‘పోలవరం’ నిర్వాసితుల ఉసురు మనకొద్దు | y.s jagan mohan reddy speech in assembly | Sakshi
Sakshi News home page

‘పోలవరం’ నిర్వాసితుల ఉసురు మనకొద్దు

Published Sun, Mar 27 2016 2:20 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

‘పోలవరం’ నిర్వాసితుల ఉసురు మనకొద్దు - Sakshi

‘పోలవరం’ నిర్వాసితుల ఉసురు మనకొద్దు

వారిని సంతృప్తిపర్చి ప్రాజెక్ట్ నిర్మించుకుందాం
ప్రాజెక్టు వ్యయంలో ఆర్‌అండ్‌ఆర్ పాలసీకి వెచ్చించేది 5 శాతం లోపే
కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి
ప్రాజెక్టుకు వ్యతిరేకమని మాపై ముద్ర వేయడం మానండి
వాస్తవాలను తెలుసుకునేందుకు కమిటీ వేయండి
అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులను బలవంతంగా వెళ్లగొట్టి ఉసురు తగిలించుకోవద్దని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. న్యాయమైన పునరావాస, పునర్నిర్మాణ (ఆర్‌అండ్‌ఆర్) ప్యాకేజీ అమలు చేయడం ద్వారా నిర్వాసితులను సంతృప్తిపర్చి ప్రాజెక్టును నిర్మించుకుందామని కోరారు. నిర్వాసితులు ఇప్పటివరకూ పరిహారం తీసుకోనందున కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ఆర్‌అండ్‌ఆర్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేయడంలో తప్పులేదన్నారు. ప్రాజెక్టు మొత్తం వ్యయంలో ఆర్‌అండ్‌ఆర్ పాలసీకి వెచ్చించే సొమ్ము 5 శాతం లోపే ఉంటుందని, అందువల్ల పరిహారం పెంచితే ఏదో జరిగిపోతుందనడంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాల సందర్భంగా పోలవరం ముంపు బాధిత గ్రామాల ప్రజలకు ఆర్‌అండ్‌ఆర్ పాలసీ అంశాన్ని వైఎస్ జగన్ ప్రధానంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా పత్రికల్లో వచ్చిన కథనాల్లోని రెండు పేరాలను మధ్య మధ్యలో చదివి వినిపించారు. సభలో ఆయన ఏం చెప్పారంటే...

 రోజూ ధర్నాలు... నిరాహార దీక్షలు చేస్తున్నారు
‘‘పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో నిజంగా సమస్యలు ఉన్నాయనేది మనందరికీ తెలిసిన వాస్తవం. ప్రభుత్వం చెబుతున్న ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అక్కడి నిర్వాసితులకు అందడం లేదన్నది కూడా అంతే వాస్తవం. దీనిని కాదనడం కంటే చట్టసభలో ఉన్న మనం ఈ విషయం గ్రహిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. కావాలంటే చట్ట సభ నుంచి కమిటీ వేయండి. వెళ్లి అక్కడ జరుగుతున్నదేమిటో గమనిద్దాం. అక్కడ పోలవరం ప్రాజెక్ట్‌కు ఎవరూ వ్యతిరేకులు కారు. నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేయించి, వాళ్ల ఉసురు తగిలించుకుంటూ మనం ప్రాజెక్టు కట్టుకోవడం ధర్మం కాదు.

వారికి చేయాల్సినవి చేసి ప్రాజెక్టు నిర్మించుకోవడం ధర్మం. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందకపోవడం వల్లే నిర్వాసితులు రోజూ ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. మా పార్టీ మాజీ ఎమ్మెల్యే బాలరాజు కూడా అక్కడికి వెళ్లి వారికి సంఘీభావం ప్రకటించారు. కాబట్టి అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించే కార్యక్రమం చేయండి. పోలవరం ప్రాజెక్టు కింద ఉభయ గోదావరి జిల్లాల్లో 380 గ్రామాలను ఖాళీ చేయాల్సి ఉండగా దాదాపు లక్షన్నర మంది నిర్వాసితులు కానున్నారు. వారికి పునరావాసం కల్పించాల్సి ఉంది. ప్రభుత్వం మాత్రం 205 ఆవాస ప్రాంతాలు మాత్రమే ముంపునకు గురవుతాయని ప్రకటించింది. దీనివల్ల మిగిలిన ప్రాంతాలకు పరిహారం అందే అవకాశం ఉండదు.

 వాస్తవాలను గమనించండి
కొత్తగా వచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పక్కా ఇళ్లు కట్టించాలి. పరిహారంతోపాటు అరెకరాల వరకూ భూమి ఇవ్వాలి. ఏడాదిపాటు జీవన భృతి, 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు పెళ్లి ఖర్చుల కోసం కొంత సొమ్ము చెల్లించాలి. పోలవరం ముంపు గ్రామాల్లో ఇవేవీ జరగడం లేదని అక్కడ కొనసాగుతున్న ధర్నాలు నిరూపిస్తున్నాయి. అందువల్ల మేం ఈ అంశాన్ని లేవనెత్తాం. పోలవరం ప్రాజెక్ట్‌కు వ్యతిరేకమని మాపై ముద్ర వేయడం మానేసి అక్కడి సమస్యను గమనించండి. నిర్వాసితులను విశ్వాసంలోకి తీసుకొని వారికి ఇవ్వాల్సిన ప్యాకేజీలు యుద్ధప్రాతిపదికన అందేవిధంగా చేసిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కడితే అందరి ఆశీస్సులూ ఉంటాయి. అక్కడ జరుగుతున్నది కొట్టేయకుండా వాస్తవాలను గమనించాలని కోరుతున్నా. 

వారు అడుగుతున్న దాంట్లో తప్పేముంది?
పట్టిసీమలో ప్రాజెక్ట్ కోసం ఎకరాకు రూ.25 లక్షల చొప్పున రైతులకు పరిహారం ఇచ్చా రు. ఏ ప్రాజెక్ట్ వ్యయంలోనైనా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ రెండు 3 శాతానికి మించదు. ఈ రెండు మూడు శాతం వల్ల ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని, ఏదో జరుగుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎంత ఎక్కువ వేసుకున్నా ప్రాజెక్టు వ్యయంలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ 5శాతం లోపే ఉంటుంది. నిర్వాసితులు అడుగుతున్న దానిలో తప్పేముం ది? వారికి కొత్త చట్టం ప్రకారం ప్యాకేజీ ఇచ్చి మేలు చేయండి’’ అని జగన్ విజ్ఞప్తి చేశారు.

కరెంటు, నీటి సరఫరా నిలిపేశారు
‘‘పోలవరం నిర్వాసిత గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది. ఆ గ్రామాలకు నీటి సరఫరా నిలిపివేశారు. కరెంట్ కట్ చేశారు. బడి మూసేశారు. సంక్షేమ కార్యక్రమాలేవీ జరగడం లేదు. రామయ్యపేట, పైడిపాక, సింగన్నపల్లి, చేగొండపల్లి గ్రామాలను ఖాళీ చేయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా చేగొండపల్లిని వెంటనే ఖాళీ చేయించాలని రెండు నెలలుగా ఒత్తిడి తెస్తున్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలులో భాగంగా చేగొండపల్లి నిర్వాసితులు, భూమి లేని కుటుంబాలకు రూ.1.7లక్షలు, భూమి ఉన్న వారికి మరోచోట భూమితోపాటు రూ.1.7 లక్షలు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు.

ప్రతి కుటుంబానికి ఇంటి స్థలమిచ్చి రూ.3.15 లక్షలతో ఇల్లు నిర్మిస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన యువతులకు రూ.5.95 లక్షలు చెల్లిస్తామన్నారు. అయితే, ప్రభుత్వం ప్రకటించిన పరిహారం, పునరావాస ప్రాంతాల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై అసంతృప్తితో ఉన్న చేగొండపల్లికి చెందిన 110 గిరిజన కుటుంబాలు ఖాళీ చేసేం దుకు ససేమిరా అంటున్నాయి’’ అని ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని జగన్ చదివి వినిపించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement