మృతి చెందిన మహేష్ (ఫైల్)
రామవరప్పాడు(గన్నవరం): ఎనికేపాడు పల్లవి రైస్ మిల్లులో ఆదివారం వెలుగు చూసిన యువకుడి అనుమానాస్పద మృతి ఘటన మిస్టరీగా మారింది. తాపీ పని చేసుకునే మహేష్‌కు మూసివేసిన మిల్లులో పనేంటని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కావాలనే మహేష్‌కు మద్యం పోయించి మిల్లులోకి తీసుకెళ్లి హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
షాక్‌తో మృతి అని పోలీసులు..
విద్యుత్ షాక్‌తో మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యుత్ బకాయిలు ఉండటంతో 4 నెలల క్రితమే మిల్లుకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మిల్లులో విద్యుత్ సరఫరా లేనప్పుడు షాక్‌తో ఎలా మృతి చెందాడని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కాగా మహేష్ కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమారుడిని కచ్చితంగా హత్య చేశారని ఆరోపిస్తున్నారు.
పంపకాల మధ్య విభేదాలే హత్యకు...
మృతుడు మహేష్ దళితవాడలోని పలువురు యువకులు, రైస్ మిల్లులోని డ్రైవర్లు ముఠాగా ఏర్పడి మిల్లుల్లో చోరీలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. మూసివేసిన మిల్లులోని మోటార్లు, తదితర వస్తువులను వీరు రాత్రిళ్లు చోరీ చేసి పక్క జిల్లాలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. దొంగ సొత్తు పంపకాల్లో తేడా వచ్చి మిగిలిన వారే తీవ్రంగా కొట్టి హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సరఫరా ఆపేశాం
గ్రామంలోని పల్లవి రైస్ మిల్లు విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో మార్చిలో విద్యుత్ సరఫరా నిలిపి సీల్ కూడా వేశాం. ఎట్టిపరిస్థితుల్లో మిల్లులో విద్యుత్ సరఫరాకు అవకాశం లేదు. మిల్లు పక్కన గృహ సముదాయాల నుంచి విద్యుత్ పునరుద్ధరించడానికి అవకాశం లేదు. –గోవిందరాజులు, విద్యుత్ ఏఈ
పోస్ట్‌మార్టం నివేదికఆధారంగా చర్యలు
మహేష్ మృతదేహన్ని ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం. ప్రాథమిక విచారణలో భాగంగా విద్యుత్ షాక్‌తో మరణించినట్లు సమాచారం. మృతుడి చేతిలో కూడా విద్యుత్ వైర్లు ఉన్నాయి. మిల్లులో మోటార్లు, వైర్లు దొంగతనం జరుగుతున్నాయని మా విచారణలో తెలిసింది.–ఉమామహేశ్వరరావు, సీఐ పటమట
Comments
Please login to add a commentAdd a comment