నెల్లూరు(క్రైమ్):‘బెల్టుషాపులు నిర్వహిం చరాదు ..ఎమ్మార్పీకే విక్రయాలు జరపాలి.. బార్‌కోడింగ్ అమలుచేయాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఉత్తర ప్రగల్భాలేనని ప్రస్పుటమవుతోంది. బెల్టుతీయలేక ప్రభుత్వం చతికలబడటంతో ఊరూవాడ బెల్టుషాపులు దర్శనమిస్తూ మద్యాన్ని ఏరులై పారిస్తున్నాయి. చివరకు పాన్‌షాపుల్లో కూడా బెల్టు నిర్వహిస్తూ...విక్రయాలు జరుపుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు మొక్కుబడి చర్యలకే పరిమితమవుతున్నారు. క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న బెల్టుషాపులను పరిశీలిస్తే నిషేధం ఇక సాధ్యం కాదన్న విషయం తెలిసిపోయింది. ఉదయభానుడైనా...కాస్త ఆలస్యంగా వస్తాడేమో గానీ...మద్యం విక్రయాలు మాత్రం తెల్లవారుజామునుంచే ప్రారంభమవుతున్నాయి. అడపాదడపా దాడులతోనే ఎకై ్సజ్ అధికారులు సరిపెట్టుకుంటున్నారు.
2,500కు పైనే..
జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 940 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో అనధికారికంగా నిర్వహిస్తున్న బెల్టుషాపుల సంఖ్య దాదాపు 2,500కు పైగానే ఉంది. భారీ సంఖ్యలో బెల్టుషాపులు నడుస్తున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం ఒక్కటి లేదనే బుకాయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 348 మద్యం దుకాణాలు, 48 బార్లు ఉన్నాయి.
2014-15 ఆర్థిక సంవత్సరానికి సబంధించి అధికారులు వేలంపాటలు నిర్వహించారు. 348 మద్యం దుకాణాలకు గాను 333 మద్యం దుకాణాలను లాటరీలో వ్యాపారులు దక్కించుకున్నారు. ఐఎంఎల్ డిపో నుంచి రోజుకు సుమారు రూ.2కోట్ల విలువైన మద్యాన్ని దుకాణదారులు తీసుకెళుతున్నారు. దుకాణాల వారీగా ప్రాంతాన్ని బట్టి రోజుకు రూ.30 వేల నుంచి రూ. లక్షకు పైగా వ్యాపారం జరుగుతోంది. వీటిలో ఎక్కువశాతం బెల్టుదుకాణాల ద్వారానే అమ్ముడుపోతోంది.
కొన్ని దుకాణాల్లో అయితే కౌంటర్ సేల్‌కన్నా, బెల్టుషాపుల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ. లెసైన్సుడ్ షాపులను జాతీయపండగల రోజులు, ఎన్నికల సమయంలో మూసివేయాల్సి ఉంటుం ది. నిర్ణీత వేళల్లోనే ఇక్కడ మద్యం అమ్మకాలు సాగించాలి. బెల్టుషాపులకు మాత్రం వేళాపాళా లేదు. రోజంతా విక్రయాలు సాగుతుంటాయి. ఈ కారణంగా బెల్టుషాపులపై ఈగ వాలకుండా వ్యాపారులు ఎప్పటికప్పుడు ఆబ్కారీ అధికారులుకు భారీగా ముడుపులు ముట్టజెబుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు మొక్కుబడి దాడులు నిర్వహిస్తూ తమ పనైపోయిందని చేతులు దులుపుకొంటున్నారు.
సిండికేట్‌లు..అనధికార విక్రయాలు
ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. జిల్లాలోని మద్యం వ్యాపారులు సిండికేట్లుగా మారారు. దీంతో ఎంఆర్‌పీ ఊసేలేదు. ప్రతి బ్రాండ్‌పై రూ. 10 నుంచి రూ.15 వరకు అధికంగా విక్రయిస్తూ మందుబాబుల జేబులకు చిల్లుపెడుతున్నారు. పర్మిట్ గదులు కాస్తా బార్‌లను తలపిస్తున్నాయి. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జాతీయ రహదారి వెంబడి దాబాలు అనధికర బార్లుగా మారాయి. 24 గంటలు మద్యం అందుబాటులో ఉండటంతో పూటుగా మద్యం తాగుతున్న మందుబాబులు ప్రమాదాల బారిన పడి మృత్యువాతపడుతున్నారు.
భారీగా మామూళ్లు....
ఎక్సైజ్, పోలీసు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో మద్యం వ్యాపారుల పరిస్థితి మూడు బీర్లు....ఆరు క్వార్టర్లు అన్న చందాన తయారైందని ఆరోపణలున్నాయి. ప్రతి పోలీసుస్టేషన్‌కు ప్రాంతాన్ని బట్టి ఒక్కో దుకాణదారుడు రూ. 5 నుంచి, రూ. 15వేలు ముడుపులు చెల్లించుకుంటున్నట్లు సమాచారం. ఎక్సైజ్ అధికారుల సంగతి సరేసరి. ఇటీవల పోలీసులు నైట్‌సేల్స్, అనధికార బెల్టుదుకాణాలపై దాడులు ప్రారంభించి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటుండటంతో ఆబ్కారీలో చలనం మొదలైంది.
బెల్టు తీయలే..
Published Wed, Dec 17 2014 1:30 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement