సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పంచాయతీ సమరంలో మహిళ లే పైచేయి సాధించారు. పంచాయతీ రాజ్ ప్రాతినిథ్య చట్ట సవరణతో తొలి సారిగా 50 శాతం స్థానాల్లో పోటీచేసే అవకాశం మహిళలకు దక్కింది. దీంతో సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా పంచాయతీల్లో ఓటర్లు పెద్ద పీట వేశారు. జిల్లాలో 1,066 పంచాయతీలకు గాను 533 సర్పంచ్ పదవులను మహిళలకు రిజర్వు చేశారు. రెండు చోట్ల ఎన్నిక వాయిదా పడటంతో 1,064 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. రిజర్వేషన్ కోటా కంటే అదనంగా మరో 35 పంచాయతీల్లో మహిళలు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. సాధారణంగా రిజర్వుడు స్థానాల్లో చక్రం తిప్పేందుకు చోటా మోటా నేతలు ఉప సర్పంచ్ పదవిపై కన్నేస్తూ వుంటారు. అయితే సుమారు 27 శాతం పంచాయతీ ల్లో మహిళలే ఉప సర్పంచ్ పదవులు చేపట్టారు. 10,444 వార్డుల్లోనూ సగానికి పైగా స్థానాల్లో మహిళలకు ప్రాతినిథ్యం దక్కింది. సుమారు 50 పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవుల్లో మహిళలే ప్రాతినిథ్యం వహిస్తుండటంతో పాలన ఆసక్తికరంగా మారింది.
ఇక్కడ అందరూ మహిళలే..
నారాయణఖేడ్ మండలం పైడిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వు చేశారు. ఎనిమిది వార్డులకు గాను నాలుగుచోట్ల మహిళలకు కేటాయించారు. అయితే ఓ స్వచ్ఛంద సంస్థ చొరవతో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవితో పాటు అన్ని వార్డుల్లోనూ మహిళలనే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్‌గా క్యాస సంధ్యారాణి, ఉప సర్పంచ్‌గా మాదారం పద్మమ్మ, వార్డు సభ్యులు పల్లె సునీత, ఎండీ ఇస్మాయిల్ బీ, గొట్టపు లక్ష్మి, బేలూరు నర్సమ్మ, పొట్‌పల్లి బసమ్మ, మూలిగె బసమ్మ, అశ్విని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు ఇద్దరు పురుషులు ముందుకు వచ్చినా గ్రామస్థులు నచ్చజెప్పారు. గ్రామంలో తాగునీరు, పారిశుద్ధ్యం లక్ష్యంగా పనిచేస్తామంటూ పంచాయతీ పాలకమండలి ముక్తకంఠంతో చెప్తోంది.
పురుషుల చేతుల్లోనే?
సంఖ్యాపరంగా పంచాయతీల్లో మహిళల ప్రాతినిథ్యం సగానికిపైగా ఉన్నప్పటికీ పాలనలో పురుషుల జోక్యం తప్పేలా లేదు. చాలాచోట్ల భర్తలు, కుమారులు, సోదరులు చక్రం తిప్పుతుండటంతో కొత్తగా ఎన్నికైన మహిళా సర్పంచ్‌ల పాలనపై ఆసక్తి నెలకొంది. పంచాయతీ పాలన, నిధులు, విధులు తదితరాలపై అవగాహన లేకపోవడం కొత్త సమస్యలకు దారితీసేలా ఉంది.
శిక్షణ శిబిరాలు నిర్వహిస్తాం
కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు పాలనపై అవగాహన కలిగించేందుకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తాం. పాలన, విధులు, చట్టాలు తదితరాలపై రూపొందించిన ప్రత్యేక మెటీరియల్‌ను అందజేస్తాం. మహిళలు సర్పంచ్‌గా వున్న చోట స్వయం నిర్ణయాధికారం అలవడేలా శాయశక్తులా ప్రయత్నిస్తాం.
- డీపీఓ అరుణ
పల్లె పీఠంపై నారీమణులు
Published Wed, Aug 7 2013 12:11 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
Advertisement