పెరవలి/నిడదవోలు రూరల్ : ప్రజాప్రతినిధులు, అధికారులు ఒక్కటై జరుపుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను ర్యాంప్ కార్మికులు, స్థానికులు అడ్డుకున్న ఘటన గురువారం రాత్రి పెండ్యాల-కానూరు ర్యాంప్‌లో చోటుచేసుకుంది. దీంతో అధికారులు చేసేది లేక వాహనాలను స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెండ్యాల ర్యాంపులో కొంతకాలంగా ఇసుక అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. గురువారం రాత్రి అక్రమంగా ఇసుకను తవ్వడానికి రెండు ప్రొక్లెయినర్‌లు, ట్రాలీలు తీసుకువచ్చి లారీలతో ర్యాంపులోకి దిగి ఇసుకను లోడు చేశారు. ఇదిలా ఉండగా 20 రోజుల క్రితం ఇక్కడ ఇసుకను మూటలుగా కట్టి అమ్ముకుంటున్న ర్యాంప్ కార్మికులు, కూలీలను సమిశ్రగూడెం ఎస్సై అడ్డుకుని తీవ్రంగా హెచ్చరించారు. దీనిపై కార్మికులు గుర్రుగా ఉన్నారు.
ర్యాంప్‌ను మూసివేయడంతో ఉపాధి కోల్పోయామని, ఇసుక మాఫియా ప్రజాప్రతినిధుల అండతో అక్రమంగా తరలిస్తున్నా చర్యలు తీసుకోవడం మాని తమపై చర్యలేమిటని కొందరు అప్పుడు ప్రశ్నించారు. ఈ ఘటన నేపథ్యంలో కార్మికులు అవకాశం కోసం ఎదురు చూస్తుండగా గురువారం రాత్రి ర్యాంప్‌లో తవ్వకాలు జరుపుతున్నారని తెలియడంతో 100 మంది కార్మికులు అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చినా ఎవరూ స్పందించకపోవడంతో నిడదవోలుకు చెందిన సీపీఎం నేత జువ్వల రాంబాబుకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన వచ్చారు.
ఇసుక తవ్వకందారులు తాము ఎమ్మెల్యే అనుచరులమని, తమను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని కార్మికులు, రాంబాబును హెచ్చరించారు. రాంబాబు పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి ఘటనా స్థలానికి రాకపోతే పరిస్థితులు చేయిదాటతాయని చెప్పడంతో ఎట్టకేలకు సమిశ్రగూడెం ఎస్సై ఎస్‌ఎస్‌ఎస్‌పి కుమార్, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలానికి వచ్చారు. రెండు లారీలను, రెండు పొక్లైన్లు, ఒక ట్రాలీ, ఒక ట్రాక్టరును స్వాధీనపర్చుకున్నారు.
అధికారులపై ప్రజాప్రతినిధి ఆగ్రహం
వాహనాలను పోలీసులు పట్టుకోవడంతో స్థానిక ప్రజాప్రతినిధి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ఆయన అధికారులకు, పోలీసులకు అనేకమార్లు ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికీ వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో బదిలీలు తప్పవంటూ హెచ్చరించారు.
ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న కార్మికులు
Published Sat, Oct 18 2014 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM
Advertisement
Advertisement