వైవీయూ : వేల సంఖ్యలో విద్యార్థులు, వందల సంఖ్యలో అధ్యాపకులు, పరిశోధకులు, ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీతలు కలిసే సమ్మేళనం.. భవిష్యత్ పరిశోధనలకు నిర్మాణాత్మక మార్గదర్శనం చేసే ఏపీ సైన్స్‌కాంగ్రెస్–2018 నిర్వహణ అవకాశం వైవీయూకు దక్కడం అరుదైన అవకాశం. కొత్తగా ఏర్పాటైన విశ్వవిద్యాలయాల్లో వైవీయూకు మాత్రమే ఈ అరుదైన అవకాశం లభించడం విశేషం. కాగా గతేడాది ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించగా అంతకు ముందు ఎస్‌వీయూ, నాగార్జున విశ్వవిద్యాలయాలు నిర్వహించాయి. 2018 నవంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు 4వ ఏపీ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సహకారంతో యోగివేమన విశ్వవిద్యాలయ అధికారులు సన్నద్ధమవుతున్నారు.
సిద్ధమవువుతున్నారు ఇలా..
ఏపీ సైన్స్ కాంగ్రెస్–2018 నిర్వహణను వైవీయూ అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాగా ఏపీ సైన్స్‌కాంగ్రెస్ ప్రారంభోత్సవానికి ముఖ్య మంత్రి, మానవవనరులశాఖ మంత్రి, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉండేలా చూసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. మరో 28 రోజుల గడువు మాత్రమే ఉండటంతో పనులను వేగవంతం చేస్తున్నారు. సెషన్ల వారీగా కమిటీలను ఏర్పాటు చేశారు. రూసా నిధులతో సిద్ధం చేస్తున్న ఈ–క్లాస్ రూంలు అందుబాటులోకి తీసుకువచ్చారు.
వైవీయూ ప్రధాన ద్వారాన్ని సుందరీకరణ చేస్తున్నారు. ఆర్ట్స్‌బ్లాక్‌కు వెళ్లేమార్గంలో కల్వర్టు నిర్మాణ పనులను రూ.4.9 లక్షలతో పూర్తి చేస్తున్నారు. దీంతో పాటు ఆర్ట్స్‌బ్లాక్‌లో ఉన్న మూడు సెమినార్‌హాల్స్‌ను, ప్రస్తుత ఏడీ బిల్డింగ్ వద్ద ఉన్న మరో సెమినార్‌హాల్‌ను ఏపీ సైన్స్‌కాంగ్రెస్ నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా సిద్ధం చేస్తున్నారు. వీటితో పాటు విశ్వవిద్యాలయంలోని 9 విభాగాల విద్యార్థులను నూతనంగా నిర్మించిన ఆర్ట్స్‌బ్లాక్‌లోకి తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. ఏపీ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు ప్రభుత్వంతో పాటు ఇందులో భాగస్వాములయ్యే విశ్వవిద్యాలయాలు సైతం తమ వంతుగా రూ.2 లక్షల చొప్పున నిధులు అందజేసే అవకాశం ఉండటంతో విశ్వవిద్యాలయానికి మరిన్ని మౌలిక సదుపాయాలు ఒనగూరే అవకాశం ఉంది.
విద్యార్థులకు ఉపయోగకరం..
ఇటువంటి ప్రతిష్టాత్మకమైన కాన్ఫరెన్స్‌లు విశ్వవిద్యాలయంలో నిర్వహించడం ద్వారా సైన్స్‌పై ఆకర్షితులవడంతో పాటు ఎన్నో నూతన విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే నవంబర్ 9, 10 తేదీల్లో చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ పేరుతో రెండురోజుల పాటు సైన్స్ ప్రాజెక్ట్స్, ప్రదర్శనలు నిర్వహించనున్నారు. సైన్స్‌కాంగ్రెస్‌కు దాదాపు 2వేల మందికిపైగా పరిశోధకులు వస్తారని అంచనా. వీరితో పాటు 10 నుంచి 15 మంది వరకు ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలు, వివిధ రంగాల్లో ఖ్యాతి గడించిన ముఖ్య వక్తలు వచ్చే అవకాశం ఉంది.
9 సెషన్స్‌గా నిర్వహణ..
విశ్వవిద్యాలయంలో నిర్వహించే ఏపీ సైన్స్‌కాంగ్రెస్‌లో 9 సెషన్స్‌లో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటివరకు 695 థీసిస్ పత్రాలు విశ్వవిద్యాలయానికి అందినట్లు సమాచారం.
ప్రఖ్యాత శాస్త్రవేత్తల ప్రసంగాలు..
శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇండియన్ నోబెల్‌గా భావించే శాంతిస్వరూప్ భట్నాగర్ పురస్కారాన్ని పొందిన ముగ్గురు ప్రఖ్యాత శాస్త్రవేత్తలు మోహన్‌రావు, వెంకటరత్నం, వెంకటకృష్ణారెడ్డి ఈ సైన్స్‌కాంగ్రెస్‌కు రానున్నారు. వీరితో పాటు విదేశాల నుంచి సైతం ఇద్దరు లేదా ముగ్గురు ప్రముఖ శాస్త్రవేత్తలు వచ్చే అవకాశం ఉంది.
చాలెంజ్‌గా భావించి విజయవంతం చేస్తాం
నూతన విశ్వవిద్యాలయాల్లో ఏపీ సైన్స్‌కాంగ్రెస్ నిర్వహించే అవకాశం వైవీయూకు లభించడం సంతోషంగా ఉంది. వచ్చిన అవకాశాన్ని చాలెంజ్‌గా తీసుకుని విశ్వవిద్యాలయ ఖ్యాతి చాటిచెప్పేలా సైన్స్‌కాంగ్రెస్‌ను విజయవంతం చేస్తాం. 10 నుంచి 15 మంది ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఈ సైన్స్‌కాంగ్రెస్‌కు వచ్చి మార్గదర్శనం చేయనున్నారు.
– ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి, వైస్ చాన్సలర్, వైవీయూ
Comments
Please login to add a commentAdd a comment