ఉపఎన్నిక సందడి షురూ
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా భూమా అఖిల ప్రియ
* శోభమ్మ కుమార్తెగా ఈమెకు మంచి పేరు
* గత ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర
* ఆళ్లగడ్డలో అత్యధిక సార్లు భూమా కుటుంబానిదే విజయం
* సెంటిమెంట్‌కు టీడీపీ కట్టుబడి ఉంటుందా?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉపఎన్నిక సందడి ప్రారంభమైంది. ఈ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమా అఖిల ప్రియ పేరును గురువారం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. ఈమె నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతుల కుమార్తె. గత ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేశారు. ఓటుతో భూమా కుటుంబానికి అండగా నిలవాలని విస్తృత ప్రచారం చేశారు. ఫలితంగా ఆ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డికి అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి.
ఈ నియోజకవర్గంలో మొత్తం 2,20, 812 ఓట్లు ఉండగా శోభా నాగిరెడ్డికి 1,72, 908 వచ్చాయి. సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన గంగుల ప్రభాకర్ రెడ్డికి 74,180 ఓట్లు పోలయ్యాయి. శోభా నాగిరెడ్డి 92,108 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఆమె పోలింగ్ కంటే ముందే మృతి చెందడంతో తిరిగి ఉప ఎన్నిక అనివార్యమైంది. రెండు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 14 నుంచి 21 వరకు నామినేషన్లను స్వీకరించాలని, వచ్చే నెల 8వ తేదీన పోలింగ్ జరపాలని ఆదేశించింది. వచ్చే నెల 12వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని ప్రకటించింది. దీంతో జిల్లాలో ఉప ఎన్నిక హడావుడి మొదలైంది. అయితే ఈ ఎన్నికకు టీడీపీ దూరంగా ఉంటుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. నందిగామ ఉపఎన్నికలో మానవతా దృక్పథంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ నుంచి విరమించుకుంది.
ఆళ్లగడ్డలో టీడీపీ అదే విధంగా వ్యవహరించనుందో లేదో తెలియాల్సి ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ గతంలో జరిగిన ఆళ్లగడ్డ ఎన్నికల్లో అత్యధిక పర్యాయాలు భూమా కుటుంబమే విజయం సాధిస్తూ వచ్చింది. ఈ నియోజకవర్గం 1962లో ఐదు మండలాలతో ఏర్పాటైంది. 2009లో పునర్విభజనతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని గోస్పాడు మండలాన్ని నంద్యాలకు కలిపారు. కోవెలకుంట్ల నియోజకవర్గంలోని దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాలను ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కలిపారు. వీటితోపాటు శిరివెళ్ల, రుద్రవరం, చాగలమర్రి మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి.
ఈ నియోజకవర్గానికి మొత్తం 15 సార్లు ఎన్నికలు నిర్వహించగా శోభా నాగిరెడ్డి అత్యధికంగా ఐదు సార్లు విజయం సాధించారు. గంగుల ప్రతాపరెడ్డి మూడుసార్లు, ఎస్వీ సుబ్బారెడ్డి, గంగుల తిమ్మారెడ్డి, భూమా నాగిరెడ్డి రెండు సార్లు విజయకేతనం ఎగురవేశారు. అసెంబ్లీకి జరిగిన ప్రతి ఎన్నికలోనూ శోభా నాగిరెడ్డి విజయం సాధించడం గమనార్హం. మొదటి నుంచి ఆళ్లగడ్డలో భూమా, గంగుల గ్రూపుల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతూ వచ్చింది. పార్టీలకతీతంగా గ్రూపు రాజకీయాలకు ఆళ్లగడ్డకు ప్రత్యేకత ఉంది.