కూలీలకు ‘ఉపాధి' కల్పించండి
కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ ఆదేశం
అనంతపురం సెంట్రల్ : మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలందరికీ పనులు కల్పించాలని కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఉపాధిహామీ పథకం అమలుపై ఏపీడీలు, ఎంపీడీఓలు, ఏపీఓలతో టీటీడీసీలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పనుల కల్పన నత్తనడకన సాగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది గణనీయంగా కూలీల హాజరుశాతం తగ్గిపోయిందని అన్నారు.
ఇందుకు గల కారణాలపై ఆయన ఆరా తీశారు. వెంటనే ప్రతి మండలంలోనూ కూలీల శాతం మెరుగుపడాలన్నారు. పనుల వివరాలను రికార్డుల్లో పకడ్బందీగా నమోదు చేయాలని సూచించారు. మెట్టభూముల్లో పండ్లతోటల పెంపకం చేపడుతున్న రైతుల భూముల్లో తప్పనిసరిగా ఫారం పాండ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకూ 5 వేల మంది రైతుల నుంచి ప్రతిపాదనలు అందాయన్నారు.
మిగిలిన రైతుల నుంచి ప్రతిపాదనలను పంపాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద గతంలో చేపట్టిన మరమ్మతు పనులకు సంబంధించి గ్రామపంచాయతీ, మండ ల పరిషత్‌ల నుంచి తీర్మానాలను పంపాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో సంపూర్ణ అక్షరాస్యత కోసం ఎంపీడీఓలు కృషి చేయాలన్నారు.
18 సంవత్సరాల నుంచి 40 సంవ త్సరాలలోపు ఉన్న నిరక్షరాస్యులను గుర్తించాలని ఆదేశించారు. వారికి విద్యనందించేందుకు వయోజనవిద్య శాఖ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సమావేశంలో డ్వామా పీడీ నాగభూషణం, ఏపీడీలు, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు.