మీరు చెపితేనే టీడీపీకి ఓట్లు వేశాం..
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం గుంటూరులో జనసేన నేత, హీరో పవన్ కల్యాణ్ ఆదివారం పర్యటించారు. ఈ క్రమంలో మూడు గ్రామాలకు చెందిన రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పెనుమాక, ఉండవల్లి, ఎర్రబాలెం, బేతపూడి రైతులు ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. 'మీరు వేయమంటేనే తెలుగుదేశానికి ఓట్లు వేశాం. ఇపుడు మీరే మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వ్యవస్థ మీద పోరాటానికి తమ శక్తి సరిపోవడంలేదని వాపోయారు. అందుకే ఈ భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మాకు మీ మద్దతు కావాల'ని పవన్ కల్యాణ్ ను కోరారు.
నిత్యం పంటలతో కళకళలాడే భూములను బీడుభూములంటున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛందంగా భూములిస్తున్నారంటూ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు చుక్కనీరు ఇవ్వకున్నా తాము మూడు పంటలు పండించుకుంటామన్నారు. భయపెట్టి, బెదిరించి భూములను లాక్కోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ఒక వార్డులో గెలవడం చేతకాని మంత్రి నారాయణ ఇపుడు రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన నిలబడి తమకు న్యాయం చేయాలంటూ జనసేన నేతకు విజ్ఞప్తి చేశారు.