మహబూబాబాద్ రూరల్ : అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపూసపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై బి.రాంచరణ్ తెలిపిన కథనం ప్రకారం ఎండీ. ఫకృద్దీన్–ఆశ దంపతుల ఏకైక కుమారుడు ఉమర్ (20) శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తెల్లవారుజామున కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆశ ఇంటిగేటు కొట్టి వెళ్లారు.
కొంత సమయానికి ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూసేసరికి ఉమర్ తలకు తీవ్ర గాయామై రక్తస్రావంతో పడి ఉండడాన్ని గమనించింది. వెంటనే అతడిని మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు మృతి చెందాడని నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులను స్థానిక వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వెన్నం లక్ష్మారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మహ్మద్ ఫరీద్ పరామర్శించారు.
బంధువుల ఆందోళన..
ఉమర్ మృతిపై కారణాలను పోలీసులు విచారణ చేస్తుండగా మృతుడి తండ్రి ఫకృద్దీన్ తరుపు బంధువులు మాత్రం తల్లి ఆశ అతడిని చంపి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ బి.రమేష్, ఎస్సై బి.రాంచరణ్ ఈదులపూసపల్లికి చేరుకుని వారితో మాట్లాడారు. ఎవరికైనా అనుమానం ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. సమగ్ర విచారణ జరిపి దోషులను తప్పనిసరిగా శిక్షిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment