
పొదిలి సీఐ శ్రీరామ్‌తో మాట్లాడుతున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్
సాక్షి, ఒంగోలు: ప్రకాశం పోలీసులు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఏజెన్సీలతో సహా అన్ని పోలీసుస్టేషన్లు వీడియో కాన్ఫరెన్స్‌కు అనుసంధానం చేశారు. అది కూడా కేవలం రూ.2,100 ఖర్చుతో. ఒక్కో స్టేషన్‌ను వీడియో కాన్ఫరెన్స్‌కు అందుబాటులోకి తెచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌ను సిస్టంకు మాత్రమే కాకుండా ఆండ్రాయిడ్ మొబైల్, ల్యాప్‌టాప్‌కు సైతం అందుబాటులోకి తెచ్చారు. శనివారం ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ ట్రయల్ రన్ విజయం సాధించడంతో పలు జిల్లాల ఎస్పీలు సైతం అందుబాటులోకి వచ్చి ఈ ప్రక్రియను తమ జిల్లాలో సైతం అమలు చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ సహకారాన్ని కోరారు.
ఇవీ.. ఉపయోగాలు
► పోలీసు శాఖ ఇప్పటి వరకు సెట్ కాన్ఫరెన్స్ పైనే ఎక్కువుగా ఆధారపడుతుండేది. డైలీ స్టేషన్ రిపోర్టుకు సంబంధించిన అంశాలతో నేరుగా ప్రతి రోజు ఉదయం మాట్లాడడం రివాజు. ఈ క్రమంలో అధికారులు సెట్‌లో చెప్పేదానికి, అదే విధంగా ఫోన్‌లో మాట్లాడుతున్నా నేరుగా వారితో మాట్లాడేటప్పుడు ఉండే ఫీలింగ్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. అధికారి నేరుగా కనిపించినప్పుడు వారికి అవసరమైతే స్పష్టమైన సూచనలు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ అందుబాటులోకి రావడం ద్వారా అధికారులంతా ఒకేసారి అందుబాటులోకి రావడం ద్వారా ఉన్నతాధికారులు జారీ చేసే ఆదేశాలను సైతం క్షణాల్లో అవతలి అధికారులకు వేగవంతంగా పంపే అవకాశం లభించినట్లయింది
► ఒక వేళ అధికారి అందుబాటులో లేకపోతే ఆ అధికారి తన వద్ద ఉన్న ల్యాప్ ట్యాప్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇంకా ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నా దీంతో కూడా ఎస్పీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే సౌలభ్యం ఉంది.
► ఎక్కడైనా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నా లేక ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులు వస్తే వారి కార్యక్రమాన్ని ఎస్పీ తన కార్యాలయంలోనే ఉండి నేరుగా అక్కడ ఏం జరుగుతుందనేది ఎస్పీ వీక్షించేందుకు అవకాశం ఏర్పడింది. అంతే కాకుండా అప్పటికప్పుడు అవసరమైన సూచనలు, సలహాలను కూడా ఎస్పీ జారీ చేసేందుకు సౌలభ్యం ఉంది.
► వాస్తవానికి ఇప్పటి వరకు దోర్నాల, పెద్దారవీడు, కంభం, పుల్లలచెరువు, సీఎస్‌పురం పోలీసుస్టేషన్ల పరిధిలోని ఎస్‌ఐలతో ఎస్పీ నేరుగా మాట్లాడటమంటే వారు నేరుగా ఎస్పీ కార్యాలయానికి వచ్చినప్పుడో లేక ఎస్పీ సంబంధిత స్టేషన్లకు వెళ్లినప్పుడో జరిగేది. దీని ద్వారా ఇరువరి మధ్య ముఖాముఖి కనీసం 6 నెలలుకుపైగా పడుతుందని పోలీసుశాఖలోనే అంచనా. అటువంటిది అవసరమనుకుంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్షంగా నేరుగా సంబంధిత అధికారితో ఎస్పీ మాట్లాడే అవకాశం ఏర్పడింది.
► ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్పందన కార్యక్రమాన్ని ప్రతి సోమవారం ప్రజలకు, ప్రతి శుక్రవారం సిబ్బందికి ఎస్పీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లేదా డీజీపీ లేదా ఐజీలు నేరుగా ఏ అధికారితో అయినా కనెక్ట్ అయ్యే అవకాశం ఏర్పడింది. నేరుగా సంబంధిత అధికారితో మాట్లాడటం ద్వారా సమస్యను అత్యంత వేగవంతంగా పరిష్కరించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతే కాకుండా ఈ ప్రక్రియ ద్వారా సిబ్బందిలో బాధ్యత కూడా పెరుగుతుందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
► ఉదాహరణకు కలెక్టరేట్ వద్దే వందలాది మంది ప్రజానీకం వచ్చి ధర్నాలు చేస్తుంటే అవసరమైన పక్షంలో అదనపు బలగాలను పంపించే అవకాశం ఏర్పడుతుంది. ఏఆర్ సిబ్బందిని కూడా ముందుగానే పెద్ద ఎత్తున పంపేకంటే అక్కడ ఉన్న పరిస్థితిని అంచనా వేసుకుంటూ ఎంతమందిని పంపాలనే దానిపై నిర్ణయం తీసుకునే వీలుంటుంది.
వీడియో కాన్ఫరెన్స్‌కు వివిధ ప్రాంతాల్లో హాజరైన అధికారులు
ఐజీ ప్రశంసలు
శనివారం ఎస్పీ కార్యాలయంలోని గెలాక్సీ సమావేశ మందిరం నుంచి ఎస్పీ సిద్ధార్థ కౌశల్ చేపట్టిన ప్రయోగాత్మక ప్రాజెక్టుకు ట్రయల్ రన్ వేశారు. ఈ ట్రయల్ రన్‌లో ల్యాప్‌టాప్‌తో గుంటూరు రేంజీ ఐజీ వినీత్‌బ్రిజ్‌లాల్ లైన్‌లోకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన దోర్నాల స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఎస్పీతో నేరుగా మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో ప్రకాశం పోలీస్ ఐటీ విభాగం ఎప్పుడు ముందుంటుందని, అదే మాదిరిగా ఎస్పీ కూడా సాంకేతికతను జోడించారంటూ అభినందించారు. ఈ సందర్భంగా ప్రాథమికంగా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలను సైతం ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. సంబంధిత పోలీసుస్టేషన్లలో శాంతిభద్రతల పరిస్థితి, స్పందనకు వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం, ఇతర ముఖ్యమైన అంశాల గురించి ఆయన నేరుగా మాట్లాడారు. అదే విధంగా గుట్కా, బెల్ట్‌షాపులకు సంబంధించిన వాటిని ఉపేక్షించవద్దని ఆదేశించారు. దేశంలోనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని పోలీసుస్టేషన్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తొలి గ్రామీణ జిల్లాగా ప్రకాశం గుర్తింపు పొందిందని ఐజీ ప్రశంసించారు.
ఎలా జరిగిందంటే..
డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలనుకుంటే పోలీసులు తమ పరిధిలోని కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ కార్యాలయంలో అనుమతి తీసుకొని హాజరు కావాల్సి ఉండేది. చివరకు ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినా ఎస్పీ కలెక్టరేట్‌కు రావాల్సి వచ్చేది. ఎస్పీనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలనుకుంటే ఏం చేయాలి? కలెక్టరేట్‌లో కాన్ఫరెన్స్ హాలు ఉన్నట్లుగానే జిల్లాలోని అన్ని మండలాల్లో పోలీసులు వీడియో కాన్ఫరెన్స్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందా.. అంటే లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని తన ఆధ్వర్యంలో ఐటీ కోర్ టీంతో షేర్ చేసుకున్నారు. అన్ని పోలీసుస్టేషన్లకు వీడియో కాన్ఫరెన్స్ అంటే భారీ ఖర్చు అవుతుందని తొలుత భావించారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా పరిశీలించారు. ఒక్కో మండల స్థాయిలో తహసీల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ఖర్చు దాదాపు రూ.2 లక్షలైందని నిర్థారించుకున్నారు. అంతే కాకుండా విశాఖపట్నం సిటీలో 28 పోలీసుస్టేషన్లు ఉంటే వాటి అన్నింటికీ కలిపి వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యార్థం రూ.58 లక్షలు వినియోగించినట్లు తెలుసుకున్నారు. మరి.. జిల్లాలో అందునా ఏజెన్సీ ప్రాంతాల్లో వీడియో కాన్ఫరెన్స్ అంటే పెద్ద మొత్తం తప్పదు.. మరి ఈ వ్యయం ఎలా అధిగమించాలన్నదే పెద్ద సమస్యగా మారింది.
నిన్నటి వరకు నిరుపయోగం
పోలీసుస్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసేందుకు కంప్యూటర్లు ఉన్నాయి. అవన్నీ బాగా పాతవి కావడంతో సక్రమంగా పనిచేయని స్థితిలో ఉన్నాయి. వీటిని ఒక రకంగా స్టోర్ రూమ్‌కు పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ వ్యర్థం అనుకున్న దాని నుంచే ఫలితం రాబట్టాలని భావించారు. పోలీసుస్టేషన్లతో పాటు జిల్లా పోలీసు కార్యాలయంలోనూ నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్లు అన్నింటినీ ఒక చోటకు తెప్పించారు. వాటిన్నింటికీ ఉన్న చిన్న చిన్న మరమ్మతులును ఐటీ సిబ్బందితో పూర్తి చేయించారు. అవి రోజు వారీ కార్యక్రమాలకు ఉపయోగించలేమని భావించినా వాటన్నింటిని వీడియో కాన్ఫరెన్స్‌కు అనుసంధానం చేసుకునే సౌలభ్యం ఉందని తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌కు అవసరమైన డ్రైవర్స్‌ను సిస్టంలో ఏర్పాటు చేయించారు. ఇలా కేవలం జిల్లాలోని 64 పోలీసుస్టేషన్లతో పాటు 15 సర్కిల్ స్టేషన్లు, 5 సబ్‌డివిజినల్ పోలీసు అధికారుల కార్యాలయాలు, ఒక లుమన్ పోలీసుస్టేషన్, సీసీఎస్ పోలీసుస్టేషన్లలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోలీసు శాఖ వినియోగిస్తున్న ఇంటర్‌నెట్ సౌకర్యంతోనే వాటికి కనెక్షన్ ఇచ్చి నేరుగా సంబంధిత పోలీసు అధికారితో మాట్లాడేందుకు చర్యలు చేపట్టగలిగారు. సాధారణంగా ఒక్కో చోట వీడియో కాన్ఫరెన్స్‌కు రూ.2 లక్షలు కనీస వ్యయం అవుతుంటే పోలీసు శాఖ మాత్రం దాదాపు 84 పోలీసుస్టేషన్లు/అధికారుల కార్యాలయాల్లో ఒక్కో దానికి కేవలం రూ.2100 అంటే మొత్తానికి కలిపి రూ.1,76,400లతో సరిపెట్టడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment