
పోడు వ్యవసాయం కోసం అడవిని కాల్చేస్తున్న గిరిజనులు
మెరుపులు మెరుస్తున్నాయి. ఉరుములు ఉరుముతున్నాయి. పిడుగులు పడుతున్నాయి. పశువులు,మనుష్యుల ప్రాణాలు పోతున్నాయి. పెరిగిపోతున్న భూతాపంతో వాతావరణంలో కలుగుతున్న మార్పులకు పిడుగులు పడుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. మాన వ మనుగడకు అవసరమైన ఆక్సిజన్ పచ్చని చెట్టు నుంచి వస్తుంది. అలాంటిది ఆ చెట్టే లేకుంటే మనుగడ ఎలా అన్నది ప్రశ్నార్థక మైంది. ఇక మనిషి పిలిస్తే రానిది చెట్లు పిలిస్తే వచ్చేది వర్షం ఒక్కటే. ఆ వర్షం లేకుంటే పంట లు పండవు, తాగునీరు ఉండదు. జీవ వైవిధ్యం అంతరించిపోతుంది.
కొయ్యూరు (పాడేరు) : రోజు రోజుకు మన్యంలో అడవి అంతరించిపోతోంది. పోడుపేరిట విచ్చలవిడిగా పచ్చని చెట్లను నరకి వేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆక్సిజన్ శాతం తగ్గి కార్బన్ డైయాక్సైడ్ పెరిగిపోతోంది. ఇది మానవ జీవి తంపై తీరని ప్రభావం చూపుతోంది.వాతావరణంలో సమతౌల్యం ఉండాలంటే మొత్తం భూ బాగంలో 33 శాతం అడవులు ఉండాలి. అయితే అడవుల శాతం రోజురోజుకు తగ్గిపోతోంది. ప్రస్తుతం 19 శాతానికి మించి అడవులు లేపు. దీనిని 33 శాతానికి పెంచాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అడవులు అంతరించి పోవడంతో పాటు పెద్ద ఫ్యాక్టరీల నుంచి వస్తున్న వ్యర్థాల పొగ భూ తాపానికి కారణంగా మారుతోంది. భూతాపంతో వ్యవసాయంలో 20 శాతం దిగుబడులను కోల్పోవలసి వస్తుంది. రానున్న కాలం లో దిగుబడులు మరింత పడిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయరంగ నిపుణుల అంచనా.
తగ్గుతున్న ముందస్తు వర్షాలు
విశాఖ మన్యంలో గతంలో నైరుతి రుతుపవనాల రాకకు ముందుగా వర్షాలు కురిసేవి. వాటిని రుతుపవనాలకు ముందస్తు వర్షాలుగా పిలిచేవా రు. ఇవి గడచిన కొన్ని సంవత్సరాల నుంచి గమనిస్తే తగ్గిపోతున్నాయి. ఈ వర్షాల తగ్గుదలకుఅడవులు లేకపోవడమే కారణంగా చెబుతున్నారు. ఇక 25–40 డిగ్రీ ల ఏటవాలుగా ఉన్న మన్యంలో ఏడాదికి 1,100 మిల్లీ్లమీటర్ల వర్షపాతం కురుస్తుంది. చెట్లు లేని కారణంగా మన్యంలో కురుస్తున్న వర్షాలకు కొండలపై నుంచి వస్తున్న వరదనీరు భూమిలో లవణాలు కొట్టుకుపోయేం దుకు కారణమవుతోంది. వాటి నివారణకు కట్టిన రాతికట్టు, తవ్విన కందకాలు ఆశించిన విధంగా ఉపయోగపడడం లేదు.
పోడును ఆపితేనే మనుగడ
కొన్నేళ్ల కిందట పక్కనున్న ఒడిశా నుంచి మన్యం వలస వచ్చిన ఆదివాసీలు భూమికోసం అడవిని నరికేస్తున్నారు. మన్యంలో అటవీ శాఖ ఏటా పెంచుతున్న అడవుల కంటే పోడు పేరిట కోల్పోతున్న అడవి ఎక్కువగా ఉంది. అటవీ అధికారులు దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంది. 2005లో అమలులోకి వచ్చిన అటవీ హక్కుల చట్టం తరువాత మన్యంలో పోడు సాగు పెరిగిపోయింది. వాటికి పట్టాలు ఇస్తారన్న నమ్మకంతో అడవిని నరికేస్తున్నారు.