అంతా నీ ఇష్టమా..? | Wrath of the collector on DMHO | Sakshi
Sakshi News home page

అంతా నీ ఇష్టమా..?

Published Sun, Jun 1 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM

అంతా నీ ఇష్టమా..?

అంతా నీ ఇష్టమా..?

 కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్:  ‘నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు.. జీవోలున్నా అమలు చేయడం లేదు. ఎస్టాబ్లిష్‌మెంట్‌పై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఏదైనా అడిగితే డెరైక్టర్ ఆఫ్ హెల్త్ పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. అంతా నీ ఇష్టమా...?. ఇప్పటి వరకు ఏఏ ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయో చూసి సోమవారం నా వద్దకు తీసుకురండి’ అంటూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎంఅండ్‌హెచ్‌వో) డాక్టర్ వై. నరసింహులుపై జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంహెచ్‌వోపై పలు ఫిర్యాదులు రావడంతో జిల్లా జాయింట్ కలెక్టర్ కన్నబాబుతో కలిసి  కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి స్వయంగా శనివారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
 
 ఆ సమయంలో డీఎంహెచ్‌వోతో పాటు చాలా మంది ఉద్యోగులు కూడా లేకపోవడంతో కలెక్టర్ మండిపడ్డారు. దీంతో ఆయన డీఎంహెచ్‌వో ఎక్కడున్నారని అక్కడున్న అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ రాజాసుబ్బారావును, ఉద్యోగులను ప్రశ్నించారు. ఇంకా రాలేదని వారు చెప్పడంతో... వెంటనే పిలిపించండన్నారు. అనంతరం కలెక్టర్, జేసీ ఇద్దరూ కార్యాలయంలోని అన్ని సెక్షన్లను పరిశీలించారు. ఏఏ సెక్షన్‌లో ఎవరు పనిచేస్తున్నారు.. వారు ఏఏ విధులు నిర్వరిస్తున్నారు...ఏవైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
 
 అర్ధ గంటకు పైగా వారిద్దరూ కార్యాలయంలో పర్యటించారు. ఎంతో కాలంగా డీఎంహెచ్‌వోపై అసంతృప్తిగా ఉన్న సిబ్బంది ఈ సందర్భంగా కలెక్టర్‌తో వారి సమస్యలన్నింటినీ ఏకరువు పెట్టారు. డీఎంహెచ్‌వోపై వచ్చిన పలు ఆరోపణలను ప్రస్తావించారు. ఇక్కడ సమస్యలతో విసిగి వేసారిన తమకు న్యాయం చేయాలని కోరారు. ఈలోగా డీఎంహెచ్‌వో డాక్టర్ వై. నరసింహులు వచ్చి వారితో కలిశారు. ఆయనతో పెద్దగా మాట్లాడకుండా పై విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారంలోగా ఎస్టాబ్లిష్‌మెంట్ ఫైళ్లన్నీ తన దగ్గరకు తీసుకురావాలని ఆదేశించారు.
 
కుప్పలు తెప్పలుగా పెండింగ్ ఫైళ్లు
     
ముగ్గురు మెడికల్ ఆఫీసర్లు దీర్ఘకాలిక సెలవులో వెళ్లి, వారు తిరిగి విధుల్లో చేరాలని తిరుగుతున్నా స్పందన లేదు. వారిని విధుల్లో చేర్చుకోకుండా తిప్పుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.
     
పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్లకు సంబంధించి రెండు సంవత్సరాల ఇంక్రిమెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
     
పత్తికొండ సీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ గొడవ పడి అక్కడి కార్యాలయానికి 15 రోజులుగా తాళం వేశారు. దీంతో అక్కడి సిబ్బంది జీతాలు నిలిచిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించారన్న విమర్శలు ఉన్నాయి.
     
ఫార్మాసిస్టు శారద సస్పెన్షన్‌పై ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. ఆ ఉత్తర్వులను తెచ్చి చూపినా సస్పెన్షన్‌పై డీఎంహెచ్‌వో పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఆమె వారం రోజుల క్రితం గట్టిగా ప్రశ్నించారు. దీంతో డీఎంహెచ్‌వో పోలీసులను ఆశ్రయించి రక్షణ కోసం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు.
     
నాలుగు నెలలుగా గార్గేయపురం మెడికల్ ఆఫీసర్ జీతాన్ని డీఎంహెచ్‌వో ఆపేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
     
వెల్దుర్తి పీహెచ్‌సీవో ఓ హెల్త్ అసిస్టెంట్ మూడు నెలలు సెలవు పెట్టి తిరిగి విధుల్లో చేరాలని వచ్చినా పోస్టింగ్ ఇవ్వడం లేదన్న విమర్శలున్నాయి.
     
కారుణ్య నియామకాలు చేయకుండా తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం చెన్నయ్య అనే డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అలాగే నైట్‌వాచ్‌మెన్ హుసేన్ ఆరు నెలల క్రితం మరణించారు. పత్తికొండ ల్యాబ్‌టెక్నీషియన్ స్వాములు ఆరు నెలల క్రితం చనిపోయారు. వీరికి సంబంధించి కారుణ్య నియామకాలు, బెనిఫిట్స్ ఇప్పటి వరకు తేల్చకుండా తిప్పుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
     
పలు ఆసుపత్రులు, క్లినిక్‌లను రిజిస్ట్రేషన్ చేయకుండా తిప్పుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.
     
నంద్యాలలోని ఎంఎస్ నగర్‌లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్‌లో మెడికల్ ఆఫీసర్‌ను నియమించాలని దరఖాస్తులు వచ్చినా స్పందన లేదు.
     
కర్నూలు నగరం వీకర్‌సెక్షన్ కాలనీలోని అర్బన్‌హెల్త్ సెంటర్‌ను రెడ్‌క్రాస్ సొసైటీకి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించి రెండు నెలలైనా అమలు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement