
టీడీపీ ఎమ్మెల్యే మాధవనాయుడిపై హైకోర్టు ఆగ్రహం
- జడ్జితో అనుచిత ప్రవర్తన పట్ల మండిపాటు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం శాసనసభ్యుడు బండారు మాధవనాయుడు ఓ జడ్జితో అనుచితంగా ప్రవర్తించటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో ఏర్పాట్ల గురించి నరసాపురం అదనపు జిల్లా జడ్జి అక్కడి న్యాయవాదుల సంఘం నేతలతో చర్చిస్తున్నారు.
కొందరు వ్యాపారులు కోర్టు భవనానికి ఆనుకుని శాశ్వత ప్రతిపాదికన తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకోవటంతో ఏర్పడిన ఇబ్బందులను లాయర్లు జడ్జి దృష్టికి తెచ్చారు.వాటిని తొలగించాలని జడ్జి ఆదేశించారు... ఆ సమయంలో అక్కడికి తన అనుచరులతో వచ్చిన ఎమ్మెల్యే మాధవనాయుడు జడ్జితో వాగ్వాదానికి దిగారు. దీనిపై జిల్లా కోర్టు వివరణ కోరింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోర్టుకు క్షమాపణ కోరటంతో వివాదం అక్కడితో సద్దుమణిగింది.
అదనపు జిల్లా జడ్జి ఈ మొత్తం వ్యవహారాన్ని హైకోర్టుకు నివేదించారు. దీని ఆధారంగా రూపొందించిన కోర్టు ధిక్కరణ కేసును సీజే కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఇటువంటి కేసులో క్షమించే పరిధి కింది కోర్టుకు లేదని చెప్పింది. ఎమ్మెల్యే చర్యలను న్యాయవ్యవస్థపై దాడిగానే భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఎమ్మెల్యేను ఆదేశించింది.