పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు తాళభద్ర గ్రామానికి చెందిన కర్రి జగదీష్(23) అనుమానాస్పద స్థితిలో ఆదివారం
పలాస: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు తాళభద్ర గ్రామానికి చెందిన కర్రి జగదీష్(23) అనుమానాస్పద స్థితిలో ఆదివారం ఉదయం రైలు పట్టాలపై శవమై కనిపించాడు. శరీరమంతా ఛిద్రమై ఉండగా.. ఇది ప్రమాదమా? లేదా మరేదైనా కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు జగదీష్ నిర్భయ కేసులో ప్రధాన నిందితుడు కావడం గమనార్హం.
రైల్వే పోలీసులు, కుటుంబీకుల కథనం మేరకు... శనివారం రాత్రి జగదీష్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో భోజనం చేసి ఆ తరువాత చల్లగాలి కోసమంటూ డాబాపై పడుకున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం నిద్ర నుంచి మేల్కొని 5 గంటల సమయంలో కాలకృత్యాల కోసం ఇంటి నుంచి గ్రామ పొలిమేరలకు వెళ్లాడు. 7 గంటల సమయంలో గ్రామానికి అతిసమీపంలో ఉన్న తాళభద్ర రైల్వే గేటుకు పలాస రైల్వేస్టేషన్ పంప్‌హౌస్ మధ్యగల అప్‌లైన్‌పై అతని మృతదేహం తునాతునకలై పడి ఉంది. ఒక కాలు పూర్తిగా తెగిపడగా, తల, చేతులు ఇతర శరీర భాగాలు ఛిద్రమై కనిపించాయి. విషయం తెలుసుకుని కుటుంబీకులు హతాశులయ్యారు. గుండెలు బాదుకొని సంఘటన స్థలానికి వచ్చి బోరున విలపించారు. చేతికందిన ఒక్కగానొక్క కొడుకు ఈ విధంగా మృతి చెందడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తాళభద్ర రైల్వే గేట్ కీమెన్ జె.కృష్ణారావు పలాస జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ ఎస్‌ఎ మునఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడు నిర్భయ కేసులో ప్రధాన నిందితుడు
తాళభద్రకు చెందిన ఓ బాలికను జగదీష్‌తో పాటు గొనప రాజకుమార్, రంది షణ్ముఖరావు మానసికంగా వేధించారని, దీంతో ఆ చిన్నారి తన శరీరంపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని గాయాలపాలైందన్న ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. ఈ కేసులో ఎ1 నిందితుడైన జగదీష్.. సుమారు 45 రోజులు శ్రీకాకుళం జిల్లా కేంద్రం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
ఆర్మీ కానిస్టేబుల్‌గా ఎంపికై...
అనూహ్య పరిస్థితుల్లో కటకటాల్లోకి....
నిరుపేద కుటుంబానికి చెందిన జగదీష్ డిగ్రీ చదువుకున్నాడు. విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ అనునిత్యం పోటీ పరీక్షలకు ప్రిపేరవుతూ ఉద్యోగాన్వేషణలో ఉన్న అతడు తెలివైన విద్యార్థి అని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ కేసు నమోదయ్యేసమయానికి ఆర్మీ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. వారం రోజుల్లో శిక్షణకు వెళ్లాల్సిన జగదీష్ అనూహ్య పరిస్థితుల్లో రిమాండ్ ఖైదీగా కటకటాల్లోకి వెళ్లాడు. బెయిల్‌పై వచ్చిన తర్వాత ఇంటి వద్ద ఉంటూ అవమాన భారంతో కుంగిపోతూ మానసికంగా బలహీనుడయ్యాడని గ్రామస్తులు చెబుతున్నారు. గత నెల 25న జగదీష్ తన చెల్లెలు వేణుకు వివాహం జరిపించాడు. ఈ సంఘటన ఎలా జరిగిందనేది ఎవరికీ కూడా మింగుడు పడడం లేదు. పలాస రైల్వే ఎస్‌ఐ ఎస్‌ఎ మునఫ్ తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. ప్రమాదవశాత్తు మృతి చెందినట్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మునఫ్ చెప్పారు.