర్థి కారు నుంచి రూ.25 లక్షలు స్వాధీనం
ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అందులోభాగంగా శనివారం ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.25 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా... దర్శి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావుకు చెందినదని వారు వెల్లడించారు. నగదుతో పాటు కారును సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అలాగే అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓటర్లుకు నగదు పంచుతున్న ఇద్దరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 20 వేల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
పర్చూరులో నలుగురు అంతరాష్ట్ర ముఠా సభ్యులు అరెస్ట్
ప్రకాశం జిల్లా పర్చూరులో అంత రాష్ట్ర ముఠాకు చెందిన నలుగురు దొంగలను శుక్రవారం ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 25 సవర్ల బంగారం, కిలోన్నర వెండిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దొంగలను పర్చూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.7 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. పోలీసుల తమదైన శైలీలో వారిని దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నారు.